Girl for Girl custome : పెళ్లి పేరుతో అమానుషాలు :ఆటా-సాటా,ఝగడా,నాత్రా సంప్రదాయాలు పేరుతో అరాచకాలు

అమ్మాయికి అమ్మాయినిచ్చి పెళ్లి చేయాలి..లేదంటే అబ్బాయికి పెళ్లి అవ్వదు. ఆటా-సాటా,ఝగడా,నాత్రా సంప్రదాయాలు పేరుతో అరాచకాలు..ఆడబిడ్డల జీవితాలు బుగ్గిపాలు.

Girl for Girl custome : పెళ్లి పేరుతో అమానుషాలు :ఆటా-సాటా,ఝగడా,నాత్రా సంప్రదాయాలు పేరుతో అరాచకాలు

Girl For Girl Shocking Custome

సంప్రదాయాలు అంటే మనుషులు ఆరోగ్యంగా ఆనందంగా ఉండటానికి మనిషే నియమించుకున్నవి. కానీ అవే సంప్రదాయాలు మనుషుల్ని రాక్షసులుగా మారిస్తే? అవే సంప్రదాయాలు ఆడపుట్టుకల్ని హింసల పాలు చేస్తే? అవే సంప్రదాయాలు పెళ్లిపేరుతో ఆటవస్తువుల్లా అమ్మేస్తే..ఏదో సరుకుల్ని ఎరువిచ్చినట్లే ఇచ్చేస్తే..ఇష్టంలేదని ఎదురు తిరిగితే ఓ వస్తువుల్ని అమ్మేసినట్లుగా అమ్మేస్తే? వాటినిసంప్రదాయాలు అనాలా? అమానుషాలు అనాలా? పెళ్లి పేరుతో అమానుషాలు. సంప్రదాయాల పేరుతో అరాచకాలకు బలైపోయే ఆడబిడ్డల ఆర్తనాదాలు ఎవరు వింటారు? కన్నవాళ్లు, తోడబుట్టినవారు ఇది సంప్రదాయం మేం ఏమీ చేయలేమని చేతులెత్తేస్తే నూరేళ్లు బతకాల్ని ఆడబిడ్డ బలవన్మరణాలకు పాల్పడేలా చేస్తుంది రాజస్థాన్ లో జరిగినట్లుగా…

రాజస్థాన్‌లో ఇటీవల ఒక యువతి ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు విడిచింది. దీని వెనుక మూఢత్వం నిండిన మనుషుల ఆలోచన..కంప్యూటర్ కాలంలో కూడా మారని మూఢాచారాలు ఉన్నాయని తేలింది. ఆ యువతి ఆత్మహత్య ‘ఆటా-సాటా’ అనే వింత ఆచారాన్ని బయటపెట్టింది. ఈ ఆచారమే ఆమె మరణానికి కారణమని తెలిసి సభ్యసమాజం నివ్వెర పోయింది. ఒక్క ఈ ‘ఆటా-సాటా’ ఆచారమే కాదు..మరో రెండు వింత ఆచారాలు ఆడపిల్లల పాలిట మృత్యువులవుతున్నాయి. ‘ఆటా-సాటా’,‘ఝగడా’,‘నాత్రా’ సంప్రదాయాలు పేరుతో ఆడబిడ్డలపై జరిగే అరాచకాలు అన్నీ ఇన్నీ కావు.రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ సంప్రదాయాల పేరుతో ఆడపిల్లల జీవితాలను నాశనం చేస్తున్న ఘటనలు మరోసారి వెలుగులోకి వచ్చాయి.

Read more : జంబలకిడి పంబ : పెళ్లి కొడుకుకే తాళి కడతారు

‘ఆటా-సాటా’ సంప్రదాయం..
రాజస్థాన్‌లోని పలు గ్రామాల్లో ఈ ‘ఆటా-సాటా’ సంప్రదాయాలు కొనసాగుతున్నాయి. నాగౌర్ వంటి గ్రామాలు ‘ఆటా-సాటా’ను కొనసాగిస్తున్నాయి. ‘ఆటా-సాటా’ ప్రకారం..ఏ అబ్బాయైనా పెళ్లి చేసుకుంటుంటే.. తమ ఇంట్లోని అమ్మాయిని వధువు కుటుంబంలో ఎవరో ఒకరికి ఇచ్చి పెళ్లి చేయాలి. అంటే పెళ్లి కొడుకు అక్కకో.. చెల్లికో..పెళ్లి కూతురి కుటుంబంలో పెళ్లి చేయాలి. అలా చేయకపోతే అతని పెళ్లి కూడా జరగదు. ఇలా పెళ్లిళ్లు చేసే సమయంలో వయసులో ఎక్కువ తక్కువలను ఆ కుటుంబాలు పెద్దగా పట్టించుకోవడం జరగదు. ఇలా తనకు 70 ఏళ్ల వ్యక్తితో పెళ్లి చేసేందుకు కుటుంబసభ్యులు ప్రయత్నించడంతో అది ఇష్టం లేని 21 ఏళ్ల యువతి ఇటీవలే ఆత్మహత్య చేసుకుంది. దీంతో ‘ఆటా-సాటా’ సంప్రదాయం మరోసారి వెలుగులోకి వచ్చి చర్చనీయాంశంగా మారింది.

