గంటా సంచలన నిర్ణయం, ఎమ్మెల్యే పదవికి రాజీనామా

గంటా సంచలన నిర్ణయం, ఎమ్మెల్యే పదవికి రాజీనామా

ganta srinivasa rao resign for mla post: టీడీపీ నేత, విశాఖపట్నం(నార్త్) ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా చేశారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటు పరం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి నిరసనగా ఎమ్మె‍ల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.

స్టీల్‌ప్లాంట్‌పై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం అమల్లోకి వచ్చిన తర్వాతనే తన రాజీనామాకు ఆమోదం తెలపాలని కోరారు. ఈ మేరకు అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాంకు గంటా శ్రీనివాస్‌ శనివారం(ఫిబ్రవరి 6,2021) లేఖ రాశారు. స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణ కోసం నాన్‌ పొలిటికల్‌ జేఏసీ ఏర్పాటు చేస్తున్నట్లు గంటా ప్రకటించారు. తాను మాటల మనిషిని కాదని.. చేతల మనిషినని గంటా తెలిపారు.

చాలా రోజుల నుంచి మౌనంగా ఉన్న గంటా శ్రీనివాసరావు విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కేంద్రం నిర్ణయం తర్వాత స్పందించారు. ‘విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణం వెనక్కి తీసుకోవాలి. విశాఖ ఉక్కు కర్మాగారం దేశంలోని మిగతా కర్మాగారాల లాగా కేవలం ఒక పరిశ్రమ గా మాత్రమే చూడొద్దు. విశాఖ ఉక్కు మా ఆత్మ గౌరవం, మా విశాఖ ప్రజల ఉఛ్వాస నిశ్వాస. మా నగరం పేరే ఉక్కు నగరం. కేంద్ర ప్రభుత్వం ఆదాయ వనరుల కోసం ఇతర ప్రత్యామ్నాయాలు చూసుకోవాలి.

ఇంత పెద్ద ఉక్కు ఫ్యాక్టరీకి సొంత కాప్టివ్ ఐరన్ ఓర్ ఖనిజ వ్యవస్థ లేదు. దీన్ని బయట నుంచి కొనాల్సి రావడం వల్లే టన్నుకు 5వేల రూపాయల నష్టం వాటిల్లుతోందని స్టీల్ మినిస్ట్రీ చెబుతోంది. కాబట్టి వెంటనే సొంత ఐరన్ మైన్ ని కేటాయించాలని మా డిమాండ్. అలా కాదని ముందుకెళ్తే ఢిల్లీలో జరుగుతున్న రైతు ఉద్యమం కంటే 100 రెట్ల పెద్ద ఉద్యమాన్ని, తీవ్రతని చవిచూడాల్సి ఉంటుంది’ అని ట్వీట్ చేశారు గంటా.