పోలీసులతో చంద్రబాబు వాగ్వాదం.. ఎయిర్‌పోర్ట్‌లో నేలపై కూర్చొని నిరసన!

పోలీసులతో చంద్రబాబు వాగ్వాదం.. ఎయిర్‌పోర్ట్‌లో నేలపై కూర్చొని నిరసన!

చిత్తూరులో గాంధీ విగ్రహ కూడలిలో నిర‌స‌న దీక్షకు దిగనున్నట్లు ముందే ప్రకటించి, చిత్తూరుకు బయల్దేరిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలోని రేణిగుంట ఎయిర్ పోర్టు వద్ద అడ్డుకున్నారు పోలీసులు. ఈ క్రమంలో ఎయిర్‌పోర్ట్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. చిత్తూరులో నిరసన తెలిపేందుకు వెళ్తొన్న చంద్రబాబును ఎయిర్ పోర్టులోనే పోలీసులు అడ్డుకొని అనుమతి లేదని, శాంతిభద్రతల సమస్య వస్తుందంటూ ఆయనకు చెప్పారు పోలీసులు.

వైసీపీ ప్ర‌భుత్వ తీరును నిర‌సిస్తూ.. చిత్తూరులోని గాంధీ విగ్రహ కూడలిలో నిర‌స‌నకు టీడీపీ పిలుపునివ్వగా.. నిరసన కార్యక్రమంలో పాల్గొన‌డానికి ఆ పార్టీ అధినేత చంద్రబాబు విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో విమానాశ్రయానికి వ‌స్తుండగా.. విమానాశ్రయం లోపల నేలపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు చంద్రబాబు.

ఎయిర్ పోర్టులోనే చంద్రబాబుకు నోటీసులు అందించి అడ్డుకోవడంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. చంద్రబాబును ప్రభుత్వం కక్షపూరితంగా అవమానిస్తున్నారని అంటున్నారు టీడీపీ నేతలు.. మరోవైపు చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఉదయం నుంచి టీడీపీ నేతలను ముందస్తు అరెస్ట్‌లు చేస్తున్నారు పోలీసులు. ఎవరూ బయటకు రాకుండా కట్టడి చేస్తున్నారు.