Karnataka Elections 2023: ముగిసిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్.. వారికి మాత్రమే 9 గంటల వరకు ఓటేసే అవకాశం

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 7గంటల నుంచి పోలింగ్ కొనసాగుతుంది.

Karnataka Elections 2023: ముగిసిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్.. వారికి మాత్రమే 9 గంటల వరకు ఓటేసే అవకాశం

Karnataka Elections 2023

Updated On : May 10, 2023 / 6:57 PM IST

Karnataka Elections 2023: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా.. ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకొని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

The liveblog has ended.

LIVE NEWS & UPDATES

  • 10 May 2023 06:15 PM (IST)

    సాయంత్రం 5 గంటల వరకు 65.69% ఓటింగ్

    పోలింగ్ అధికారికంగా ముగిసే గంట ముందు సమయం అనగా సాయంత్రం 5 గంటల వరకు 65.69 శాతం పోలింగ్ నమోదైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.

  • 10 May 2023 06:03 PM (IST)

    ముగిసిన కర్ణాటక ఎన్నికల పోలింగ్

    కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ అధికారికంగా ముగిసిందని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్, సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. అయితే పోలింగ్ కేంద్రం ముందు క్యూలో ఉన్న ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు రాత్రి 9 వరకు అవకాశం ఇవ్వనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. 6 గంటల లోపు పోలింగ్ కేంద్రానికి వచ్చి క్యూలైన్లో ఉన్నవారికి మాత్రమే ఈ అవకాశాన్ని కల్పించారు.

  • 10 May 2023 05:30 PM (IST)

    కర్ణాటక పోలింగ్‭లో 70% ఓటింగ్ అయ్యే అవకాశం ఉందట

    కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మరికాసేపట్లో ముగియనుంది. కాగా, ఈ ఎన్నికల పోలింగులో 70 శాతం ఓటింగ్ నమోదు కానున్నట్లు ఎన్నికల సంఘం అంచనా వేసింది. సాయంత్రం 3 గంటల వరకు రాష్ట్రంలో 52 శాతం ఓటింగ్ నమోదు అయింది. మరో మూడు గంటలు మాత్రమే ఉన్నందున మరో 20 శాతం ఓటింగ్ నమోదు కానుందని అంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 72 శాతం ఓటింగ్ నమోదైంది. అటు ఇటుగా అదే ఓటింగ్ మళ్లీ పునరావృతం కానున్నట్లు ఎన్నికల సంఘం అంచనా వేస్తోంది.

  • 10 May 2023 05:16 PM (IST)

    ఎగ్జిట్ పోల్స్ వచ్చేస్తున్నాయ్..

    నేటి ఉదయం 7 గంటల నుంచి కొనసాగుతున్న ఎన్నికలు మరో 45 నిమిషాల్లో (సాయంత్రం 6 గంటలకు) ముగియనున్నాయి. అనంతరం ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయి. సాయంత్రం 6 గంటలలోపు పోలింగ్‌ కేంద్రాలో వరుసలో ఉన్న వారిని మాత్రమే రాత్రి 9 గంటల వరకు ఓటు వేసేందుకు అనుమతిస్తారు.

  • 10 May 2023 05:08 PM (IST)

    నయా ట్రెండ్.. చీరెలు, చికెన్ తిరిగి ఇచ్చేసిన ఓటర్లు

    కేఆర్‌పేట్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌లోని గంజిగెరె గ్రామ ఓటర్లు బీజేపీ అభ్యర్థి కేసీ నారాయణగౌడ్‌ ఇచ్చిన చీరెలు, చికెన్ తిరిగి ఇచ్చారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు మంగళవారం సాయంత్రం చీరలు, చికెన్‌ పంపిణీ చేసినట్లు సమాచారం. అయితే వాటిని తిరిగి ఇచ్చేసిన గ్రామస్తులు.. బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

  • 10 May 2023 05:02 PM (IST)

    పోలింగు బూతులో ప్రసవించిన మహిళ

    ఓ అరుదైన ఘటనలో కర్ణాటకలోని బళ్లారిలోని కుర్లగిండి గ్రామంలో పోలింగ్ బూత్‌లో 23 ఏళ్ల యువతి పాపకు జన్మనిచ్చింది. మహిళా అధికారులు, మహిళా ఓటర్లు ఆమె బిడ్డను ప్రసవించేందుకు సహకరించారు.

