పాపం.. మంద జగన్నాథం.. కొంపముంచిన బీఫామ్

ఎలాగైనా ఎంపీగా పోటీ చేయాలని నామినేషన్ వేసిన మంద జగన్నాథంకు షాక్ తగిలింది. ఆయన వేసిన నామినేషన్ తిరస్కరణకు గురైంది.

పాపం.. మంద జగన్నాథం.. కొంపముంచిన బీఫామ్

Manda Jagannath: మాజీ ఎంపీ, బీఎస్పీ నేత మంద జగన్నాథం పరిస్థితి రెండింటికీ చెడ్డ రేవడిలా తయారైంది. నాగర్ కర్నూల్ నుంచి ఈ సారి ఎంపీగా పోటీ చేయాలన్న ఆయన ఆశ ఫలించలేదు. ఆయన నామినేషన్ తిరస్కరణకు గురవడంతో పోటీ చేయలేని పరిస్థితి తలెత్తంది. నాగర్ కర్నూల్ నుంచి బహుజన సమాజ్ పార్టీ తరపున ఆయన నామినేషన్ దాఖలు చేశారు. నాలుగో విడత ఎన్నికలకు నామినేషన్ల గడువు నిన్నటితో ముగిసింది. ఎన్నికల అధికారులు నేడు నామినేషన్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మంద జగన్నాథం నామినేషన్‌ను ఈసీ అధికారులు తిరసస్కరించారు.

బీఎస్పీ నుంచి బీ ఫామ్ యూసుఫ్ అనే వ్యక్తికి ఇవ్వడంతో ఆయన నామినేషన్ తిరస్కరణకు గురైంది. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచే అవకాశం కూడా ఆయన దక్కలేదు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో వుండాలంటే కనీసం 10 మంది ఓటర్లు ప్రతిపాదించాలి. కానీ మంద జగన్నాథం నామినేషన్‌లో 5 మంది మాత్రమే ప్రతిపాదించారు. దీంతో ఎంపీ అభ్యర్థిగా పోటీలో వుండే అవకాశాన్ని ఆయన కోల్పోయారు. కాగా, 10 రోజుల క్రితమే మంద జగన్నాథం.. బీఎస్పీలో చేరారు.

Also Read: హరీశ్ రావు సవాల్.. అందుకే సీఎం రేవంత్ రెడ్డి రాలేదు: మంద కృష్ణమాదిగ

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. అలంపూర్ అసెంబ్లీ టికెట్ తన కొడుకు శ్రీనాథ్‌కు దక్కకపోవడంతో బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లోకి వచ్చారు. అయితే తనకు నాగర్ కర్నూల్ లోక్‌స‌భ‌ సీటు ఇవ్వకపోవడంతో కాంగ్రెస్ పార్టీ నుంచి బీఎస్పీలో చేరారు. రాజస్థాన్ వెళ్లి మరీ బీఎస్పీలో జాయిన్ అయ్యారు. అల్వార్ జిల్లా కేంద్రంలో బీఎస్పీ అధినేత్రి మాయావతి సమక్షంలో బీఎస్పీ కండువా కప్పుకున్నారు. నాగర్ కర్నూల్ సీటు ఆయనకే ఇస్తున్నట్టు మాయావతి అక్కడిక్కడే ప్రకటించారు. తాజాగా నామినేషన్ తిరస్కరణకు గురవడంతో లోక్‌స‌భ‌ ఎన్నికల్లో పోటీకి ఆయన దూరమయ్యారు. పార్టీ చీఫ్ టికెట్ ఇచ్చినా.. ఆయన పోటీకి దూరం కావడం గమనార్హం.

Also Read: ఈటల అన్నా.. మల్కాజ్‌గిరిలో నువ్వే గెలుస్తున్నావ్.. మల్లారెడ్డి కామెంట్స్!