Ben Stokes Test Sixes: బెన్ స్టోక్స్ కొత్త చరిత్ర.. మెక్ కల్లమ్ రికార్డును చెరిపేశాడు..

Ben Stokes Test Sixes: ఇంగ్లండ్ ఆల్ రౌండర్, టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ చరిత్ర సృష్టించాడు. న్యూజిలాండ్ క్రికెటర్ బ్రెండన్ మెక్ కల్లమ్ పేరిట ఉన్న రికార్డును చెరిపేశాడు.

Ben Stokes Test Sixes: బెన్ స్టోక్స్ కొత్త చరిత్ర.. మెక్ కల్లమ్ రికార్డును చెరిపేశాడు..

Updated On : February 18, 2023 / 12:18 PM IST

Ben Stokes Test Sixes: ఇంగ్లండ్ ఆల్ రౌండర్, టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ చరిత్ర సృష్టించాడు. న్యూజిలాండ్ క్రికెటర్ బ్రెండన్ మెక్ కల్లమ్ పేరిట ఉన్న రికార్డును చెరిపేశాడు. టెస్టు క్రికెట్ లో అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. న్యూజిలాండ్ తో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో అతడీ ఘనత సాధించాడు. 109 సిక్సర్లతో సరికొత్త రికార్డు నెలకొల్పాడు.

టెస్టు మ్యాచ్‌లో మూడో రోజు.. తన జట్టు రెండో ఇన్నింగ్స్‌ 49వ ఓవర్‌లో న్యూజిలాండ్ బౌలర్ స్కాట్ కుగ్గెలీజ్ ఓవర్ లో మూడో బంతిని ఫైన్ లెగ్ మీదుగా సిక్సర్ కొట్టి సరికొత్త రికార్డు సాధించాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో సిక్స్-హిటర్‌లో టాపర్ గా తన లిఖించుకున్నాడు. ఈ ఇన్నింగ్స్‌ లో 33 బంతుల్లో 31 పరుగులు చేశాడు.

Also Read: మార్చి 31 నుంచి ఐపీఎల్.. తొలి మ్యాచులో తలపడనున్న గుజరాత్, చెన్నై

90వ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న బెన్ స్టోక్స్ 12 సెంచరీలు, 28 అర్ధసెంచరీలతో 5,652 పరుగులు చేశాడు. 101 టెస్టులు ఆడిన బ్రెండన్ మెక్ కల్లమ్ 107 సిక్సర్లు బాదాడు. ఆసక్తికర విషయం ఏమిటంటే ప్రస్తుతం అతడు ఇంగ్లండ్ టెస్ట్ జట్టు ప్రధాన కోచ్ గా ఉన్నాడు. రికార్డు బ్రేక్ చేసిన వెంటనే డ్రెస్సింగ్ రూమ్‌ వైపు చూస్తూ బెన్ స్టోక్స్ సిగ్నల్ ఇచ్చాడు. అక్కడ మెకల్లమ్ చిరునవ్వులు చిందిస్తూ, చప్పట్లు కొడుతూ కనిపించాడు.

టెస్టుల్లో అత్యధిక సిక్సర్ల వీరులు వీరే..
బెన్ స్టోక్స్ 109
బ్రెండన్ మెకల్లమ్ 107
ఆడమ్ గిల్‌క్రిస్ట్ 100
క్రిస్ గేల్ 98
జాక్వెస్ కల్లిస్ 97
వీరేంద్ర సెహ్వాగ్ 91
బ్రియాన్ లారా 88
క్రిస్ కెయిర్న్స్ 87