  • 10 May 2023 04:25 PM (IST)

    ఎన్నికల సంఘం అధికారులపై దాడికి పాల్పడ్డ 23 మంది అరెస్ట్

    విజయపుర జిల్లాలోని మసబినాల గ్రామస్థులు బుధవారం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎంలు) తీసుకువెళుతున్న పోల్ డ్యూటీ వాహనాన్ని ఆపి, అధికారిని దూషిండమే కాకుండా.. బ్యాలెట్ యూనిట్లను ధ్వంసం చేశారు. కాగా, ఈ కేసులో 23 మందిని అరెస్టు చేసినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. అసెంబ్లీ ఎన్నికల కోసం రిజర్వ్ చేయబడిన ఈవీఎంలను తీసుకెళ్తున్న సెక్షన్ ఆఫీసర్ వాహనాన్ని గ్రామస్థులు ఆపి రెండు కంట్రోల్, బ్యాలెట్ యూనిట్లు, మూడు వీవీప్యాట్‌లు (ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయిల్) ధ్వంసం చేశారని ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో తెలిపింది. "సెక్టార్ ఆఫీసర్‌పై దాడి జరిగింది. 23 మందిని అరెస్టు చేశారు" అని ఎన్నికల సంఘం పేర్కొంది. అధికారులు ఈవీఎంలు, వీవీప్యాట్‌లను మారుస్తున్నారనే పుకార్లు రావడంతో గ్రామస్థుల ఈ చర్యకు దిగారు.

  • 10 May 2023 04:21 PM (IST)

    ముఖ్య నియోజకవర్గాల్లో మధ్యాహ్నం 3 గంటలవరకు నమోదైన పోలింగ్ వివరాలు

    కనకపురా 64.5 శాతం

    శికరిపురా 61.08 శాతం

    శిగ్గోన్ 53.77 శాతం

    వరుణ 58.57 శాతం

    హుబ్లీ దర్వాడ్ సెంట్రల్ 49.32 శాతం

    చిక్కబల్లపూర్ 61.37 శాతం పోలింగ్ నమోదు

  • 10 May 2023 03:44 PM (IST)

    సాయంత్రం 3 వరకు 52.03 శాతం పోలింగ్ నమోదు

    కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో సాయంత్రం 3 గంటల వరకు 52.03 శాతం పోలింగ్ నమోదైందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఉదయం పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి మందకొడిగా సాగిన పోలింగ్.. సమయం గడిచేకొద్ది పెరుగుతూ వచ్చింది. ఓటర్లు పోలింగు బూతులకు క్యూ కడుతుండడంతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పోలింగ్ శాతం ఒక్కసారిగా పుంజుకుంది. ఎన్నికల సంఘం అధికారికంగా వెల్లడించిన వివరాల ప్రకారం.. మధ్యాహ్నం 1:00 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 37.25 శాతం ఓటింగ్ నమోదైంది. రెండు గంటల్లో 13 శాతం పోలింగ్ నమోదైంది. ఇక మూడు గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఆలోపు 75-80 శాతం పోలింగ్ నమోదు అవ్వవచ్చని అంటున్నారు.

  • 10 May 2023 03:23 PM (IST)

    ఈవీఎంలు మారుస్తున్నారంటూ ఈవీఎంలు, పోలీసు వాహనాలు ధ్వంసం చేసిన గ్రామస్థులు

    కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మూడు ప్రాంతాల్లో ఘర్షణ వాతావరణం చోటు చేసుకున్నట్లు ఆ రాష్ట్ర పోలీసు విభాగం పేర్కొంది. విజయపుర జిల్లా బసవన బాగేవాడి తాలూకాలోని మసబినల్ గ్రామంలో అధికారులు ఈవీఎంలను మారుస్తున్నారనే పుకార్లు రావడంతో ఆగ్రహించిన పలువురు గ్రామస్తులు కొన్ని ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు, వీవీప్యాట్ (ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయిల్) యంత్రాలను ధ్వంసం చేశారు. పోలింగ్ అధికారుల వాహనాలను కూడా ధ్వంసం చేశారు. బెంగళూరులోని పద్మనాభనగర్ నియోజకవర్గం, బళ్లారి జిల్లాలోని సంజీవరాయనకోట్‌లో మరో రెండు ఘటనలు జరిగాయి.

