తిరుపతిలో రైలు పట్టాలపై భారీ శబ్ధంతో పేలుడు..మహిళకు గాయాలు

  • Published By: bheemraj ,Published On : December 8, 2020 / 05:03 PM IST
తిరుపతిలో రైలు పట్టాలపై భారీ శబ్ధంతో పేలుడు..మహిళకు గాయాలు

Tirupati railway tracks Explosion : తిరుపతిలో రైలు పట్టాలపై పేలుడు కలకలం సృష్టించింది. తారకరామా నగర్ సమీపంలోని రైల్వే ట్రాక్‌పై పేలుడు సంభవించింది. పట్టాలపై ఉన్న ఓ బాక్సును శశికళ అనే మహిళ పక్కకు లాగింది. దీంతో… భారీ శబ్ధంతో ఆ బాక్స్ పేలిపోయింది. శశికళకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనతో రైల్వే శాఖతోపాటు తిరుపతి నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.



బాధితురాలు శశికళ రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పేలుడు ధాటికి కుడి చేతికి సంబంధించిన మూడు వేళ్లు ఎగిరిపోయాయి. అలాగే ఆమె కాలుకు కూడా తీవ్ర గాయం అయింది. పశువులు రైలు పట్టాలపైకి వెళ్లడంతో వాటిని అదిలించేందుకు ట్రాక్ పైకి వెళ్లారు. ఒక్కసారిగా అదే సమయంలో ట్రాక్ పక్కనే ఉన్న చిన్నపాటి బాక్స్ ను చూశానని, పక్కకు పడేయడంతో అది పేలిందని బాధితురాలు చెబుతోంది. ఆ పేలుడు ధాటికి తనకు గాయమైనట్లు చెప్పింది.



రైలు పట్టాలపైకి పేలుడు పధార్థం ఎలా వచ్చిందన్నది అత్యంత ఆసక్తికరంగా మారింది. దీని వెనుక ఏదైనా విద్రోహ కోణం ఉందేమో అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే రైల్వే పోలీసులు, రేణిగుంట పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు.

వారంతా ఘటనపై లోతైన దర్యాప్తు జరుపుతున్నారు. మరికాసేపట్లో క్లూస్ టీమ్ కూడా అక్కడకు వెళ్లనుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.



అయితే ఇందులో కొన్ని సాంకేతిక అంశాలు కూడా ఉన్నాయి. ఉపయోగంలో లేని ట్రాక్ కింద
రైల్వే గార్డులు డిటోనేటర్లు అమర్చుతూ ఉంటారు. ఒకవేళ రన్నింగ్ ట్రైన్ గాడి తప్పి మరో ట్రాక్ పైకి వెళ్లినప్పుడు అక్కడ చిన్న పేలుడు జరుగుతుంది. డ్రైవర్ దాన్ని గుర్తించి మళ్లీ వెనక్కి వెళ్తాడు. అంటే రైల్వే సేఫ్టీ మెథడ్ లో భాగంగా ఇలాంటి కొన్ని చర్యలు తీసుకుంటారన్న అంశం కూడా రైల్వే అధికారుల ద్వారా తెలుస్తోంది. అయితే ఇది అలాంటి అంశమా? లేక విద్రోహ కోణముందా? అన్న కోణంలో విచారిస్తున్నారు.