‘ఆటా-సాటా’ను మించిన ‘ఝగడా’ సంప్రదాయం..!
రాజస్థాన్‌లో ‘ఆటా-సాటా’కు మించి మధ్యప్రదేశ్‌లో మరో భయంకరమైన సంప్రదాయం ఉంది. అదే ‘ఝగడా’. పేరుకు తగినట్లుగానే ఉంటుంది. దీన్ని ప్రకారం చిన్నతనంలోనే అమ్మాయిలకు పెళ్లిళ్లు చేసేస్తారు. ఇలా చేసేటప్పుడు అబ్బాయిల వయసును పెద్దగా పట్టించుకోరు. 18 ఏళ్ల యువకుడైనా 80 ఏళ్ల వృద్ధుడైనా సరే. బాలికనిచ్చి పెళ్ళి చేసేస్తారు. ఆ తరువాత ఆమె వయస్సుకు (మెచ్యూర్) అయ్యాక.. అత్తారింటికి పంపేస్తారు. ఒకవేళ అమ్మాయికి ఇష్టం లేక వెళ్లకపోతే ఇక ఆ కుటుంబానికి కష్టాలు వెల్లువలా వచ్చిపడతాయి తోటి మనుషులతో. అమ్మాయి అత్తారింటికి వెళ్లకపోయినా లేదా ఆ అబ్బాయికే అమ్మాయిని వద్దన్నా నష్టపోయేది.హింసలపాలయ్యేది ఆ అమ్మాయి..ఆ అమ్మాయి కుటుంబమే.

Read more : Divorced Month : ఆ నెలలో పెళ్లి చేసుకుంటే విడిపోతారట..కలిసున్నా పిల్లలు పుట్టరట..

ఇక ఆ అమ్మాయి కుటుంబం బతికి బట్టకట్టాలంటే ప్రతీరోజు ఛస్తూ బతకాల్సిందే. అనుక్షణం హింసలే.అబ్బాయి కుటుంబానికి అమ్మాయి కుటుంబం భారీ మొత్తంలో పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. దీని కోసం అబ్బాయి కుటుంబం పంచాయతీ ఏర్పాటు చేసి పెద్దల సమక్షంలో తాము డిమాండ్ చేసే సొమ్ము అడుగుతుంది. అమ్మాయి కుటుంబం ఈ సొమ్ము ఇవ్వలేకపోతే అబ్బాయి కుటుంబం చేసే అరాచకాలు భరించాల్సిందే. అమ్మాయి కుటుంబానికి చెందిన ఇళ్లు, పొలాలు తగులబెట్టేస్తారు. దానికి వారు అదేమని అడక్కూడదు. దీని గురించి ఎవ్వరు ప్రశ్నించరు కూడా. ఇది ఆచారంగా కొనసాగిస్తుండటంతో పంచాయతీలు ఇవి సర్వసాధారణమే అన్నట్లుగా ఉంటాయి. అంటే అది చట్టం అన్నట్లుగా జరుగుతుంటాయి ఇటువంటి అరాచకాలు. ఈ ఘోరాలు కేవలం అమ్మాయి కుటుంబానికే పరిమితం కావు.

కొంతకాలం తర్వాత ఆ ఊర్లో ఏ కుటుంబానికి చెందిన ఆస్తులనైనా అబ్బాయి కుటుంబం అగ్నికి ఆహుతి చేస్తుంది. అప్పుడు సదరు బాధిత కుటుంబం ఎవరైతే బాధిత అమ్మాయి కుటుంబం ఉందో వారిపైనే విరుచుకుపడతారు. మీ వల్లే మా ఆస్తులు తగుబడ్డాయి దీనికి కారణం మీరే అని వారిని మాటలతో హింసించి వారిమీద మానసికంగా ఒత్తిడి తెచ్చి…వరుడి కుటుంబానికి ఇవ్వాల్సిన పరిహారం డబ్బు చెల్లించాలంటూ గొడవ పడుతుంది. ఇలా ఊరు మొత్తం ఏకమై ఆ అమ్మాయి కుటుంబాన్ని వేధిస్తుంది. ఇవ్వాల్సింది ఇచ్చేదాకా సతాయిస్తుంది. మాటలతో చేతలతో ఇష్టారాజ్యంగా అణగదొక్కుతుంది. అయానా వారు సొమ్ము చెల్లించలేకపోతే..అప్పుడు ఇంతకంటే ఘోరమైన అకృత్యమై సంప్రదాయం ఒళ్లు విరుచుకుని నిద్రలేస్తుంది. లేదు. అప్పుడు మరో ఘోరమైన ఆచారం అమల్లోకి వస్తుంది. అదే ‘నాత్రా’.‘ఆటా-సాటా’,‘ఝగడా’లను మించిన అరాచకం ఈ నాత్రా.

