Heart Disease : యువతలో గుండెజబ్బులు… అసలు కారణం ఏంటంటే?..

ముఖ్యంగా కోవిడ్ తరువాత ఇలాంటి అనారోగ్యాల బారిన పడుతున్న యువతీయువకుల సంఖ్య పెరుగుతోంది. హార్ట్ ఫెయిల్యూర్ అనేది ఒక దీర్ఘకాలిక అనారోగ్య పరిస్థితి. గుండె శరీరంలోని అన్ని భాగాలకు తగినం

Heart Disease : యువతలో గుండెజబ్బులు… అసలు కారణం ఏంటంటే?..

Heart Disease

Heart Disease : ప్రజల జీవనశైలిలో వచ్చిన మార్పులు, ఆహారపు అలవాట్ల కారణంగా వృద్ధాప్యంలో దరిచేరాల్సిన గుండెజబ్బులు ప్రస్తుతం యువదశలోనే ముంచుకొచ్చేస్తున్నాయి. బిజీబిజీ జీవితాలు, పని ఒత్తిడి, ఆందోళన, ఊబకాయం వంటివి యువతలో గుండె జబ్బులకు కారణమవుతున్నాయి. వయస్సు మళ్ళిన వారిలో సహజంగా కనిపించే రక్తపోటు, గుండె జబ్బులు, ఇతర ప్రమాదకరమైన వ్యాధులు ఈ మధ్య కాలంలో మలి వయసులోనే కనిపిస్తున్నాయి. ఫలితంగా యువత కూడా ప్రమాదకరమైన, దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. ఇదే విషయాన్ని అనేక అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.

ముఖ్యంగా కోవిడ్ తరువాత ఇలాంటి అనారోగ్యాల బారిన పడుతున్న యువతీయువకుల సంఖ్య పెరుగుతోంది. హార్ట్ ఫెయిల్యూర్ అనేది ఒక దీర్ఘకాలిక అనారోగ్య పరిస్థితి. గుండె శరీరంలోని అన్ని భాగాలకు తగినంత రక్తాన్ని సరఫరా చేయలేకపోవడాన్ని హార్ట్ ఫెయిల్యూర్ లేదా గుండె వైఫల్యం అంటారు. గుండె పనితీరు దెబ్బతింటే శరీర కణాలకు తగినంత రక్తం సరఫరా కాదు. దీంతో అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయి.

ధమనుల గోడలపై కొవ్వు నిల్వలు పెరగడం వల్ల ఈ సమస్య ఎదురవుతుంది. దీర్ఘకాలిక ఒత్తిడితో బాధపడేవారిలో కార్టిసోల్ హార్మోన్ ఎక్కువగా విడుదల అవుతుంది. దీని వల్ల కూడా గుండె పనితీరు దెబ్బతినే అవకాశం ఉంది. పొగతాగే అలవాటు ఉన్నవారు గుండె జబ్బులకు గురయ్యే ప్రమాదం ఎక్కువ. అధిక రక్తపోటు, డయాబెటిస్, కరోనరీ ఆర్టరీ వ్యాధి, గుండె కవాటాలు దెబ్బతినడం వల్ల గుండె వైఫల్యం ఎదురవుతుంది. గుండె వైఫల్యాన్ని సరిచేయడం కష్టం. గుండె రక్తసరఫరా వ్యవస్థ బలహీనపడితే, సమస్య క్రమంగా పెరుగుతుంది.

గుండె వైఫల్యాన్ని నివారించేందుకు వివిధ పద్ధతులు, చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. వీటి వల్ల సమస్య తీవ్రత తగ్గుతుంది. దీంతో సాధారణ జీవితం గడపవచ్చు. కానీ ఒక్కసారి వైఫల్యమైన గుండె ఇంతకుముందు మాదిరిగా పూర్తి స్థాయి సామర్థ్యంతో పనిచేయదు. అందువల్ల ఈ సమస్యను ప్రారంభ దశలోనే గుర్తించి, చికిత్స అందించాలి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచుకునే అలవాట్లపై ప్రజలు అవగాహన పెంచుకోవటం మంచిది.ఆరోగ్యకరమైన బరువు, వ్యాయామాలు, పండ్లు, కూరగాయలను ఎక్కువగా తినడం, పొగ, మద్యపానం అలవాట్లు మానేయడం, ప్రతిరోజూ ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోవడం, ఒత్తిడిని దూరం చేసుకోవటం ద్వారా గుండె ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుకోవచ్చు.