  • 10 May 2023 02:53 PM (IST)

    పోలింగ్ ప్రక్రియలో ఇద్దరు ఓటర్లు మృతి

    పోలింగ్ ప్రక్రియలో భాగంగా వేరు వేరు రెండు సంఘనల్లో ఇద్దరు ఓటర్లు మరణించారు. బెలగావి జిల్లాలోని ఒక బూత్‌లో క్యూలో నిలబడి 70 ఏళ్ల వృద్ధురాలు చనిపోగా, బేలూరులోని చిక్కోల్‌లో ఓటు వేసిన కొన్ని నిమిషాలకే జయన్న (49) మరణించారు.

  • 10 May 2023 02:38 PM (IST)

    వంట గ్యాస్ సిలిండర్లను చూసిన తర్వాత ఓటేయండి.. ఓటర్లకు డీకే విజ్ఞప్తి

    వంట గ్యాస్ సిలిండర్ల ధర విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ఓటు వేసే ముందు వాటిని ఒకసారి చూడాలని, ఆ తర్వాత ఓటు వేయాలంటూ ఓటర్లకు కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ విజ్ఞప్తి చేశారు. వంట గ్యాస్ ధరలు ఎన్నడూ లేని విధంగా ఆకాశన్ని అంటేలా పెరిగాయని ఆయన అన్నారు. ఇక కొంత మంది కాంగ్రెస్ కార్యకర్తలు పోలింగ్ స్టేషన్ ముందు గ్యాస్ సిలిండరుకు దండ వేస్తూ పెరిగిన ధరలపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

  • 10 May 2023 02:17 PM (IST)

    ఓటు వేసిన నటుడు కిచ్చా సందీప్..

    కన్నడ నటుడు కిచ్చా సందీప్ బెంగళూరులో తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేను సెలబ్రిటీగా ఇక్కడికి రాలేదు, భారతీయుడిగా వచ్చినట్లుగా ఇక్కడ ఉన్నాను. ఓటు వేయడం నా బాధ్యత అన్నారు. ప్రజలు తమ సమస్యలను దృష్టిలో ఉంచుకొని తదనుగుణంగా ఓటు వేయాలని అన్నారు.

  • 10 May 2023 01:51 PM (IST)

    రికార్డు స్థాయిలో పెరిగిన ఓటింగ్.. మధ్యాహ్నం 1 వరకు 37.25% నమోదు

    కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం ఒక్కసారిగా పెరిగింది. ఉదయం పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి మందకొడిగా సాగిన పోలింగ్.. సమయం గడిచేకొద్ది పెరుగుతూ వచ్చింది. ఓటర్లు పోలింగు బూతులకు క్యూ కడుతుండడంతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పోలింగ్ శాతం ఒక్కసారిగా పుంజుకుంది. ఎన్నికల సంఘం అధికారికంగా వెల్లడించిన వివరాల ప్రకారం.. మధ్యాహ్నం 1:00 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 37.25 శాతం ఓటింగ్ నమోదైంది.

    Image

  • 10 May 2023 01:39 PM (IST)

    బళ్లారిలో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ

    రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగు కొనసాగుతుండగా కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. బళ్లారిలోని ఒక పోలింగు బూతు వద్ద ఇరు పార్టీల కార్యకర్తలకు మధ్య మాటా మాటా పెరిగడంతో ఘర్షణ తలెత్తింది.

  • 10 May 2023 01:37 PM (IST)

    అందరి నోటా అదే మాట

    కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. అయితే తామే అధికారంలోకి వస్తామంటే తామే గెలుస్తామంటూ ఏ పార్టీకి ఆ పార్టీ ప్రకటనలు చేస్తోంది. పోలింగ్ బూతుకి వచ్చి ఓటేసిన అనంతరం వివిధ పార్టీల ప్రముఖులు చేసిన వ్యాఖ్యలు ఇవే.
    మల్లికార్జున ఖర్గే: ఈ ఎన్నికల్లో తాము 130 స్థానాలు గెలిచి అధికారాన్ని ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. కలబురిగిలో తన భార్యతో కలిసి ఓటు వేసిన అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు.
    బసవరాజు బొమ్మై: ఈ ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలిచి మరోసారి తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసరవాజు బొమ్మై అన్నారు.
    సిద్ధరామయ్య: ఈ ఎన్నికలే చివరివని ప్రకటించిన మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరమాయ్.. 60 శాతం ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.
    యడియూరప్ప: 70 నుంచి 80 శాతం ఓట్లు బీజేపీకే వస్తాయని మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడియూరప్ప అన్నారు. ఈ ఎన్నికల్లో ఆయన పోటీలో లేరు.
    హెచ్‭డీ కుమారస్వామి: చాలా కాలంగా కింగ్ మేకరుగా ఉంటున్న జేడీఎస్.. ఈ ఎన్నికల్లో కింగ్ అవుతుందని అన్నారు ఆ పార్టీ ముఖ్య నేత, మాజీ ముఖ్యమంత్రి హెచ్‭డీ కుమారస్వామి.

