Kashmir Solidarity Day : హ్యుందాయ్ పాకిస్తాన్ కశ్మీర్ పోస్ట్‌పై భారత్‌ నుంచి విమర్శల వెల్లువ..!

ప్రముఖ హ్యుందాయ్ మోటార్స్ పాకిస్తాన్ చిక్కుల్లో పడింది. కశ్మీర్ విషయంలో పాకిస్థాన్ సపోర్ట్ చేసిన పోస్టు తీవ్ర దుమారాన్ని రేపింది.

Kashmir Solidarity Day : హ్యుందాయ్ పాకిస్తాన్ కశ్మీర్ పోస్ట్‌పై భారత్‌ నుంచి విమర్శల వెల్లువ..!

Kashmir Solidarity Day Indi

Kashmir Solidarity Day : ప్రముఖ హ్యుందాయ్ మోటార్స్ పాకిస్తాన్ చిక్కుల్లో పడింది. కశ్మీర్ విషయంలో పాకిస్థాన్ సపోర్ట్ చేసిన పోస్టు తీవ్ర దుమారాన్ని రేపింది. హ్యుందాయ్ పాకిస్తాన్ పోస్టుకు వ్యతిరేకంగా భారత్ నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కశ్మీర్ సంఘీభావ దినోత్సవం (Kashmir Solidarity Day) సందర్భంగా హ్యుందాయ్ పాకిస్థాన్ పోస్ట్‌ చేయడం ఆందోళనకు దారితీసింది. ఈ వ్యవహారంలో దక్షిణ కొరియా రాయబారికి సమన్లు జారీ చేసినట్టు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది.

ఫిబ్రవరి 5న హ్యుందాయ్ పాకిస్తాన్.. కశ్మీర్‌కు సంబంధించి సోషల్ మీడియా పోస్ట్‌ పెట్టింది. దీనిపై వెంటనే వివరణ ఇవ్వాల్సిందిగా మంత్రిత్వ శాఖ రాయబారి చాంగ్ జే-బోక్‌ (ROK FM Chung Eui-yong)ను కోరింది. సియోల్‌లోని భారత రాయబారి శ్రీప్రియ రంగనాథన్ కూడా హ్యుందాయ్ ప్రధాన కార్యాలయంలో అధికారులతో సమావేశమయ్యారు. ఈ వివాదాస్పద పోస్టుపై హ్యుందాయ్ మోటార్స్ ఇండియా తక్షణమే భారత్‌కు క్షమాపణలు చెప్పాలంటూ పెద్ద సంఖ్యలో నెటిజన్లు, పలువురు రాజకీయ నేతలు డిమాండ్ చేస్తున్నారు. #BoycottHyundai అంటూ ట్విట్టర్ ట్రెండ్ చేస్తున్నారు.


రాజకీయ, మతపరమైన సమస్యలపై తమ కంపెనీ వ్యాఖ్యానించదని హ్యుందాయ్ మోటార్ కంపెనీ స్పష్టం చేసింది. పాకిస్తాన్‌లోని స్వతంత్ర యాజమాన్యంలోని డిస్ట్రిబ్యూటర్ అకౌంట్ నుంచి కశ్మీర్ సంబంధిత పోస్ట్ పెట్టినట్టు పేర్కొంది. అయితే ఆ పోస్టును వెంటనే తొలగించినట్టుగా వెల్లడించింది. భవిష్యత్తులో ఇలాంటి పోస్ట్‌లు మళ్లీ పునరావృతం కాకుండా నిరోధించే దిశగా చర్యలు చేపట్టినట్టు కంపెనీ తెలిపింది.


ఈ పోస్ట్ చేసిన వెంటనే, ఫిబ్రవరి 6న (ఆదివారం) సియోల్‌లోని రాయబారి హ్యుందాయ్ ప్రధాన కార్యాలయాన్ని సంప్రదించి వివరణ కోరగా.. వెంటనే ఆ పోస్ట్ డిలీట్ చేసినట్టు హ్యుందాయ్ మోటార్ తెలిపింది. సోషల్ మీడియా పోస్ట్ ద్వారా చేసిన పోస్టు పట్ల విచారం వ్యక్తం చేస్తున్నట్టు హ్యుందాయ్ వివరణ ఇచ్చుకుంది.

అనధికారిక సోషల్ మీడియా కార్యకలాపాలపై హ్యుందాయ్ మోటార్స్ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. అనేక దశాబ్దాలుగా భారత్‌లో పెట్టుబడులు పెడుతున్నామని హ్యుందాయ్ మోటార్స్ గుర్తుచేసింది. భారతీయ వినియోగదారుల విషయంలో నియమ నిబంధనలకు కట్టుబడి ఉన్నామని పేర్కొంది. ఇలాంటి కంపెనీలు లేదా అనుబంధ సంస్థలు సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత విషయాలపై తప్పుడు ప్రకటనలు, తప్పుదారి పట్టించే వ్యాఖ్యలు చేయదంటూ కంపెనీ వివరణ ఇచ్చింది.


కశ్మీర్ సంఘీభావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ట్వీట్లు చేయడం, పోస్ట్ చేయడం వంటి పాక్ కుట్రలో భాగమేనంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హ్యుందాయ్ ప్రొడక్టులను కొనుగోలు చేయడం మానేయాలంటూ భారతీయుల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వస్తోంది. హ్యుందాయ్ ఇండియా ఈ విషయంలో తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేసింది. హ్యుందాయ్ మోటార్ ఇండియా 25 ఏళ్లకు పైగా భారతీయ మార్కెట్‌కు కట్టుబడి ఉందని కంపెనీ తెలిపింది. భారత మార్కెట్‌తో పోలిస్తే.. పాకిస్తాన్ మార్కెట్ చాలా తక్కువనే చెప్పాలి.

వివాదం ఎలా మొదలైందంటే..
ఫిబ్రవరి 5వ తేదీన పాకిస్తాన్‌లో కశ్మీర్ కోసం పోరాడి అమరులైన వారిని గుర్తుచేసుకుంటూ ప్రతి ఏడాది కశ్మీరీ సంస్మరణ దినాన్ని జరుపుకుంటారు. అదే రోజు.. హ్యుందాయ్ పాకిస్తాన్ ట్విట్టర్  (@HyundaiPakistanOfficial) అంటూ పోస్టు పెట్టింది. ‘మన కాశ్మీరీ సోదరుల త్యాగాలను గుర్తుచేసుకుందాం. వారు స్వాతంత్ర్యం కోసం చేసిన పోరాటానికి మద్దతుగా నిలబడదాం.. #HyundaiPakistan #KashmiriSolidarityDay’ అని పోస్ట్ చేసింది. ఈ పోస్టుపై పెద్ద ఎత్తున్న అభ్యంతరాలు వ్యక్తం కావడంతో వెంటనే ఆ పోస్టు డిలీట్ చేసింది.

Read Also : Hijab Row: స్కూల్స్, కాలేజీలు మూడు రోజులు క్లోజ్… శాంతి, సామరస్యంతో ఉండాలని సీఎం పిలుపు