మీరు ఇలాంటి పొరపాటు చేయొద్దు… బిస్కట్‌ అనుకుని ఎలుకల మందు తిన్న ఐదేళ్ల చిన్నారి మృతి

మీరు ఇలాంటి పొరపాటు చేయొద్దు… బిస్కట్‌ అనుకుని ఎలుకల మందు తిన్న ఐదేళ్ల చిన్నారి మృతి

baby girl dies after eating rat killer: ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో దారుణం జరిగింది. ఎవరి నిర్లక్ష్యమో ఏమో కానీ.. ఓ పసిపాప బలైపోయింది. ఐదేళ్లకే నూరేళ్లు నిండాయి. బిస్కట్ అనుకుని ఎలుకలను చంపే మందు తిన్న ఆ చిన్నారి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది.

రోజూలాగే తోటి పిల్లలతో ఆడుకునేందుకు వెళ్లిన పాపకు దారిలో రోడ్డుపై ప్యాకెట్‌ దొరికింది. అందులో బిళ్లలు ఉన్నాయి. చూడ్డానికి బిస్కెట్‌లా ఉండటంతో వెంటనే తినేసింది. కానీ తాను తిన్నది ఎలుకలను చంపే మందని, పాపం ఆ ఐదేళ్ల చిన్నారి గుర్తించలేదు. ఇంటికొచ్చాక తల్లిదండ్రులూ పసిగట్టలేకపోయారు. చివరికి ప్రాణం పోయింది.

కొత్తతండాకు చెందిన తేజావత్‌ మంగీలాల్‌, శిరీష దంపతులు కూలీలు. వీరికి ఇద్దరు సంతానం. కూతురు సాత్వికాబాయ్‌(5), కొడుకు(3). ఆదివారం(ఫిబ్రవరి 28,2021) సాయంత్రం సాత్విక వీధిలో తోటి చిన్నారులతో ఆడుకునేందుకు వెళ్లింది. ఇంటికి తిరిగొచ్చిన సమయంలో ఆ బాలిక చేతిలో ఎలుకల మందుకు సంబంధించిన ఖాళీ ప్యాకెట్‌ ఉంది. అయితే తల్లిదండ్రులు నిరక్ష్యరాసులు. దీంతో వారు అదేంటో గమనించకుండానే ప్యాకెట్ ను బయట పడేశారు. అంతే తప్ప.. ప్రమాదాన్ని గుర్తించలేదు. ఆ తర్వాత అందరూ అన్నం తిని నిద్రపోయారు.

అర్ధరాత్రి దాటాక చిన్నారి అస్వస్థతకు గురైంది. వాంతులు చేసుకుంది. నోటి నుంచి వాసన వచ్చింది. సడెన్ గా పాపకు ఇలా కావడంతో తల్లిదండ్రులు కంగారుపడ్డారు. సోమవారం ఉదయమే కారేపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్లు లేకపోవడంతో ఖమ్మం తీసుకెళ్లాలని ఏఎన్ఎం సూచించారు.

దీంతో తల్లిదండ్రులు వెంటనే పాపను ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స ప్రారంభించారు. కానీ, ప్రయోజనం లేకపోయింది. అప్పటికే బాగా ఆలస్యం కావడంతో చికిత్స ప్రారంభించిన కాసేపటికే చిన్నారి కన్నుమూసింది.

ఈ ఘటన తీవ్ర విషాదం నింపింది. కొందరి నిర్లక్ష్యం కారణంగా ఓ నిండు ప్రాణం బలైపోయింది. హానికరమైన వస్తువులు, పదార్ధాలు ఎక్కడపడితే అక్కడ పడేయకుండా చెత్త బుట్టలో వేయటమే మంచిదని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.