  • 10 May 2023 01:31 PM (IST)

    కర్ణాటక ఎన్నికల్లో 996 సఖి బూత్‭లు

    కర్ణాటక ఎన్నికల సంఘం మొత్తం 996 "సఖి బూత్"లను ఏర్పాటు చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రకారం, ఈ పోలింగ్ కేంద్రాలు పూర్తిగా మహిళలు నిర్వహిస్తున్నారు. ఇది మహిళా సాధికారతకు మంచి ఉదాహరణ అని ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో పేర్కొంది.

  • 10 May 2023 01:25 PM (IST)

    డీకే ఆటో ఫీట్లు.. కనకపుర నియోకవర్గంలో ఆటో నడిపిన కాంగ్రెస్ చీఫ్

    కర్ణాటక కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీ అధ్యక్షుడు డీకే శివకుమార్ తన సొంత నియోజకవర్గం కనకపురలో ఆటో నడుపుతూ కనిపించారు. ఒకవైపు పోలింగ్ జరుగుతుండగా.. మరొకవైపు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి ఆయన ఆటో నడిపారు.

  • 10 May 2023 01:22 PM (IST)

    ఒక వైపు పోలింగ్.. మరొకవైపు సోషల్ మీడియాలో పార్టీల కుస్తీ

    కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఎన్నికల నియమావళి ప్రకారం ప్రచారాన్ని భౌతికంగా ఆపివేసిన పార్టీలు.. సోషల్ మీడియాను మంచి సాధనంగా వాడుకుంటున్నాయి. ప్రత్యక్షంగా పరోక్షంగా తమ పార్టీకే ఓటేయాలంటూ ప్రచారం చేస్తున్నారు. ఈ విషయంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. కర్ణాటక వోట్ ఫర్ బీజేపీ (#KarnatakaVotesForBJP) అనే హ్యాష్‭ట్యాగ్ ప్రస్తుతం టాప్ ట్రెండులో ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ ఏం తక్కువ కాదు. కాంగ్రెస్ విన్నింగ్ 150 (#CongressWinning150) హ్యాష్‭ట్యాగ్‭ను ఆ పార్టీవాళ్లు హైలైట్ చేస్తున్నారు. ఇది ఇండియా ట్రెండులో రెండో స్థానంలో ఉంది. ఈ రకంగా ఓటర్లను ప్రభావితం చేసేందుకు ఇరు పార్టీలు కుస్తీ పడుతున్నాయి.

  • 10 May 2023 01:13 PM (IST)

    కలబురిగిలో భార్యతో కలిసి ఓటేసిన కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే

    కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తన స్వస్థలమైన కలబురిగిలో తన భార్య రాధాబాయి ఖర్గేతో కలిసి బుధవారం మధ్యాహ్నం ఓటు వేశారు.

  • 10 May 2023 01:10 PM (IST)

    కర్ణాటకలో ప్రముఖులు పోటీ చేస్తున్న స్థానాలు ఇవే

    సిద్ధరామయ్య - వరుణ
    బసవరాజు బొమ్మై - షిగ్గాన్
    హెచ్‭డీ కుమారస్వామి - చన్నపట్న
    డీకే శివకుమార్ - కనకపుర
    జగదీష్ షెట్టర్ - హుబ్లీ-దర్వాడ
    బీవై విజయేంద్ర - శికరిపుర
    వీ సునీల్ కుమార్ - కర్కాలా
    ప్రియాంక్ ఖర్గే - చిత్తపూర్
    నిఖిల్ కుమారస్వామి - రామనగర
    సీటీ రవి - చిక్కమగళూరు

  • 10 May 2023 12:05 PM (IST)

    కర్ణాటకలోని వివిధ ప్రాంతంలో 11 గంటల వరకు నమోదైన పోలింగ్

    * బెంగళూరు అర్బన్ - 17.7%
    * బెంగళూరు రూరల్ - 20.3%
    * ఉడిపి- 30.2%
    * చామరాజనగర్- 16%
    * దక్షిణ కన్నడ -28.4%
    * ఉత్తర కన్నడ - 25.4%
    * వరుణ - 24%
    * కనకపుర - 32%
    * హుబ్బలి ధార్వాడ్ సెంట్రల్- 22.1%

  • 10 May 2023 11:37 AM (IST)

    20.94శాతం ఓటింగ్..

    కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా సాగుతుంది. ఉదయం 11 గంటల సమయానికి రాష్ట్ర వ్యాప్తంగా 20.94శాతం పోలింగ్ నమోదైంది.

  • 10 May 2023 11:35 AM (IST)

    బీజేపీకి ఓటు వేయాలంటూ ప్రజలను ప్రోత్సహిస్తున్న ఎన్నికల అధికారి?

    భారతీయ జనతా పార్టీకి ఓటు వేయాలంటూ ప్రిసైడింగ్ అధికారి ప్రజలను ప్రోత్సమిస్తున్నారని కాంగ్రెస్ నే ప్రియాంక్ ఖర్గే ఆరోపించారు. ఈ కారణంచేత చుమ్నూర్ గ్రామంలోని బూత్ నంబర్ 178లో ఓటింగ్ నిలిచిపోయిందని ఆయన అన్నారు. ట్విట్టర్ ద్వారా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. కాగా, ఖర్గే వ్యాఖ్యలపై కర్ణాటక ఎన్నికల సంఘం ప్రధాన అధికారి అదే ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ఫిర్యాదు అందగానే అధికారిని మార్చామని, మళ్లీ పోలింగ్ ప్రారంభించామని తెలిపారు. సదరు అధికారిపై చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

  • 10 May 2023 11:30 AM (IST)

    బీజేపీకి వ్యతిరేకంగా ఓటేశానంటూ పరోక్షంగా ట్వీట్ చేసిన ప్రకాష్ రాజ్

    అధికార భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఓటేశానంటూ నటుడు ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. అయితే బీజేపీ పేరు ఎక్కడా ప్రస్తావించకుండా 40 శాతం అవినీతి ప్రభుత్వం, మత విధ్వేషాలతో రాజకీయం చేసే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేశానంటూ రాసుకొచ్చారు. ‘‘మీ మనస్సాక్షితో ఓటు వేయండి.. కర్ణాటకను కలుపుకొని పోవడానికి ఓటు వేయండి’’ అంటూ కన్నడ ఓటర్లకు ప్రకాష్ రాజ్ పిలుపునిచ్చారు.

  • 10 May 2023 11:26 AM (IST)

    ఓటు వేసిన హెచ్‌డీ కుమారస్వామి ..

    కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ నేత హెచ్‌డీ కుమార స్వామి రామనగర్‌లోని పోలింగ్ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

  • 10 May 2023 11:23 AM (IST)

    రాజకీయాల నుంచి కాదు, ఎన్నికల నుంచి తప్పుకుంటా.. ఓటు వేసిన అనంతరం సిద్ధరామయ్య

    కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య ఉదయం 11 గంటలకు తన ఓటు హక్కును వినియోగించుకున్నరు. వరుణ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన.. 60 శాతానికి పైగా ఓట్లు సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. అయితే తన రాజకీయ రిటైర్మెంట్ గురించి మరోసారి స్పష్టత ఇస్తూ.. తాను కేవలం ఎన్నికల పోటీ నుంచి మాత్రమే తప్పుకుంటానని, రాజకీయాల నుంచి కాదని అన్నారు. ఇవే తనకు చివరి ఎన్నికలని ఈ ఎన్నికల ప్రచారంలో సిద్ధరామయ్య ప్రకటించిన విషయం తెలిసిందే.

  • 10 May 2023 10:49 AM (IST)

    ఓటు వేసిన జగదీష్ షెట్టర్..

    కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, ఇటీవల బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరిన జగదీష్ షెట్టర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. హుబ్లీ -ధార్వాడ్ సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి‌గా జగదీష్ షెట్టర్ పోటీ చేస్తున్నారు.

  • 10 May 2023 10:48 AM (IST)

    ఓటు వేసిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య..

    బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య ఓటు హక్కు వినియోగించుకున్నారు. బెంగళూరులోని పోలింగ్ బూత్ కు చేరుకున్న ఆయన ఓటు వేశారు. అనంతరం ఆయన విజయ చిహ్నాన్ని చూపించారు.

