తబ్లిగీలు హీరోలు అంటూ ప్రశంసలు, ఐఏఎస్ అధికారికి ప్రభుత్వం నోటీసులు

  • Published By: srihari ,Published On : May 3, 2020 / 03:24 AM IST
తబ్లిగీలు హీరోలు అంటూ ప్రశంసలు, ఐఏఎస్ అధికారికి ప్రభుత్వం నోటీసులు

దేశంలో కరోనా వ్యాప్తిలో తబ్లిగీలు కీలకంగా మారిన విషయం తెలిసిందే. ఢిల్లీలో జరిగిన తబ్లిగీ జమాత్‌తో దేశంలో కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఈ విషయంలో దేశవ్యాప్తంగా తబ్లిగీలపై విమర్శలు వెల్లువెత్తుతుంటే.. ఓ ఐఏఎస్ అధికారి మాత్రం వారు హీరోలని పొగిడారు. వారిపై ప్రశంసల వర్షం కురిపించారు. కరోనా నుంచి కోలుకున్న కొందరు తబ్లిగీలు ప్లాస్మా దానం చేసిన సంగతి తెలిసిందే. వారిని ఉద్దేశించి ఐఏఎస్ అధికారి స్పందించారు. వారిని పొగుడుతూ కామెంట్లు చేశారు. దీంతో ఆయన చిక్కుల్లో పడ్డారు. ప్రభుత్వం ఆ ఐఏఎస్ కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

తబ్లిగీలు హీరోలు, ప్లాస్మా దానం గురించి ఎందుకు చూపించరు:
కర్ణాటకలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. మహ్మద్‌ మోహ్‌సిన్‌ అనే ఐఏఎస్‌ అధికారి కర్ణాటక బ్యాక్‌వర్డ్‌ క్లాసెస్‌ వెల్ఫేర్‌ డిపార్ట్‌మెంట్‌లో సెక్రటరీగా పనిచేస్తున్నారు. ఏప్రిల్ 27న తన ట్విటర్‌ ఖాతాతో తబ్లిగీ సభ్యులపై స్పందిస్తూ.. ‘‘ఒక్క ఢిల్లీలోనే 300లకుపైగా తబ్లిగీ హీరోలు దేశానికి సేవ చేయటానికి తమ ప్లాస్మాను దానం చేస్తున్నారు. దీని గురించి ఏమంటారు.. గోదీ మీడియా? కరోనా వ్యాప్తి తబ్లిగీలతోనే జరిగిందని ప్రచారం చేసినవారు ఇప్పుడు తబ్లిగీలు ప్లాస్మా దానం చేస్తున్న అంశం గురించి ఎందుకు ప్రచారం చేయరు. ఈ హీరోలు చూపే మానవత్వం గురించి మీడియా వాళ్లు ఎందుకు చూపించరు’ అని ప్రశ్నిస్తూ మహమ్మద్ మోహ్ సీన్ ట్విటర్‌లో మండిపడ్డారు.

ఐఏఎస్ అధికారికి ప్రభుత్వం నోటీసులు:
ఈ ట్వీట్‌ కాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అక్కడి మీడియా సైతం ఈ ట్వీటును హైలైట్‌ చేసింది. దీంతో స్పందించిన కర్నాటక ప్రభుత్వం సదరు అధికారికి షోకాజు నోటీసులు జారీ చేసింది. ఆల్‌ ఇండియా సర్వీసెస్‌ రూల్స్‌ 1968ను అతిక్రమించినందుకు గానూ ఐదు రోజుల్లో రాత పూర్వక వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

గతంలో ప్రధాని మోడీ హెలికాప్టర్ తనిఖీకి ఆదేశించిన ఐఏఎస్:
ఈ విషయమై మొహ్ సీన్ స్పందిస్తూ.. ‘కరోనా గురించి నేను 40-50 పోస్టులు పెట్టాను. ముఖ్యమంత్రి చేసిన విజ్ఞప్తులకు సంబంధించినవి కూడా అందులో ఉన్నాయి’ అని తెలిపారు. తబ్లిగీ జమాత్ సమావేశం కారణంగా దేశంలో కరోనా ఒక్కసారిగా వ్యాపించిందన్న ఆరోపణలున్న క్రమంలో ఐఏఎస్ అధికారి చేసిన ట్వీట్ అభ్యంతరకరంగా ఉందని ప్రభుత్వం స్పష్టం చేసింది. కాగా, మోహ్ సీన్ 2019 ఏప్రిల్‌లో లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఒడిశాలో ప్రధాని మోడీ హెలికాప్టర్ తనిఖీకి ఆదేశించి సస్పెండ్ అయిన విషయం తెలిసిందే.