అంతకు మించినది ‘నాత్రా’..
‘ఝగడా’ తో వచ్చే ఒత్తిడి తట్టుకోలేని అమ్మాయి కుటుంబం దారుణమైన పద్ధతిని అమలు చేస్తుంది. ఊరు మొత్తం తమను శత్రువులా చూస్తూ ఒత్తిడి చేయడంతో..తట్టుకోలేక..భరించలేక విధిలేని దుస్థితితో తలొగ్గిన అమ్మాయి కుటుంబం ‘నాత్రా’ ఆచారాన్ని అమలు చేస్తుంది. కాదు కాదు చేయాల్సి వస్తుంది. అదీకాకుంటే చేయించేలా చేస్తారు గ్రామం అంతా కలిసి. ఈ నాత్రా ఆచారం ప్రకారం..అత్తారింటికి వెళ్లని అమ్మాయిని మరో వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేస్తారు. అప్పుడు మొదటి భర్త కుటుంబానికి ఆమె ఇవ్వాల్సిన పరిహారాన్ని.. కొత్తగా పెళ్లి చేసుకున్న భర్త చెల్లించాలి. అంటే ఆ సొమ్ము ఎవరు చెల్లిస్తానంటే వారికి ఇచ్చి అమ్మాయిని పెళ్లి చేసేస్తారు. అలా సొమ్ము ఇవ్వగలిగే స్తోమత ఉన్నవారు ఆ అమ్మాయిని పెళ్లి చేసేసుకుంటారు. వారి 80 ఏళ్లవారైనా 90 ఏళ్ల వారైనా సరే. అమ్మాయి ఇష్టం అయిష్టం ఏమీ ఉండనే ఉండవు. లేదంటే ఆ అమ్మాయిని తెగనమ్మేస్తారు.

Read more : Divorced Month : ఆ నెలలో పెళ్లి చేసుకుంటే విడిపోతారట..కలిసున్నా పిల్లలు పుట్టరట..

ఇలాంటి ఘటనలు మధ్యప్రదేశ్‌లోని పలుగ్రామాల్లో కోకొల్లలుగా ఈనాటికి కొనసాగుతున్నాయి.ఆడబిడ్డలను అంగడి వస్తువుల్లా అమ్మేస్తు దాన్నే సంప్రదాయం అంటారు. మధ్యప్రదేశ్ గ్రామాల్లో ఇళ్లు, పొలాలు తగలబెట్టిన కేసుల్లో అధికభాగం ఈ సంప్రదాయాల వల్ల జరిగేవే.కానీ పైకి మాత్రం వేరే కారణాలు చెబుతుంటారు. పెళ్లి పేరుతో ఇటువంటి అత్యంత అనాగరిక సంప్రదాయాలు జరుగుతున్నా..ఇది మాకు అనాదిగా వస్తున్న ‘సంప్రదాయం’అంటారు. ఇలాంటి దారుణమైన ఆచారాలు ఈ కంప్యూటర్ యుగంలో కూడా కొనసాగుతుండటం..వాటిని మార్చుకోవాలే ఆలోచన స్థానికులకు రాకపోవటం అత్యంత దురదృష్టకరం.ఈ సంప్రదాయాలపై పలువురు సామాజిక కార్యకర్తలు పోరాడుతున్నా..ఎవ్వరు పట్టించుకోరు.
ఇవిగో తాజా ఉదాహరణలు..