  • 10 May 2023 10:22 AM (IST)

  • 10 May 2023 10:20 AM (IST)

    9గంటల వరకు 8.26శాతం..

    కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాల వద్దకు ఓటేసేందుకు ఓటర్లు తరలివస్తున్నారు. ఉదయం 9 గంటల వరకు 8.26% ఓట్లు పోలయ్యాయి.

  • 10 May 2023 09:49 AM (IST)

    కర్ణాటక ప్రజలకు ఎమ్మెల్సీ కవిత పిలుపు

    కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న వేళ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్విటర్ ద్వారా ఆ రాష్ట్ర ప్రజలకు సూచన చేశారు. ప్రియమైన కర్ణాటక, ద్వేషాన్ని తిరస్కరించండి! సమాజం మరియు ప్రజల అభివృద్ధి, శ్రేయస్సు కోసం ఓటు వేయండి అంటూ పిలుపునిచ్చారు.

     

  • 10 May 2023 09:43 AM (IST)

    బీజేపీ పూర్తిస్థాయి మెజార్టీతో అధికారంలోకి వస్తుంది.. బొమ్మై

    ఓటు వేసిన అనంతరం సీఎం బసవరాజ్ బొమ్మై మీడియాతో మాట్లాడారు.. కర్ణాటక ప్రజలు సానుకూల అభివృద్ధికోసం ఓటు వేస్తారు. బీజేపీ పూర్తిస్థాయి మెజార్టీతో అధికారంలోకి రావడం ఖాయం.

  • 10 May 2023 09:16 AM (IST)

    ఓటు వేసిన సీఎం బసవరాజ్ బొమ్మై

    కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై షిగావ్‌లోని పోలింగ్ బూత్‌కు చేరుకుని తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంతకు ముందు ఆయన హనుమాన్ ఆలయానికి వెళ్లి పూజలు చేశారు. అదేవిధంగా హావేరిలోని షిగ్గావ్ లోని గాయత్రీ దేవి ఆలయంలో ప్రార్థనలు చేశారు. బజరంగ్ బలి ఆలయాన్ని కూడా సందర్శించారు.

     

    Karnataka CM Basavaraj Bommai

    Karnataka CM Basavaraj Bommai

  • 10 May 2023 09:13 AM (IST)

    ఓటు వేసిన నవ వధువు..

    ముదిగెరె అసెంబ్లీ నియోజకవర్గంలో ఓ నవ వధువు పెళ్లి దుస్తులపై పోలింగ్ కేంద్రానికి వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకుంది.

    new bride

    new bride

  • 10 May 2023 09:07 AM (IST)

    ఓటు వేసే ముందు కావేరీలోని గాయత్రి ఆలయంలో ప్రార్థనలు చేసిన కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై

  • 10 May 2023 08:52 AM (IST)

    కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పది మంది మాజీ సీఎంల కుమారులు బరిలో నిలిచారు. ఇందులో బీఎస్ యడ్యూరప్ప కుమారుడు విజయేంద్ర, మాజీ సీఎం ఎస్ఆర్ బొమ్మై కుమారుడు బసవరాజ్ బొమ్మై సహా పలువురు ప్రముఖులు ఉన్నారు.

  • 10 May 2023 08:50 AM (IST)

    ఓటు వేసిన అనంతరం కర్ణాటక మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత యడ్యూరప్ప, ఆయన కుటుంబ సభ్యులు.

    ఓటు వేసిన అనంతరం కర్ణాటక మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత యడ్యూరప్ప, ఆయన కుటుంబ సభ్యులు.

  • 10 May 2023 08:47 AM (IST)

    ఓటు వేసిన ప్రముఖులు..

    - ప్రముఖ రచయిత్రి సుధామూర్తి జయనగర్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఏ ప్రజాస్వామ్యంలోనైనా ఓటర్లు లేకుంటే అది ప్రజాస్వామ్యం కాదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని నేను అభ్యర్థిస్తున్నానని అన్నారు.

    - కర్ణాటక కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈశ్వర్ ఖండ్రే బీదర్‌లోని భాల్కీ ప్రాంతంలో పోలింగ్ కేంద్రానికి తన భార్యతో కలిసివచ్చి ఓటు వేశారు.

