MP: బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ చేస్తూ..రోగి పుర్రె ప‌గుల‌గొట్టిన డాక్టర్లు..

ఓ రోగికి మెదడులో కణితిని సర్జరీ ద్వారా తొలగిస్తూ డాక్టర్లు చేసిన ఘనకార్యంతో అతను అనుక్షణం భయాందోళనలో బతికేలా చేసింది. పుర్రె ముక్క విరిగిపోవటంతో ..

MP: బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ చేస్తూ..రోగి పుర్రె ప‌గుల‌గొట్టిన డాక్టర్లు..

Doctors Remove Man Skull Part During Brain Tumor Surgery

కొంతమంది డాక్టర్లు చేసే ఘనకార్యం రోగుల ప్రాణాలమీదకు తెస్తుంది. ప్రాణాలు పోయిన సందర్భాలు కూడా లేకపోలేదు. కడుపులో కత్తెరలు..దూది, వస్త్రంలాంటివి కుట్టేసిన ఘటనల్లో రోగులు ప్రాణాలమీద తెచ్చిన సందర్భాలు కోకొల్లలు. దానికంటే పెద్ద ఘనకార్యం చేశారు మధ్యప్రదేశ్ లోని డాక్టర్లు. మెదడులో కణితి ఆపరేషన్ చేయించుకోవాలనుకున్న ఓ బాధితుడికి డాక్టర్లు ఏకంగా బుర్రే పగులగొట్టేశారు. మెదడులో కణితి తొలగించబోయి ఆ రోగి బుర్రే పగుల గొట్టిన ఘటన ఉజ్జయినిలో చోటుచేసుకుంది.

మ‌ధ్య‌ప్ర‌దేశ్ లోని ఉజ్జ‌యిని ప్రాంతానికి చెందిన కీర్తి పార్మ‌ర్ అనే యువకుడికి ఇటీవల కాలంలో త‌ర‌చూ త‌ల తిరిగిన‌ట్లు..వామ్టింగ్ వ‌చ్చిన‌ట్లుగా అనిపించ‌డంతో ఇండోర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రికి వెళ్లాడు. అతడి సమస్య విన్న డాక్టర్లు తలకు స్కానింగ్ చేయగా అతని మెదడులో కణితి ఉన్నట్లుగా గుర్తించారు. ఆ క‌ణితిని సర్జరీ చేసి తీయకపోతే ప్రాణాల‌కే ప్ర‌మాద‌మ‌ని చెప్పారు. దాంతో 2019లో కీర్తి పార్మ‌ర్ బ్రెయిన్ ట్యూమ‌ర్‌ స‌ర్జ‌రీ చేయించుకున్నాడు. డాక్టర్లు పార్మ‌ర్ పుర్రెలో కుడివైపు భాగాన్ని తెరిచి ట్యూమర్‌ను తీసివేశారు. సర్జరీ జరిగిన సమయంలో కణితి తొలగించటానికి పుర్రెలో కొంత భాగాన్ని తెరిచారు. ఆ సమయంలో ఏం జరిగిందో గానీ తెరచి ఉంచి పుర్రెభాగం ప‌గిలిపోయింది. దీంతో ఆ ప్రాంతాన్ని కవర్ చేయటం కుదరలేదు. దీంతో పుర్రెను పూర్తిగా తొల‌గించి పుర్రెపైన ఉన్న చర్మాన్ని క‌లిపి కుట్టేశారు.

డాక్టర్లు చేసిన ఈ ఘనకార్యంతో కీర్తి పార్మ‌ర్ కుడివైపు పుర్రె భాగం పెద్ద సొట్టలాగా ఉండిపోయింది. పుర్రె భాగం లేకుండానే పార్మర్ దినదిన గండంగానే బతుకుతున్నాడు.కుడివైపు మెదుడు భాగంపై కేవ‌లం పైచ‌ర్మం మాత్ర‌మే ఉంది. దీంతో అతను ఏ చిన్న దెబ్బ త‌గిలినా ప్రాణాలు పోతాయ‌న్న భ‌యంతో రోజులు గడుపుతున్నాడు. అతని పరిస్థితి చూసిన కుటుంబ‌స‌భ్యులు ఆవేద‌న చెందుతున్నారు. ఏం చేయాలో అర్థం కాక అతని బాధ..అవస్థలు..అతని పరిస్థితి చూడలేక విలవిలలాడుతున్నారు.

డాక్టర్లు స‌రిగా ఆపరేషన్ చేయక‌పోవ‌డంవ‌ల్లే పుర్రె పగలింద‌ని, తమకు న్యాయం చేయాల‌ని పార్మర్ కుటుంబసభ్యులు కోరుతున్నారు. రీ ఆప‌రేష‌న్ ద్వారా పుర్రెను తిరిగి యధాస్థితికి వచ్చేలా సర్జరీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వీరి బాధ ఇలా ఉంటే..క‌ణితి సైజు పెద్ద‌గా ఉన్నందున పుర్రె పగిలిపోతే తిరిగి సెట్ చేయ‌డం కుద‌ర‌ద‌ని ఆపరేషన్ కు ముందే తాము రోగికి..అతని కుటుంబ సభ్యులకు చెప్పామని దానికి వారు అంగీకరించే స‌ర్జ‌రీ చేయించుకున్నారని అంటున్నారు.

కానీ డాక్టర్లు ముందే చెప్పినా..చెప్పకుండా సర్జరీ సమయంలో ప్రమాదశాత్తు జరిగినా..డాక్టర్ల పొరపాటుతో జరిగినా గానీ..ప్రస్తుతం బాధితుడు మాత్రం రెండేండ్లుగా అనుక్ష‌ణం భ‌యంతో బ‌తకాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి అతని పరిస్థితి ఇలాగే కొనసాగితే..పొరపాటునో లేదా మరేదైనా కారణాలతోనే అతని తలకి దెబ్బ తగిలితే పరిస్థితి ఏంటీ అనేది ఊహించుకుంటేనే భయాందోళనలు కలుగుతున్నాయి. వింటేనే మనకు ఇలా ఉంటే ఇక బాధితుడి మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో తలచుకుంటేనే బాధ కలుగుతోంది.