Sonu Sood : ‘దేశం మెచ్చిన మొనగాడు’.. సోనూ సూద్‌తో 10 టీవీ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ

దేశంలోని ఏ మూల నుంచి అడిగినా వెంటనే సాయం చేస్తున్నారు సోనూ సూద్‌..

Sonu Sood : ‘దేశం మెచ్చిన మొనగాడు’.. సోనూ సూద్‌తో 10 టీవీ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ

10 Tv Exclusive Live With Actor Sonu Sood

Sonu Sood: దేశంలోని ఏ మూల నుంచి అడిగినా వెంటనే సాయం చేస్తున్నారు సోనూ సూద్‌. తాము కష్టాల్లో ఉన్నామని ఒక్క ట్వీట్ చేస్తే చాలు.. క్షణాల్లోనే స్పందించి.. వారికి అవసరమైన సాయం చేస్తున్నారు. సామాన్య ప్రజలే కాదు.. అన్నీ ఉన్న సెలబ్రిటీలకు కూడా ఇప్పుడు సోనూ సూదే దిక్కయ్యారు. అందుకే అభిమానులు ఆయనకు గుడికట్టి పూజిస్తున్నారు.

కరోనా కష్టకాలంలో ప్రతి ఒక్కరు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా కోవిడ్ రోగుల బాధలు వర్ణణాతీతం. ఆక్సిజన్ అందక, మందులు దొరక్క.. బెడ్స్ కూడా అందుబాటులో లేక అల్లాడిపోతున్నారు. ఇలాంటి సమయంలో వారంతా ఒక్కే ఒక్కడిని నమ్ముకున్నారు. ఆయనే సోనూ సూద్. ఆపద్భాందవుడిగా కరోనా రోగులకు సాయం చేస్తున్నారు.

కరోనా కష్టకాలంలో సాయం కోసం చూస్తున్న ప్రతి ఒక్కరి నోటా వినిపిస్తున్న మాట సోనూ సూద్. అవును, మూవీ రీల్‌లో విలన్‌గా మెప్పించిన ఆయన.. ఇప్పుడు రియల్ హీరోగా మారిపోయారు. కరోనా ఫస్ట్ వేవ్ నుంచి ఇప్పటి వరకూ అడిగి వారికి లేదనకుండా సాయం చేస్తున్నారు. కరోనా ఫస్ట్ వేవ్‌లో ఎంతో మంది కడుపులు నింపారు. కరోనా కష్టకాలంలో వలస కార్మికులను సొంత డబ్బుతో బస్సులు, రైళ్లు, విమానాలు ఏర్పాటు చేసి మరీ స్వస్థలాలకు పంపారు. అంతే కాదు దేశవ్యాప్తంగా అనేక మందికి సాయం చేశారు సోనూసూద్.

చిత్తూరు జిల్లాలో కూతుర్లను కాడెద్దులుగా చేసి పొలం దున్నుతున్న ఓ రైతు కష్టం చూసి ఆయనకు ఆసరాగా నిలిచి ఆదర్శంగా నిలిచిన గొప్ప మనసు ఆయనది. సినిమాల్లో విలన్ పాత్రలు పోషించినా నిజ జీవితంలో మాత్రం ‘రియల్ హీరో’ అనిపించుకున్నారు సోనూ సూద్‌. మీడియాలో, సోషల్ మీడియాలో ఇప్పుడు ఆయనో సెలబ్రెటీ.

ఇప్పుడు సెకండవేవ్‌లో కోవిడ్ రోగులకు ప్రాణాలు పోస్తున్నారు. మన దేశంలో తీవ్రమైన ఆక్సిజన్ కొరత నెలకొన్న నేపథ్యంలో విదేశాల నుంచి ఆక్సిజన్ ప్లాంట్స్‌ను తెప్పిస్తున్నారు. ప్రభుత్వాలకు ధీటుగా కోవిడ్ రోగులకు ఆక్సిజన్ సరఫరా చేస్తున్నారు. చిత్తూరు జిల్లా గుడుపల్లె మండలం చిన్నపర్తికుంట గ్రామానికి చెందిన ధనుంజయులు అనే వ్యక్తి కరోనా బారిన పడ్డాడు. ఆయనకు ఆక్సిజన్ అవసరమైంది. దీంతో ఆక్సిజన్ కాన్సెంట్రేటర్ కావాలంటూ సోనూ సూద్‌కు వాట్సాప్ సందేశం పంపారు. ఆ సందేశం పంపిన ఎనిమిది గంటల్లోనే ఆక్సిజన్ కాన్సెంట్రేటర్‌ను ఆ కరోనా బాధితుడికి పంపారు. ఇలా అడిగిన వారికి క్షణాల్లో సాయం చేస్తూ ‘పిలిస్తే పలికే దేవుడు’ అనిపించుకుంటున్నారు సోనూ సూద్. ఆయన చేస్తున్న సాయంపై దేశం నలుమూలల నుంచి ప్రశంసల జల్లు కురుస్తోంది.

కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. ఈ సమయంలో సినీ నటుడు సోనూ సూద్ ప్రభుత్వం కంటే వేగంగా పని చేస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. సోషల్ మీడియా ద్వారా ఎవరు సాయం అడిగినా కూడా వెంటనే స్పందించి తనకు సాధ్యం అయినంత వరకు సాయం చేస్తూ వస్తున్నాడు. ప్రముఖులు కూడా సోనూ సూద్ నుండి సాయం పొందుతున్నారు. ఈ మధ్యకాలంలో క్రికెటర్ రైనా తన ఆంటీకి ఆక్సీజన్ సిలిండర్ అవసరం అంటూ పోస్ట్ పెట్టగానే ఆమెకు ఆక్సిజన్ సిలిండర్ అందించాడు సోనూసూద్.

తాజాగా టాలీవుడ్ డైరెక్టర్ మెహర్ రమేష్ కూడా సోనూను హెల్ప్ కావాలంటూ వేడుకున్నాడు. వెంకట రమణ అనే పేషంట్‌కు మందులు, అత్యవసర కిట్ అవసరం అంటూ మెహర్ రమేష్ ట్విట్టర్ ద్వారా సోనూను అభ్యర్థించాడు. దీంతో వెంటనే స్పందించిన సోనూ సూద్.. మెహర్ రమేష్ అడిగిన మందులు మరియు ఇతర అవసరాలకు సంబంధించిన పరికరాలను కేవలం 24 గంటల లోపులో సమకూర్చాడు. దీంతో తనకు అందిన సాయంను మెహర్ రమేష్ మళ్లీ ట్వీట్ చేశాడు. వెంకట రమణకు సోనూ సూద్ చేసిన సాయంను మెహర్ రమేష్ చూపించాడు. సోషల్ మీడియాలో వీరిద్దరి సంభాషణ అప్పట్లో వైరల్‌గా మారింది.

సామాన్య ప్రజలకు నేనున్నాను అంటూ సేవలు చేస్తున్న సోనూ సూద్‌ను.. ఇప్పుడు ఏకంగా ఓ జిల్లా కలెక్టర్ సాయం కోరారు. నెల్లూరు జిల్లాలో ఆక్సిజన్ జనరేటర్ లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్న ప్రజలను ఆదుకోవాలని నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు సోనూ సూద్‌కి లేఖ రాశారు. గతంలో సోనూ సూద్‌తో ఉన్న పాత పరిచయంతో కలెక్టర్ చక్రధర్ బాబు విషయాన్ని సోనూ సూద్‌కు వివరించారు. దీనిపై వెంటనే స్పందించిన సోనూ సూద్.. కోటి యాభై లక్షల ఖర్చుతో ఆత్మకూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుకు అంగీకరించారు.

కొన్ని రోజుల క్రితం వరంగల్‌కు చెందిన ఓ యువతికి కరోనా లాక్‌డౌన్ వల్ల ఉద్యోగం పోవడంతో ఆమెకు హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో జాబ్ ఇప్పించాడు. అందుకే సోనూ సూద్ సాయం చూసి తెలంగాణలోని సిద్దిపేట జిల్లా గిరిజనులు దేవుడిగా కొలుస్తున్నారు. ఆయనకు ఏకంగా గుడి కూడా కట్టేశారు. సిద్దిపేట జిల్లాలోని దుబ్బ తండాలో సోనూ సూద్‌కు గుడి కట్టారు అక్కడి గిరిజనులు. సోనూ సూద్ లక్షలాది మందికి చేస్తున్న సాయాన్ని చూసి తాము ఆయన్ని దేవుడిగా భావిస్తున్నామని, అందుకే గుడి కట్టామని స్థానికులు చెబుతున్నారు. కలియుగ దానకర్ణుడికి గుడి కట్టడం తాము చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నామని అక్కడి వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.