Alzheimers : ఈ జాగ్రత్తలు పాటిస్తే అల్జీమర్స్ నివారణ సాధ్యమే!
వ్యాయామం వల్ల అల్జీమర్స్ ముప్పూ తగ్గుతుంది. మెదడుకు రక్తసరఫరా బాగా జరుగుతుంది. దీంతో కొత్త మెదడు కణాలు అభివృద్ధి చెందే ప్రక్రియ కూడా ప్రేరేపితమవుతుంది. తగినంత నిద్రపోవాలి. ఇది మెదడును తాజాగా ఉంచుతుంది.

Alzheimers
Alzheimers : మతిమరుపు అనేది చాలా మందిలో చూస్తుంటాం. ముఖ్యంగా వృద్ధాప్యంలో వచ్చే అల్జిమర్స్ వ్యాధి కారణంగా దైనందిన జీవితంలో అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. మనిషి మెదడు లోపల కొన్ని కణాలు దెబ్బతినడంవల్ల ఈ సమస్య ఉత్పన్నం అవుతుంది. కొన్ని తీవ్రమైన ఒత్తిడి కూడా దీనికి కారణమౌతుందని నిపుణులు చెబుతున్నారు. దీని బారిన పడితే భాష మీద ఆధిపత్యం, ఏకాగ్రత, భాషాచాతుర్యం, పరిశీలనాశక్తి వంటివి దెబ్బతింటాయి.
సమస్య పెరుగుతూ ఉంటే ముఖ్య సంఘటనలను మరచిపోతారు. ఇంట్లో మనుషుల్ని క్రమంగా గుర్తుపట్టలేకపోవడం ప్రారంభమవుతుంది. అల్జీమర్స్ వ్యాధి మెదడులోని జీవకణాలను ఒక్కొక్కటిగా నిర్జీవం చేస్తూ, మెదడును సరిగా పనిచేయనీయకుండా చేస్తుంది. అల్జీమర్స్ తో బాధపడేవారిని శారీరకంగా వివిధ కార్యక్రమాలతో యాక్టివ్‌గా ఉంచడం ద్వారా మెదడును ఆరోగ్యవంతం చేసి మతిమరుపు ముప్పును తగ్గించవచ్చు. ఇందుకోసం కొన్ని జాగ్రత్తలు పాటించటం ద్వారా దీనిని నివారించుకునేందుకు వీలుకలుగుతుంది.
పాటించాల్సిన జాగ్రత్తలు ;
వ్యాయామం వల్ల అల్జీమర్స్ ముప్పూ తగ్గుతుంది. మెదడుకు రక్తసరఫరా బాగా జరుగుతుంది. దీంతో కొత్త మెదడు కణాలు అభివృద్ధి చెందే ప్రక్రియ కూడా ప్రేరేపితమవుతుంది. తగినంత నిద్రపోవాలి. ఇది మెదడును తాజాగా ఉంచుతుంది. శరీరానికి, మనసుకు విశ్రాంతి కలిగిస్తుంది. వయసు మీద పడకుండా చేసే హార్మోన్లను విడుదల చేస్తుంది. ఈ హార్మోన్లు మెదడునూ చురుకుగా ఉంచుతాయి. మద్యం, పొగ అలవాట్లకు దూరంగా ఉండాలి. ఒమేగా3, ఒమేగా6, విటమిన్ ఈ, బీ12 దండిగా లభించే అవిసెలు, అక్రోటుపప్పు, పిస్తా, బాదం, జీడిపప్పు, పెరుగు, పాలు, మాంసం, చేపల వంటివి తరచుగా తీసుకోవాలి.
మెదడుకు మేత పెట్టే చిక్కు సమస్యలను పరిష్కరించటం, పదకేళీలు పూరించటం, చదరంగం ఆడటం వంటివి చేయాలి. మెదడులోని కణాలు చురుకుగా ఉండేలా చేస్తున్నకొద్దీ ఆరోగ్యకరమైన కణాలు సజీవంగా ఉంటాయి. రోజూ ధ్యానం మెదడు ఆరోగ్యానికి తోడ్పడుతుంది. వారానికి కనీసం మూడు సార్లయినా తాజా పండ్లు తినాలి. వీటిల్లోని ఫాలీఫెనాల్స్‌కు అల్జీమర్స్‌ను నివారించే సామర్థ్యముంది. నిద్ర అలవాట్లు మానసిక ఆరోగ్యంపై గణనీయమైన ప్రభావం చూపుతాయి. అందువల్ల నిద్ర సరిగా పట్టేలా చూసుకుంటే అల్జీమర్స్‌ను నివారించుకునే అవకాశమూ ఉందని నిపుణులు సూచిస్తున్నారు.