TS Assembly: తెలంగాణ అసెంబ్లీలో కీలక బిల్లు పాస్..!

తెలంగాణలో గ్రామాల సరిహద్దుల మార్పులు, పేర్ల మార్పులు.. కొత్త గ్రామాల ఏర్పాటు దిశగా.. ప్రభుత్వం చేసిన కీలక ప్రతిపాదనలను శాసనసభ ఆమోదించింది.

TS Assembly: తెలంగాణ అసెంబ్లీలో కీలక బిల్లు పాస్..!

Assembly

తెలంగాణలో గ్రామాల సరిహద్దుల మార్పులు, పేర్ల మార్పులు.. కొత్త గ్రామాల ఏర్పాటు దిశగా.. ప్రభుత్వం చేసిన కీలక ప్రతిపాదనలను శాసనసభ ఆమోదించింది. తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018కి.. సవరణలు ప్రతిపాదించింది. ప్రస్తుతం ఉన్న చట్టం ప్రకారం.. గ్రామాల పేర్లు మార్చాలన్నా.. సరిహద్దులు మార్చాలన్నా.. చట్టంలోని నిబంధనల ప్రకారం శాసనసభ కనీసం నెల రోజుల పాటు సమావేశం కావాల్సి ఉంటుందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావ్ తెలిపారు. సభ 2, 3 వారాల్లోపే పూర్తయ్యే పరిస్థితుల్లో.. ప్రతిపాదనల అమలుకు మరింత కాలం పట్టే పరిస్థితి ఉందని వివరించారు. ఈ కాలయాపన నివారించేందుకే.. తాజా ప్రతిపాదనలు తీసుకువచ్చామని చెప్పారు. ఈ విషయంపై.. ఎంఐఎం, బీజేపీ, కాంగ్రెస్ పక్షాలు తమ అభిప్రాయాలు వివరించాయి.

అదొక్కటే సమస్య: ఎంఐఎం

కొత్త గ్రామాల ఏర్పాటు, ఉన్న గ్రామాల సరిహద్దుల మార్పు, విస్తరణపై ఎలాంటి అభ్యంతరం లేదని ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ అన్నారు. అయితే.. దశాబ్దాలపాటుగా గ్రామాలకు ఉన్న పేర్లను మారుస్తామంటే కుదరదని చెప్పారు. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే.. హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్ వంటి పట్టణాల పేర్లు కూడా మారుస్తారేమే.. అని అనుమానం వ్యక్తం చేశారు. అందుకే.. పేర్ల మార్పు వంటి ప్రతిపాదన మినహా.. ఇతర విషయాలపై అభ్యంతరం లేదని.. ప్రభుత్వం ఈ విషయంలో స్పందించాలని అక్బరుద్దీన్ డిమాండ్ చేశారు.

మద్దతిస్తున్నాం: బీజేపీ

ప్రభుత్వం ప్రవేశ పెట్టిన చట్ట సవరణకు బీజేపీ మద్దతు తెలుపుతున్నట్టు ఆ పార్టీ ఎమ్మెల్యే రఘునందన్ చెప్పారు. మెదక్ లో గతంలో ఉన్న తెలంగాణ పురం గ్రామాన్ని తెల్లాపూర్ గా మార్చారని.. సంగారెడ్డి సమీపంలో ఉన్న ఈశ్వరాపురం గ్రామాన్ని ఇస్మాయిల్ పేటగా మార్చారని అన్నారు. చరిత్రను వక్రీకరించకుండా.. పాత పేర్లను మళ్లీ పెడితే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. అందుకే.. ప్రభుత్వ ప్రతిపాదనకు మద్దతు తెలుపుతున్నామన్నారు.

నెల రోజులు సభలో ఉంటే సమస్యేంటి?: కాంగ్రెస్

కాంగ్రెస్ సైతం.. ఎంఐఎం చేసిన వాదననే వినిపించింది. కొన్నేళ్లుగా కొనసాగుతూ వస్తున్న పేర్లను మారిస్తే.. ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో.. కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఉందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రతిపాదనను మార్చాలని కోరారు. అసలు నెల రోజుల పాటు.. గ్రామాల పేర్ల మార్పు ప్రక్రియ జరిగితే ప్రభుత్వానికి వచ్చిన సమస్య ఏంటని ప్రశ్నించారు.

ప్రభుత్వ వివరణ.. ఎంఐఎం అభ్యంతరం

విపక్షాల వాదనలపై స్పందించిన పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావ్.. శాసనసభ వ్యవహారాల మంత్రి ప్రశాంత్ రెడ్డి.. మరోసారి ప్రభుత్వ ఉద్దేశాన్ని వివరించారు. గ్రామాల పేర్ల మార్పు విషయంలో.. ప్రస్తుత చట్టాన్ని అనుసరిస్తే.. ప్రక్రియ పూర్తికి నెలకుపైగా సమయం పట్టే అవకాశం ఉందన్నారు. అందుకే తాజా ప్రతిపాదన తెచ్చామన్నారు. కానీ.. ఎలాంటి చర్చ జరక్కుండానే.. పేర్లు మార్చేందుకు అవకాశాలు ఏర్పడతాయని ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ మరోసారి అభ్యంతరం చెప్పారు. అయితే.. గ్రామసభలు ఏకగ్రీవంగా తీర్మానం చేసి పంపిన తర్వాతే.. ప్రక్రియ మొదలవుతుందని.. శాసనసభలో పూర్తి స్థాయిలో చర్చ జరిగాకే పేర్ల మార్పు ఉంటుందని.. మంత్రి ప్రశాంత్ రెడ్డి ఎంఐఎంకు స్పష్టం చేశారు. తర్వాత స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి… సభలో సవరణ బిల్లును పాస్ చేశారు.