వీటికి ప్రత్యక్ష ఉదాహరణ..
గుణా ప్రాంతానికి చెందిన ఒక యువతిని ‘నాత్రా’ ఆచారం ప్రకారం తండ్రి, మామయ్య కలిసి అమ్మేస్తుంటే భయపడిని బాధితురాలు వారినుంచి తప్పించుకుని పారిపోయి ఇండోర్ వెళ్లిపోయింది. కొంతకాలం అక్కడే ఉండిపోయింది. తరువాత అక్కడి నుంచి కూడా పారిపోయి రాజస్థాన్‌లోని కోటాకు చేరుకుంది. అక్కడే కూలీనాలి చేసుకుని జీవనం సాగించింది. అలా అక్కడ పరిచయం అయిన ఘీసాలాల్ భీల్ అనే వ్యక్తిని పెళ్లిచేసుకుంది. ఇద్దరికీ ఒక బాబు కూడా పుట్టాడు. సంతోషంగా జీవిస్తున్న ఆమె విషయం తండ్రికి తెలిసింది. అంతే ఆమె తండ్రి, సోదరుడు కోటాకు చేరుకున్నారు. ఆమెను తమతో ఇంటికి రావాలని అడిగారు. రాను మీకు నాకు సంబంధం లేదు..ఎప్పుడైతే నన్ను అమ్మేయాలను చూశారో..అప్పుడే మీకు నాకు ఉన్న బంధం తెగిపోయింది మీతో రాను..నా కుటుంబంతో నేను సంతోషంగా ఉన్నాను వచ్చేది లేదని తెగేసి చెప్పింది. దీంతో నువ్వు రావాలి. లేదంటే నీ భర్త మాకు 1.5లక్షల రూపాయలు ఇవ్వాలని ఆమె భర్తను డిమాండ్ చేశారు. దానికి ఘీసాలాల్ భీమ్..భార్య కోసం ఆ సొమ్ము వారి ఇచ్చేయగా దాన్ని తీసుకుని వాళ్లు వెళ్లిపోయారు.

కానీ వారి అరాచకం ఆగలేదు. బంగారు గుడ్లు పెట్టే బాతులగా మార్చుకున్నారు. మరోసారి వచ్చి తండ్రి, సోదరుడు, మామ కలిసి రాజస్థాన్ వెళ్లారు. ఆమె భర్త ఇంట్లో లేని సమయంలో ఆమెను బలవంతంగా ఎత్తుకొచ్చేశారు. అలా సొంతూరికి తీసుకొచ్చి సుల్తాన్ అనే వ్యక్తికి రూ.2.5లక్షలకు అమ్మేశారు. ఆమెను తనతో తీసుకెళ్లిన సుల్తాన్..ఆమెపై అత్యాచారం చేశాడు. అతని నుంచి తప్పించుకుని భర్త బిడ్డ దగ్గరకు వెళ్లాలని ఆమె ఎంతగా యత్నించినా ఫలించలేదు. దీంతో ఆమె అలా 18 రోజులపాటు సుల్తాన్ చేతిలో నరకం అనుభవించింది. ఆనరకం నుంచి ఎలాగోలా తప్పించుకున్న ఆమె పారిపోయి భర్తా బిడ్డ దగ్గరకు చేరుకుంది. ఇలా ఒక్క ఈ అమ్మాయి జీవితమే కాదు ఎంతోమంది ఆడపిల్లల పరిస్థితి ఇది.

ఇటువంటిదే మరో అమ్మాయి పరిస్థితి..
రాజ్‌గఢ్ జిల్లాలో ఖిల్చీపూర్‌ గ్రామానికి చెందిన రామ్‌కళా బాయి అనే యువతికి చిన్నతనంలోనే కమల్ సింహ్ అనే వ్యక్తితో పెళ్లి చేశారు. తరువాత ఆమె వయసుకు వచ్చాక అత్తారింటికి పంపారు. భర్త కమల్ పచ్చి తాగుబోతు.తాగొచ్చి గొడ్డుని బాదినట్లు బాదటం..లైంగికంగా హింసలకు గురిచేసేవాడు. అతని హింస తట్టుకోలేక పుట్టింటికి వచ్చేసింది రాబ్ కళా బాయి. ఆ బాధలు పడలేను అత్తారింటికి వెళ్లనని చెప్పింది. దీంతో కమల్ కుటుంబం 2019లో ఆమె కుటుంబంపై విరుచుకుపడింది. ఇంటికి నిప్పుపెట్టింది. 9లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని పట్టుబట్టింది. ఆమెను ఎవరికైనా అమ్మేసి, తమకు సొమ్ము చెల్లించాలని ఒత్తిడి చేసింది. దీంతో బాధితురాలు తెగించి ఖిల్చీపూర్‌లో పోలీసులకు ఫిర్యాదు చేయటంతో కమల్ కుటుంబంపై కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణ జరుగుతోంది.ఇలా ఒకటి రెండు కాదు 10 లేదా 20 కాదు ఇటువంటి ఘోరాలు ఎన్నో..ఎన్నెన్నో. పెళ్లి పేరుతో అమానుషాలకు అంతేలేదు. ఆటా-సాటా’,‘ఝగడా’,‘నాత్రా’ సంప్రదాయాలు పేరుతో అరాచకాలు అన్నీ ఇన్నీ కావు.