Blood Pressure : ప్రోటీన్లతో కూడిన సమతుల్య ఆహారం….హైబీపీ ప్రమాదాన్ని నివారిస్తుందా?

చైనా హెల్త్ అండ్ న్యూట్రిషన్ 2దశల్లో 12,200 పెద్దలపై సర్వేను నిర్వహించి వారి ఆరోగ్య సమాచారాన్ని విశ్లేషించారు. ప్రతి 2-4 సంవత్సరాలకు ఒకసారి సర్వే వివరాలను సేకరించారు.

Blood Pressure : ప్రోటీన్లతో కూడిన సమతుల్య ఆహారం….హైబీపీ ప్రమాదాన్ని నివారిస్తుందా?

Protein Foods (2)

Blood Pressure : వివిధ రకాల ఆహారాల నుండి ప్రోటీన్లను తీసుకుంటే, అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుందని కొత్త అధ్యయనంలో తేలింది. చైనాలో దాదాపు 12,200 మంది పెద్దలపై ఈ పరిశోధన నిర్వహించారు. మితమైన ప్రోటీన్‌తో కూడిన సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం వల్ల ప్రారంభంలో ఉన్న రక్తపోటును నివారించవచ్చని ఈ అధ్యయనం సూచిస్తుంది.ఈ కథనం అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జర్నల్‌లో ప్రచురితమైంది.

ఇటీవలి కాలంలో జనాభాలో దాదాపు సగం మందికి హైపర్‌టెన్షన్ లేదా అధిక రక్తపోటు సమస్య ఉంది. కార్డియోవాస్కులర్ వ్యాధికి ప్రధాన కారణాల్లో రక్తపోటు ఒకటి. చికిత్స చేయకుండా వదిలేస్తే, అధిక రక్తపోటు రక్తప్రసరణ వ్యవస్థను దెబ్బతీస్తుంది. గుండెపోటు, స్ట్రోక్ ,ఇతర ఆనారోగ్య పరిస్థితులకు కారణమౌతుంది. హైపర్‌టెన్షన్‌కు వ్యతిరేకంగా పోరాడటానికి పోషకాహారం ఎంతగానో దోహదం చేస్తుంది. మూడు ప్రాథమిక స్థూల పోషకాలలో కొవ్వు ,కార్బోహైడ్రేట్‌లతో పాటు ప్రోటీన్ కూడా ఒకటని చైనాలోని గ్వాంగ్‌జౌలోని సదరన్ మెడికల్ యూనివర్సిటీ, నాన్‌ఫాంగ్‌లోని నేషనల్ క్లినికల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ కిడ్నీ డిసీజ్ అధ్యయన రచయిత జియాన్‌హుయ్ క్విన్, ఎం.డి అన్నారు.

పోషకాహార లోపం వల్ల గలిగే హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదం, హృదయ సంబంధ వ్యాధుల వల్ల కలిగే మరణాల మధ్య బలమైన సంబంధం ఉంది. 2021లో హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి పోషకాహారనిపుణులు, అమెరికన్ హార్ట్ అసోసియేషన్ మొక్కల నుండి లభించే ప్రోటీన్ మూలాలను తినమని ప్రజలకు సలహా ఇస్తుంది. సీఫుడ్, తక్కువ కొవ్వు లేదా కొవ్వు రహిత పాల ఉత్పత్తులను తీసుకోవచ్చు. కావాలనుకుంటే మాంసం లేదా పౌల్ట్రీ ఉత్పత్తులను ప్రాసెస్ చేయకుండా తీసుకోవచ్చు. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం ప్రతిరోజూ ఒకటి నుండి రెండు సేర్విన్గ్స్ లేదా 5.5 ఔన్సుల ప్రోటీన్ ఉండే ఆహారాలు తీసుకోవాలని సిఫార్సు చేస్తోంది.

1997 నుండి 2015 వరకు చైనా హెల్త్ అండ్ న్యూట్రిషన్ 2దశల్లో 12,200 పెద్దలపై సర్వేను నిర్వహించి వారి ఆరోగ్య సమాచారాన్ని విశ్లేషించారు. ప్రతి 2-4 సంవత్సరాలకు ఒకసారి సర్వే వివరాలను సేకరించారు. ప్రారంభ సర్వేలో పాల్గొన్న వారి వివరాలను బేస్‌లైన్‌గా తీసుకున్నారు. అయితే వారి చివరి దశలోని సర్వే వివరాలను సరిపోల్చి చూశారు. పాల్గొనేవారి సగటు వయస్సు 41 సంవత్సరాలుకాగా వారిలో 47 శాతం మంది పురుషులు ఉన్నారు. సర్వే ప్రతిదశలోను నిపుణులు వారంలో 3 రోజుల పాటు 24-గంటల ఆహార సమాచారాన్ని సేకరించారు.

తృణధాన్యాలు, శుద్ధి చేసిన ధాన్యాలు, ప్రాసెస్ చేసిన ఎర్ర మాంసం, ప్రాసెస్ చేయని ఎర్ర మాంసం, పౌల్ట్రీ, చేపలు, గుడ్డు మరియు చిక్కుళ్ళు ఇలా ప్రోటీన్ యొక్క ప్రతి మూలానికి ఒక పాయింట్ ను కేటాయించారు. గరిష్టంగా 8 రకాల స్కోర్‌తో పరిశోధకులు ప్రోటీన్ వెరైటీ స్కోర్‌కు సంబంధించి ప్రారంభదశలో ఉన్న రక్తపోటు రావటానికి గల కారణాలను నిర్వచించారు. ప్రారంభ రక్తపోటు అనేది 140 mm Hg కంటే ఎక్కువ లేదా సమానంగా ఉంటే దానిని సిస్టోలిక్ రక్తపోటుగా నిర్వచించారు.

విశ్లేషణలో కనుగొన్న విషయాలను పరిశీలిస్తే దాదాపు 12,200 మంది పాల్గొనేవారిలో 35 శాతం కంటే ఎక్కువ మంది సర్వే సమయంలో అధిక రక్తపోటును ప్రారంభస్ధాయిలో ఉన్నట్లు కనుగొన్నారు. ప్రోటీన్ తీసుకునే అత్యల్ప వెరైటీ స్కోర్‌తో (2 కంటే తక్కువ) పాల్గొనేవారితో పోలిస్తే, అత్యధిక వెరైటీ స్కోర్ (4 లేదా అంతకంటే ఎక్కువ) ఉన్నవారికి అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం 66 శాతం తక్కువగా ఉన్నట్లు గమనించారు.

ఒకే ఆహారం నుండి ప్రొటీన్ తీసుకునే కంటే వివిధ మూలాల నుండి ప్రోటీన్లతో సమతుల్య ఆహారం తీసుకోవడం వల్ల హై బీపీ వచ్చే ప్రమాదాన్ని నివారించవచ్చని…దీని ద్వారా హృదయసంబంధిత సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చని రీసర్చర్ క్విన్ చెప్పారు. అయితే హైబీపీకి రావటానికి, నిరోధించటబడటానికి ఏరకమైన ప్రొటీన్ కారమైందో, ఎంత పరిమాణంలో తీసుకోవటం వల్ల అలా జరిగిందో మాత్రం వారు ఖచ్చితంగా నిరూపించలేకపోయారు.