200 ప్రత్యేక రైళ్లు : తొలి కూత Telangana Express

  • Published By: madhu ,Published On : June 1, 2020 / 12:45 AM IST
200 ప్రత్యేక రైళ్లు : తొలి కూత Telangana Express

మళ్లీ రైళ్లు కూతపెడుతున్నాయి. స్పెషల్‌ ట్రైన్స్‌ పట్టాలెక్కాయి. లాక్‌డౌన్‌ కారణంగా దాదాపు 70 రోజులు జంక్షన్‌లకే పరిమితమైన రైళ్లు… రైళ్లు ప్రారంభమయ్యాయి. పట్టాలపై కూత పెట్టుకుంటూ పరుగు తీస్తున్నాయి. దేశ వ్యాప్తంగా 200 రైళ్లకు కేంద్రం ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పరిమిత సంఖ్యలో రైళ్ల రాకపోకలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన దేశంలోని పలు స్టేషన్ల నుంచి రైళ్లు ప్రారంభం అయ్యాయి. దక్షిణ మధ్య రైల్వేకు సంబంధించి 8 రైళ్లు నడుపుతోంది. సికింద్రాబాద్‌లోని రైల్వే స్టేషన్‌లోనూ రైళ్లు పట్టాలెక్కాయి. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

రైళ్ల పునప్రయాణం తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌తో మొదలు కానుంది. ఈ రైలు నాంపల్లి స్టేషన్‌ నుంచి ప్రారంభమైంది. ఆ తర్వాత సికింద్రాబాద్‌ నుంచి దానాపూర్‌ వెళ్లే ఎక్స్‌ప్రెస్ మొదలవుతుంది. ఇక మధ్యాహ్నం సికింద్రాబాద్‌ నుంచి గుంటూరు వెళ్లే గోల్కొండ ఎక్స్‌ప్రెస్, అనంతరం ముంబై వెళ్లే హుస్సేన్‌సాగర్‌ ఎక్స్‌ప్రెస్, తర్వాత హౌరా వెళ్లే ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ బయలుదేరుతాయి. సాయంత్రం నిజామాబాద్‌ నుంచి తిరుపతి వెళ్లే రాయలసీమ ఎక్స్‌ప్రెస్, ఆ తర్వాత విశాఖపట్నం వెళ్లే గోదావరి ఎక్స్‌ప్రెస్‌ స్టార్ట్‌ అవుతాయి. 

ఇప్పటికే నెలకు సంబంధించిన బెర్తులన్నీ ఫుల్‌ అయ్యాయి. తొలుత ఈ రైళ్లకు నెల రోజుల రిజర్వేషన్‌ మాత్రమే కల్పించారు. ఆ తర్వాత 120 రోజులకు పెంచారు. మిగతా రోజులకూ రిజర్వేషన్‌ వేగంగా పూర్తవుతోంది. నాలుగు రైళ్లకే కొన్ని సీట్లు ఖాళీ ఉండగా, మిగతావి దాదాపు పూర్తయ్యాయి. ఈ రైళ్లలో ప్రస్తుతానికి రిజర్వేషన్‌ ప్రయాణానికే అవకాశం కల్పించారు. దీంతో అన్‌రిజర్వ్‌డ్‌గా ఉండే జనరల్‌ బోగీల్లో కూర్చుని ప్రయాణించేలా సీట్లు ఏర్పాటు చేశారు. వాటికి కూడా రిజర్వేషన్‌ టికెట్లనే అందుబాటులో ఉంచారు.

ఇక విజయవాడ మీదుగా పద్నాలుగు రైళ్లు నడవనున్నాయి. విజయవాడ నుంచి ముంబై, భువనేశ్వర్, ఢిల్లీ, బెంగళూరు, చెన్నైలకు రాకపోకలు సాగించనున్నాయి. ఈ మేరకు రైల్వే శాఖ విజయవాడ స్టేషన్‌లో అన్ని ఏర్పాట్లను పూర్తిచేసింది. నాలుగు నెలల ముందునుంచే రిజర్వేషన్ చేసుకునే సౌకర్యాన్ని​ కల్పించింది. లాక్‌డౌన్‌లో సడలింపులు ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం… క్రమంగా అన్నిటికీ మినహాయింపులు ఇస్తోంది. భారతీయ రైల్వేకూ ప్రభుత్వం మినహాయింపులు ఇచ్చింది. దీంతో రైల్వేశాఖ తన సేవల్ని క్రమక్రమంగా పునరుద్ధరిస్తోంది. ఇప్పటివరకు శ్రామిక్ రైళ్లను నడిపిన భారతీయ రైల్వే… సోమవారం నుంచి 100 రూట్లలో 200 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఈ రైళ్ల ద్వారా తొలిరోజున దాదాపు లక్షా 45వేల మంది ప్రయాణికులను చేరవేయనున్నట్లు తెలిపింది.