మన ఎమ్మెల్యేల ఆస్తులు చూస్తే షాకవ్వాల్సిందే…ఏడీఆర్,ఎన్ఈడబ్ల్యూ రిపోర్టులో సంచలన వాస్తవాలు

దేశంలోని మన శాసనసభ్యుల ఆస్తులు చూస్తే మీరు షాకవ్వాల్సిందే. దేశంలోని 28 రాష్ట్రాలు, అసెంబ్లీలు ఉన్న రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 4001 మంది సిట్టింగ్ శాసనసభ్యుల మొత్తం ఆస్తుల విలువ రూ.54,545 కోట్లని వెల్లడైంది....

మన ఎమ్మెల్యేల ఆస్తులు చూస్తే షాకవ్వాల్సిందే…ఏడీఆర్,ఎన్ఈడబ్ల్యూ రిపోర్టులో సంచలన వాస్తవాలు

Rich Legislators

ADR,NEW Report : Party wise total assets sitting mlas : దేశంలోని మన శాసనసభ్యుల ఆస్తులు చూస్తే మీరు షాకవ్వాల్సిందే. దేశంలోని 28 రాష్ట్రాలు, అసెంబ్లీలు ఉన్న రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 4001 మంది సిట్టింగ్ శాసనసభ్యుల మొత్తం ఆస్తుల విలువ రూ.54,545 కోట్లని వెల్లడైంది. అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్), నేషనల్ ఎలక్షన్ వాచ్ (ఎన్ఈడబ్ల్యూ) తాజాగా విడుదల చేసిన నివేదికలో దేశంలోని ఎమ్మెల్యేల ఆస్తుల వివరాలు వెలుగుచూశాయి.  (Party wise total assets sitting mlas) దేశంలోని శాసనసభ్యుల మొత్తం ఆస్తులు మూడు రాష్ట్రాల ప్రస్థుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్ కంటే ఎక్కువని తేలింది. సిక్కిం, మిజోరం, నాగాలాండ్ రాష్ట్రాల్లో 2023-24 ఆర్థిక సంవత్సర బడ్జెట్ మొత్తం 49,103 కోట్ల రూపాయలు కాగా, మన దేశ ఎమ్మెల్యేల ఆస్తుల విలువ మూడు రాష్ట్రాల బడ్జెట్ కంటే ఎక్కువగా ఉన్నాయి. ఎమ్మెల్యేల ఆస్తుల వివరాలను వారు సమర్పించిన ఆస్తుల అఫిడవిట్ల నుంచి అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్, నేషనల్ ఎలక్షన్ వాచ్ (ADR,NEW Report) సేకరించి విశ్లేషించగా దిమ్మతిరిగిపోయే వాస్తవాలు వెలుగుచూశాయి.

బీజేపీ కాంగ్రెస్ నేతలే అత్యంత ధనవంతులు

దేశంలో 4033 శాసనసభా స్థానాలు ఉండగా 4,001 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలున్నారు. 84 రాజకీయ పార్టీలు, స్వతంత్ర శాసనసభ్యుల ఆస్తులను విశ్లేషిస్తే భారతీయ జనతాపార్టీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నేతలకే ఎక్కువ ఆస్తులున్నాయని తేలింది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల ఎమ్మెల్యేలకు రూ.32,032 కోట్ల ఆస్తులున్నాయని ఏడీఆర్,ఎన్ఈడబ్ల్యూ నివేదికలు స్పష్టం చేశాయి. బీజేపీ, కాంగ్రెస్ శాసనసభ్యులు మిగతా వారికంటే ధనవంతులని తేలింది. పేదలు దారిద్ర్యరేఖకు దిగువన దుర్భర జీవనం సాగిస్తూ పేదలుగానే ఉండగా, ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలు మాత్రం వారి ఆస్తులను పెంచుకుంటున్నారు. ఎమ్మెల్యేల సగటు ఆస్తి విలువ రూ.13.63 కోట్లని వెల్లడైంది.

వైకాప ఎమ్మెల్యేలకే అత్యధిక ఆస్తులు

మన తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన వైకాప శాసనసభ్యుల ఆస్తులు దేశంలోనే అత్యధికంగా ఉన్నాయి. ఏపీలోని 146 మంది వైకాప ఎమ్మెల్యేల ఆస్తుల సగటు చూస్తే అందరికంటే అత్యధికంగా రూ.23.14 కోట్లని తేలింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన 719 మంది ఎమ్మెల్యేల సగటు ఆస్తి విశ్లేషించగా రూ.21.97 కోట్లుగా ఉంది. దీంతో దేశంలో వైకాప ఎమ్మెల్యేలు అత్యంత ధనవంతులుగా నిలిచారు. తెలంగాణలోని భారాస సిట్టింగ్ శాసనసభ్యుల ఆస్తుల సగటు రూ.14కోట్లుగా ఉంది. దేశంలో బీజేపీకి చెందిన 1356 మంది ఎమ్మెల్యేల ఆస్తుల సగటు రూ.11.97 కోట్లుగా ఉంది. అందరికంటే తక్కువగా 161 మంది ఆమ్ ఆద్మీపార్టీ ఎమ్మెల్యేల సగటు ఆస్తి రూ.10.20గా ఉంది.

