ధావన్‌ ధనాధన్.. ఢిల్లీ స్కోరు 190.. సన్ రైజర్స్ ఛేదించేనా?

  • Published By: sreehari ,Published On : November 8, 2020 / 09:47 PM IST
ధావన్‌ ధనాధన్.. ఢిల్లీ స్కోరు 190.. సన్ రైజర్స్ ఛేదించేనా?

Sunrisers Hyderabad target : చావోరేవో.. ఫైనల్ కా.. ఇంటికా? తేల్చే మ్యాచ్.. క్వాలిఫైయర్ 2లో గెలిచిన జట్టే ఫైనల్ బెర్త్ సొంతం చేసుకుంటుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన ఢిల్లీ క్యాపిటిల్స్ ఆకాశమే హద్దుగా చెలరేగింది. ఓపెనర్ శిఖర్ ధావన్ ధనాధన్ పరుగులతో దుమ్మురేపాడు.



ధావన్‌ (78; 50 బంతుల్లో, 6×4, 2×6) హాఫ్ సెంచరీతో చివరిదాకా నిలిచి ఢిల్లీకి భారీ స్కోరును అందించాడు. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి ఢిల్లీ 189 పరుగులు చేసింది. దాంతో ఢిల్లీ హైదరాబాద్‌కు 190 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.



ఓపెనర్లు స్టాయినిస్ (38), ధావన్‌ ఆదిలోనే చెలరేగి ఆడారు. బౌండరీల మోత మోగిస్తూ ఢిల్లీ స్కోరుబోర్డు పరుగులు పెట్టించారు. స్టాయినిస్‌ను రషీద్‌ క్లీన్‌బౌల్డ్‌ చేయడంతో 86 పరుగుల వద్ద ఢిల్లీ తొలి వికెట్ కోల్పోయింది. అనంతరం కెప్టెన్ శ్రేయస్‌ అయ్యర్‌ బరిలోకి దిగాడు.



ధావన్‌‌తో అయ్యర్ (21; 20 బంతుల్లో, 1×4)తో దూకుడుగా ఆడారు. ఈ క్రమంలో శ్రేయస్‌ హోల్డర్ బౌలింగ్‌లో పాండే చేతిలో క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. క్రీజులోకి వచ్చిన హెట్‌మైయర్‌ (42) పరుగులతో రాణించాడు.

హైదరాబాద్ బౌలర్లు విజృంభించారు. కట్టదిట్టమైన బౌలింగ్ తో పరుగులు రాబట్టనివ్వలేదు. ఆఖరి ఓవర్ వరకు పరుగులు పారించిన ధావన్.. సందీప్ శర్మ బౌలింగ్‌లో ఎల్బీగా పెవిలియన్ చేరాడు.



నిర్ణీత ఓవర్లు ముగిసే సమయానికి హిట్ మెయిర్ (42 నాటౌట్), పంత్ (2 నాటౌట్) క్రీజులో ఉన్నారు. ఇక హైదరాబాద్‌ బౌలర్లలో సందీప్, రషీద్‌, హోల్డర్‌ తలో వికెట్ తీశారు. ఛేదనలో తిరుగులేని సన్ రైజర్స్ ఢిల్లీ భారీ లక్ష్యాన్ని ఛేదించగలదో లేదో చూడాలి. 190 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తే.. హైదరాబాద్ ఫైనల్ బెర్త్ ఖాయమైనట్టే..