MP: దళితుడువి జెండా ఎగురవేస్తావా..అంటూ సర్పంచ్ పై కార్యదర్శి దాడి

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జెండా ఎగురవేసిన ఓ దళిత సర్పంచ్ పై గ్రామ కార్యదర్శి పిడిగుద్దులతో దాడికి పాల్పడిన ఘటన జరిగింది.

MP: దళితుడువి జెండా ఎగురవేస్తావా..అంటూ సర్పంచ్ పై  కార్యదర్శి దాడి

Dalith President

Dalit Sarpanch Kicked by Secretary : భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడిచినా కుల వివక్ష పోవటంలేదు.కులం, మతం జాతికి పట్టిన జాడ్యంలా పట్టుకుని పీడిస్తున్నాయి. భారతదేశ స్వాతంత్ర్య వేడుకల్లో జాతీయ జెండా ఎగురవేసిన వేదికపై ఓ దళిత సర్పంచ్ కు తీరని అవమానం జరిగింది. కులమతాలు రూపు మాపాలను ఎంతో మంది మహానుభావులు చేసిన పోరాటాలు చేసిన గడ్డపై కులమతాలు ఈనాటికి రాజ్యమేలుతుండటం అత్యంత సిగ్గుపడాల్సిన విషయం. సాక్షాత్తు దేశ స్వాత్రంత్ర్య వేడుకలు జరుగుతున్న ఈ శుభతరుణం జాతీయ జెండా ఎగురవేసినందుకు ఓ దళిత సర్పంచ్ పై గ్రామ కార్యదర్శి దాడికి పాల్పడిన ఘటన మధ్యప్రదేశ్‌లోని బుందేల్ ఖండ్ లో చోటుచేసుకుంది.

నిన్న ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం వేడుకల సందర్భంగా ఛత్తర్‌పూర్‌లోని ధాంచీ గ్రామస్తులు.. స్థానిక ప్రభుత్వ స్కూల్లో జాతీయ జెండాను ఎగురవేయడానికి ఏర్పాట్లు చేశారు. జెండా వందనం కార్యక్రమానికి గ్రామ కార్యదర్శి సునీల్‌ తివారి సమయానికి రాలేదు.

దీంతో గ్రామస్తులు సర్పంచ్‌ హన్ను బాసర్‌ను జెండా ఎగురవేయాలని కోరారు. దీంతో హన్ను బాసర్‌ జెండాను ఎగురవేశాడు. అనంతరం సర్పంచ్ తో పాటుఅందరూ మువ్వన్నెల జెండాకు సెల్యూట్ చేసి తదితర కార్యక్రమాలను ప్రారంభించారు. కాసేపటికి అక్కడికి చేరుకున్న గ్రామ కార్యదర్శ సునీల్‌ ఆగ్రహంతో ఊగిపోయాడు. రావటం రావటమే సర్పంచ్ బాసర్ పై మండిపడ్డాడు. ‘నువ్వు జెండా ఎలా ఎగురవేస్తావు. నువ్వు దళితుడివి’ అంటూ ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడాడు. అలా అక్కడితో ఊరుకోకుండా కోపంతో ఊగిపోతూ..విచక్షణ కోల్పోయిన సెక్రెటరీ.. దళిత సర్పంచ్‌పై పిడిగుద్దులు కురిపిస్తు దాడికి తెగబడ్డాడు.

దీంతో సర్పంచ్ బార్య, కోడలు అడ్డువచ్చారు. అలా అడ్డు వచ్చిన సర్పంచ్‌ భార్య.. కోడలిపై కూడా కార్యదర్శి దాడిచేశాడు. ప్రస్తుతం ఈ సంఘటనతో షాక్ అయిన గ్రామస్తులు కార్యదర్శిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు సమయానికి రాలేదు పైగా జెండా ఎగురవేసిన సర్పంచ్ పై దాడి చేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.సాక్షాత్తు స్వాతంత్ర్య వేడుకల్లో తమకు జరిగిన అవమానంపై సర్పంచ్, అతని భార్య కార్యదర్శి సునీల్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా ఇప్పటికే సెక్రటరీ సునీల్ పై ఎన్నో అవినీతి ఆరోపణలున్నాయి.