ఆరునెలల్లోనే ప్రమాదంలో 12లక్షల పసిప్రాణాలు..తల్లులకు తప్పని ముప్పు

  • Published By: nagamani ,Published On : May 15, 2020 / 11:51 AM IST
ఆరునెలల్లోనే ప్రమాదంలో 12లక్షల పసిప్రాణాలు..తల్లులకు తప్పని ముప్పు

ఒకటికాదు రెండు కాదు ఏకంగా ప్రపంచ వ్యాప్తంగా 12 లక్షలమంది పసిప్రాణాలు అత్యంత ప్రమాదంలో పరిస్థితి ఉంటుందని ఊహిస్తేనే గుండెలు అవిసిపోతున్నాయి. కానీ అదే నిజంగా జరిగితే! తల్లులకు కడుపుకోత తప్పదా? కరోనా విలయ తాండవం చేస్తున్న నేటి తరుణంలో దాన్ని చంపటానికి మందులేక.. నియంత్రించటానికి వేరే మార్గం లేక లాక్ డౌన్ లను అనుసరిస్తున్నాం. ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దేశాల పరిస్థితి. లాక్ డౌన్ లతో ఉత్పత్తి ఆగిపోయింది. ఉపాధిపై కోలుకోలేని దెబ్బ పడింది. దీంతో పేదవాడి బతుకులు ఛిత్రమైపోతున్నాయి. ఉత్పత్తి అనేది పేదవాడి రెక్కలమీదనే ఆధారపడి ఉందనే సంగతి తెలిసిందే. ఉత్పత్తే నిలిచిపోతే..ఉపాధి కరువైపోతే..మరి పేద బిడ్డల పరిస్థితి ఏంటి? ఆకలితో అలమటించాల్సిందే. 

కరోనా లాక్‌డౌన్‌ నిరుపేదలకే రాకూడని కష్టం తెచ్చిపెట్టింది. తినడానికి తిండి లేక నిరుపేదలు అల్లాడుతున్నారు. బుక్కెడు బువ్వ కోసం పడరాని పాట్లు పడుతున్నారు. చేతికి పని దొరక్క..ఇంటిలో బిడ్డల పొట్టలు ఆకలితో అలమటించిపోతుంటే భరించలేక విలవిల్లాడిపోతున్నారు.

ఈ లాక్‌డౌన్‌ మరికొంత కాలం పాటు కొనసాగితే.. నిరుపేదల ఆకలి చావులు లక్షల్లో  చూడాల్సి వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా చిన్నారుల ప్రాణాలకు ముప్పు పొంచి ఉన్నట్లేనంటున్నారు.  ఈ ప్రభావం తక్కువ, మధ్యస్త ఆదాయం కలిగిన దేశాల్లో అత్యధికంగా ఉండే అవకాశం ఉంది. 

ప్రపంచ దేశాల్లోని లాక్‌డౌన్‌ చర్యలు.. ఆరోగ్య సేవలకు ఎంతగానో ఆటంకం కలిగిస్తున్నాయి. చిన్నారులకు..తల్లులకు అవసరమైన మెడిసిన్స్, యాంటీబయోటిక్స్‌ ఇప్పటికే కొరత ఏర్పడింది. లాక్‌డౌన్‌ చర్యలు పిల్లల్లో తీవ్రమైన పోషకాహార లోపానికి దారి తీస్తున్నాయి.

యునిసెఫ్‌, జాన్స్‌ హాఫ్‌కిన్స్‌ బ్లూమార్గ్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ పరిశోధకులు.. లాక్‌డౌన్‌లో నిరుపేదల కష్టాలపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేశారు. వారికి అందుతున్న ఆహారం, ఆరోగ్య, వైద్య సేవలపై సమీక్షించారు. లాక్‌డౌన్‌ వల్ల ఇప్పటికే ఆదాయం తక్కువ కలిగిన దేశాల్లో చిన్నారులు పోషకాహార లోపానికి గురవుతున్నట్లు వీరు చేస్తున్న పరిశోధనలో తేలింది. 

లాక్‌డౌన్‌లో 15 శాతం వైద్య సేవలను తగ్గిస్తే.. ఐదేళ్ల లోపు ఉన్న 2,53,000 మంది పిల్లలు, 12,200 మంది తల్లులు చనిపోయే ప్రమాదం ఉంది. ఈ ప్రభావం వచ్చే ఆరు నెలల్లో సంభవించే అవకాశం ఉందని పరిశోధకలు తెలిపారు. ఒక వేళ 52 శాతం వైద్య సేవలు తగ్గిస్తే ఒకేసారి 11,57,000 మంది పిల్లలు, 56,700 మంది తల్లులు చనిపోయే ప్రమాదం ఉంది. 

కరోనా వైరస్‌ మహమ్మారి ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 4 మిలియన్ల మందికి సోకింది. ప్రపంచ వ్యాప్తంగా 3 లక్షలకు పైగా కరోనా మరణాలు సంభవించాయి. అంటే కరోనా విజృంభణ ఏస్థాయిలో ఉందో ఊహించుకుంటేనే వెన్నులోంచి వణుకు పుట్టుకొచ్చేస్తోంది.

రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతుండటంతో లాక్ డౌన్లు ఎత్తివేసే అంశంపై కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో శాస్త్రవేత్తలు ఊహించేది..విశ్లేషకులు అంచనా వేసే చిన్నారుల మరణ మృందంగాలు తప్పని ఊహించటానికే ధైర్యం చాలటంలేదు.

Read Here>> వలస కార్మికుల రైలును మా రాష్ట్రంలో ఆపొద్దు : సీఎం