    - కర్ణాటక మంత్రి, బీజేపీ నేత సీఎన్ అశ్వత్ నారాయణ్ ఓటు వేశారు. దీక్షాప్రీ స్కూల్ పోలింగ్ బూత్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

    - కన్నడ నటి అమూల్య తన భర్తతో కలిసి బెంగళూరులోని ఆర్ఆర్ నగర్ పోలింగ్ బూత్ వద్దకు చేరుకొని ఓటు హక్కు వినియోగించుకున్నారు.

    - కర్ణాటక హోమంత్రి అరగ జ్ఞానేంద్ర, ఆయన కుటుంబ సభ్యులు తీర్థహళ్లిలో ఓటు వేశారు.

    - కర్ణాటక మంత్రి, బీజేపీ నేత కె. సుధాకర్ చిక్కబల్లాపూర్‌లోని పోలింగ్ కేంద్రం వద్ద తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

  • 10 May 2023 08:41 AM (IST)

    ఓటు వేయని వారికి విమర్శించే హక్కు లేదు.. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి

    ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి బెంగళూరులోని పోలింగ్ బూత్‌కు చేరుకొని ఓటు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటు వేయని వారికి విమర్శించే హక్కు లేదని అన్నారు.

  • 10 May 2023 08:34 AM (IST)

    ఓటు వేసిన నిర్మలా సీతారామన్..

    కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బెంగళూరులోని విజయ్ నగర్ పోలింగ్ బూత్ వద్ద తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో బెంగళూరు మౌలిక సదుపాయాలు మెరుగ్గా ఉండాలని, కర్ణాటకలో పరిశ్రమలు పుంజుకునేందుకు నేను ఓటు వేశానని తెలిపారు. నేను డబుల్ ఇంజిన్ ప్రభుత్వానికి ఓటు వేశానని చెప్పారు.

     

    Union Finance Minister Nirmala Sitharaman

    Union Finance Minister Nirmala Sitharaman

  • 10 May 2023 08:19 AM (IST)

    సంపూర్ణ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం : యడ్యూరప్ప

    కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీజేపీ సీనియర్ నేత బీ.ఎస్. యడ్యూరప్ప శివమొగ్గ‌లోని షికారిపురలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆయనతో పాటు ఆయన కుమారుడు విజయేంద్ర, ఇతర కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. ఓటు వేసిన అనంతరం యడ్యూరప్ప మాట్లాడుతూ.. పూర్తిస్థాయి మెజార్టీ సాధించి బీజేపీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయం. అందులో ఎలాంటి సందేహం లేదని అన్నారు. ప్రజల స్పందన చాలా బాగుందని చెప్పారు. తన కుమారుడు విజయేంద్ర ఇక్కడ 40వేలకుపైగా ఓట్లు తెచ్చుకోబుతున్నారని అన్నారు.

    యడ్యూరప్ప తనయుడు విజయేంద్ర మాట్లాడుతూ.. ఇది నా తొలి ఎన్నికలు. పార్టీ నాకు పోటీచేసే అవకాశం ఇచ్చినందుకు సంతోషంగా ఉంది. నేను షికారిపుర స్థానం నుంచి పోటీ చేయడం విశేషం. హంగ్ అసెంబ్లీతో ప్రజలు విసిగిపోయారు. బీజేపీకి మెజార్టీ వస్తుందని నేను నమ్మకంతో ఉన్నానని చెప్పారు.

     

    Former Chief Minister of Karnataka BJP senior leader B.S. Yeddyurappa

    Former Chief Minister of Karnataka, BJP senior leader B.S. Yeddyurappa

  • 10 May 2023 08:08 AM (IST)

    ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ట్వీట్ ..

    కర్ణాటక ప్రజలు ప్రగతిశీలమైన, పారదర్శకమైన సంక్షేమ ఆధారిత ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని నిర్ణయించుకున్నారు. నేడు పెద్ద సంఖ్యలో ఓటు వేసే సమయం వచ్చింది. మెరుగైన భవిష్యత్తు కోసం ఈ ప్రజాస్వామ్య ప్రక్రియలో పాల్గొనడానికి మొదటి సారి ఓటర్లను మేము స్వాగతిస్తున్నాము అని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు.

  • 10 May 2023 08:04 AM (IST)

    బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ట్వీట్..

    ప్రజాస్వామ్య పండుగలో అధిక సంఖ్యలో పాల్గొనాలని కర్ణాటక ఓటర్లకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విజ్ఞప్తి చేశారు. కర్ణాటక భవిష్యత్తును నిర్ణయించడంలో ఈ ఎన్నికలు కీలకం. రాష్ట్ర ప్రగతికి కొనసాగింపుని అందించే, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి కట్టుబడి ఉన్న ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలని ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను.