ఈశాన్య రాష్ట్రాల ఎమ్మెల్యేల ఆస్తులు తక్కువ

ఈశాన్య రాష్ట్రాల ఎమ్మెల్యేల ఆస్తులు తక్కువగా ఉన్నాయి. మణిపూర్ రాష్ట్రంలోని 60 మంది శాసనసభ్యుల మొత్తం ఆస్తులను లెక్కిస్తే కేవలం రూ.225కోట్లే ఉన్నాయి. మిజోరంలోని 40మంది ఎమ్మెల్యేలకు రూ.190కోట్లు, త్రిపురలోని 59మంది శాసనసభ్యులకు రూ.90 కోట్ల ఆస్తులున్నాయి. దేశంలోని ఇతర ప్రాంతాల ఎమ్మెల్యేల ఆస్తులతో పోలిస్తే ఈశాన్య రాష్ట్రాల ఎమ్మెల్యేల ఆస్తులు తక్కువగా ఉన్నాయి.

అత్యంత ధనవంతులు కర్ణాటక ఎమ్మెల్యేలు…

దేశంలోనే అత్యంత ధనవంతులైన ఎమ్మెల్యేలు కర్ణాటక రాష్ట్రంలో ఉన్నారు. అత్యధిక ఆస్తులున్న ఎమ్మెల్యేల రాష్ట్రంగా కర్ణాటక అగ్రస్థానంలో నిలిచింది. కర్ణాటక శాసనసభ్యులు ఆస్తుల విలువ మిజోరం, సిక్కిం రాష్ట్రాల వార్షిక బడ్జెట్ల కంటే అధికమని వెల్లడైంది. మొత్తం ఎమ్మెల్యేల ఆస్తుల్లో 26 శాతం వాటా కర్ణాటక నేతలదే. దేశంలోని 21 రాష్ట్రాల ఎమ్మెల్యేల ఆస్తుల కంటే కర్ణాటక శాసనసభ్యుల ఆస్తుల విలువ రెట్టింపు ఉండటం విశేషం. కర్ణాటకలోని 223 మంది ఎమ్మెల్యేలకు మొత్తం రూ.14,359 కోట్ల ఆస్తులతో దేశంలోనే అగ్రభాగాన నిలిచారు. మహారాష్ట్రలోని 284 మంది ఎమ్మెల్యేల మొత్తం ఆస్తుల విలువ రూ.6,679 కోట్లు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 174 మంది ఆస్తుల మొత్తాన్ని పరిశీలిస్తే రూ.4,914 కోట్లు ఉన్నాయి. ఏపీ ఎమ్మెల్యేలు ఆస్తుల్లో దేశంలోనే మూడో స్థానంలో ఉన్నారు.

రాజకీయ పార్టీల వారీగా ఎమ్మెల్యేల ఆస్తుల్లో బీజేపీ టాప్

దేశంలోని రాజకీయ పార్టీల వారీగా ఎమ్మెల్యేల మొత్తం ఆస్తుల విలువను లెక్కించగా బీజేపీ నేతలే అగ్రస్థానంలో ఉన్నారు. 1356 మంది బీజేపీ ఎమ్మెల్యేలకు రూ.16,234కోట్ల ఆస్తులున్నాయి. ఆస్తుల్లో కాంగ్రెస్ నేతలది రెండో స్థానం. దేశంలోని 719 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు రూ.15,798 కోట్ల ఆస్తులున్నాయి. మొత్తం ఆస్తుల్లో వైసీపీ నేతలు దేశంలోనే మూడో స్థానంలో నిలిచారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైసీపీ ఎమ్మెల్యేల మొత్తం ఆస్తుల విలువ రూ.3,379 కోట్లు. డీఎంకేకు చెందిన 131 మంది శాసనసభ్యుల మొత్తం ఆస్తులు రూ.1,663కోట్లున్నాయి. తెలంగాణలోని 103 భారాస ఎమ్మెల్యేలకు రూ.1,443 కోట్ల ఆస్తులున్నాయి. 19మంది టీడీపీ ఎమ్మెల్యేల మొత్తం ఆస్తుల విలువ 1311 కోట్లరూపాయలని తేలింది. 21 మంది జేడీ(ఎస్) ఎమ్మెల్యేల ఆస్తుల విలువ మొత్తం 879 కోట్లుగా నివేదిక వెల్లడించింది. బీజేడీకి చెందిన 113 మంది ఎమ్మెల్యేల సగటు ఆస్తి రూ.4.63కోట్లుగా ఉంది. ఏఐటీసీకి చెందిన 227 మంది శాసనసభ్యుల సగటు ఆస్తి విలువ రూ.3.51కోట్లుగా నిలిచింది. తెలుగుదేశం పార్టీకి చెందిన 19 మంది ఎమ్మెల్యేల సగటు ఆస్తి విలువ రూ.69.04 కోట్లు ఉంది. దేశంలో మజ్లిస్ పార్టీకి చెందిన 10 ఎమ్మెల్యేల ఆస్తుల సగటు విలువ రూ.7కోట్లుగా నిలిచింది. మొత్తం మీద దేశంలోని ఎమ్మెల్యేల ఆస్తులను చూసిన ఓటర్లు విస్తు పోతున్నారు.