Cotton : రైతుకు మేలు చేసే… అధిక సాంద్రత పద్ధతిలో పత్తిసాగు

భారత్ లో ఒక ఎకరా విస్తీర్ణంలో కేవలం 3 నుంచి 4 వేల పత్తి విత్తనాలను మాత్రమే విత్తుతారు. దీని వల్ల తక్కువ దిగుబడి రావటంతోపాటు చాలా భూమి ఖాళీగానే ఉంటోంది.

Cotton : రైతుకు మేలు చేసే… అధిక సాంద్రత పద్ధతిలో పత్తిసాగు

Cotton

Cotton : మన దేశంలో అత్యధికంగా సాగు చేస్తున్న వాణిజ్యపంటల్లో పత్తి పంట కూడా ఒకటి. పత్తి పంటను సాగు చేయడానికి అన్ని రకాల సాధారణ నేలలు అనుకూలం. వర్షాధారంగా పండించే పత్తి సాగుకు నల్ల రేగడి నేలలు అనుకూలంగా ఉండి, పంట దిగుబడి కూడా అధికంగా వస్తుంది. ఒక ఎకరాకు దాదాపు 900 గ్రాముల విత్తనాల అవసరం అవుతాయి. మార్కెట్ లో ప్రస్తుతం చాలా రకాల విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పత్తిపంటకు మంచి ధర పలికింది. దీంతో పత్తి పంట సాగు చేసిన రైతులకు మంచి అదాయం సమకూరింది. గతంలో ఎన్నడూ లేని విధంగా క్వింటాల్ కు గరిష్టంగా 10వేల రూపాయల ధర లభించింది.

మార్కెట్లో పత్తికి ప్రస్తుతం మంచి ధర ఉన్నప్పటికీ పత్తిసాగుకు ఖర్చులు పెరిగిపోవటంతో వచ్చిన అదాయం ఖర్చులకు సరిపోతున్న పరిస్ధితి నెలకొంది. ఈక్రమంలో దిగుబడులు తక్కువగా ఉన్నప్పటికీ మార్కెట్లో మంచి ధర ఉండటంతో నష్టపోకుండా రైతులు ఎలాగొలా ఈ ఏడాది గట్టెక్కారు. ఈ క్రమంలో పత్తిరైతులు నష్టాల నుండి బయటపడి సాగును లాభదాయకంగా మార్చుకునేందుకు వ్యవసాయ శాస్త్రవేత్తలు కొత్త తరహా పత్తిసాగును చేపట్టాలని రైతులకు సూచిస్తున్నారు. అధిక సాంద్రత పద్దతిలో పత్తిసాగు చేపడితే తక్కువ విస్తీర్ణంలో అధిక పంట దిగుబడిని పొందేందుకు అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. ఇప్పటికే ఈ తరహా విధానాన్ని అమెరికా, చైనా వంటి దేశాల్లోని రైతులు అనుసరిస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నారు.

భారత్ లో ఒక ఎకరా విస్తీర్ణంలో కేవలం 3 నుంచి 4 వేల పత్తి విత్తనాలను మాత్రమే విత్తుతారు. దీని వల్ల తక్కువ దిగుబడి రావటంతోపాటు చాలా భూమి ఖాళీగానే ఉంటోంది. అధిక సాంద్ర పద్దతిలో సాగు చేపడితే ఎకరాకు 25 వేల నుంచి 30 వేల వరకు విత్తనాలను విత్తుకోవచ్చు. ఈ విధానం వల్ల దిగుబడులు బాగా పెరిగే అవకాశం ఉంటుంది. ఎకరాకు దాదాపుగా 15 క్వింటాళ్ల పత్తి దిగుబడి పొందేందుకు అవకాశం ఉంటుంది. ఈ పద్దతి వల్ల పంటసాగుకు చేసే ఖర్చులను తగ్గుతాయి. అధిక సాంద్ర పద్దతిలో జూన్, జూలై మాసాల్లో పత్తిని విత్తుకుంటే నవంబర్, డిసెంబర్ నాటికి పంటకాలం పూర్తవుతుంది. తరువాత రెండో పంటగా ఇతర పంటలను సాగుచేసుకునేందుకు అవకాశం ఉంటుంది.

అధిక సాంద్ర పద్దతిలో మొక్కల మధ్య దూరం 20 సెంటీ మీటర్లు, సాళ్ల మధ్య దూరం 80 సెంటీమీటర్ల ఉంటే సరిపోతుంది. ఇలా చేయటం వల్ల దిగుబడి 15 క్వింటాళ్ల వరకు పెరుగుతుంది. ఈ విధానానికి తోడు ఎరువులు, పురుగు మందుల వాడకంలో సరైన యాజమాన్య పద్దతులు పాటించటం వల్ల అధిక మొత్తంలో దిగుబడులు పొందేందుకు అవకాశం ఉంటుంది. ఈ అధిక సాంద్రత పత్తిసాగుకు దీనికి సంబంధించి పూర్తిస్ధాయి వివరాలను సమీపంలోని వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా తెలుసుకుని రైతులు పాటించటం మంచిది.