  • 10 May 2023 08:01 AM (IST)

    ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ ..

    పెద్ద ఎత్తున ఓటింగ్‌లో కర్ణాటక ఓటర్లు పాల్గొనాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. కర్నాటక ప్రజలు, ముఖ్యంగా యువకులు, మొదటిసారి ఓటర్లు అధిక సంఖ్యలో ఓటు వేసి ప్రజాస్వామ్య పండుగను సుసంపన్నం చేయాలని అన్నారు. అదేవిధంగా పంజాబ్‌లోని పార్లమెంట్ స్థానానికి, మేఘాలయ, ఒడిశా, యూపీలో అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఆయా నియోజకవర్గాల ఓటర్లు తమ ఓటు హక్కును అధిక సంఖ్యలో వినియోగించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు.

  • 10 May 2023 07:55 AM (IST)

    కేంద్ర మంత్రి అమిత్ షా ట్వీట్..

    రాష్ట్రంలో సుపరిపాలన, అభివృద్ధి, శ్రేయస్సుకోసం ఓటు వేయడానికి కర్ణాటక ఓటర్లు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కోరారు. మీ ఒక్క ఓటు రాష్ట్రాన్ని కొత్త శిఖరాలకు, ప్రజానుకూలమైన, ప్రగతికి అనుకూలమైన ప్రభుత్వాన్ని నిర్ధారిస్తుంది.

  • 10 May 2023 07:49 AM (IST)

  • 10 May 2023 07:48 AM (IST)

    ఓటు వేసిన నటుడు ప్రకాష్ రాజ్..

    ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. బెంగళూరులోని శాంతి‌నగర్‌  పోలింగ్ బూత్‌లో ప్రకాష్ రాజ్ ఓటు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మత రాజకీయాలకు వ్యతిరేకంగా ఓటు వేయాలని ఓటర్లను కోరారు.

  • 10 May 2023 07:42 AM (IST)

    ఓటు వేసిన సిద్దలింగ స్వామి

    తమకూరులో సిద్దగంగ మఠానికి చెందిన సిద్దలింగ స్వామి తన ఓటుహక్కును వినియోగించుకున్నారు.

  • 10 May 2023 07:40 AM (IST)

    సంపన్న అభ్యర్థులు..

    కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి చాలా మంది సంపన్న అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇందులో అత్యంత ధనిక స్వతంత్ర అభ్యర్థి యూసుఫ్ షరీఫ్. అతని ఆస్తులు 1,633 కోట్లు. సంపన్న అభ్యర్థుల జాబితాలో బీజేపీకి చెందిన ఎన్. నాగరాజు(1,609 కోట్లు), కాంగ్రెస్ అభ్యర్థి డీకే శివకుమార్ (1,413 కోట్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

  • 10 May 2023 07:29 AM (IST)

    కర్ణాటక రాష్ట్రంలో మొత్తం అసెంబ్లీ స్థానాలు : 224

    బరిలో నిలిచిన అభ్యర్థుల సంఖ్య : 2,615

    రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య : 5.31 కోట్లు

    మహిళా ఓటర్లు : 2.59కోట్లు

    పురుష ఓటర్లు : 2.62కోట్లు

    పోలింగ్ కేంద్రాలు : 58,545

    సమస్యాత్మక పోలింగ్ బూత్‌లు : 11,617

    పోలింగ్ సిబ్బంది : 4లక్షల మంది

    విధుల్లో పాల్గొనే పోలీస్ సిబ్బంది : 1.56లక్షలు

    మే 13న ఫలితాలు

    224 అసెంబ్లీ స్థానాల్లో మ్యాజిక్ ఫిగర్ 113

  • 10 May 2023 07:26 AM (IST)

    కర్ణాటకలో 2018 సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 72.36శాతం ఓటింగ్ నమోదైంది. ఈసారి గతంకంటే ఎక్కువగా ఓటింగ్ శాతం నమోదు కావొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

  • 10 May 2023 07:23 AM (IST)

    కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఉదయం 7గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 6గంటల వరకు కొనసాగనుంది. రాష్ట్రంలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 2,165 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్, జేడీ(ఎస్) పార్టీలు పోటీ పడుతున్నాయి.