Kishan Reddy: బీజేపీ గురించి విజయశాంతి చేస్తున్న ట్వీట్లను నేను..: కిషన్ రెడ్డి
తనకు బీజేపీలో ఎవరితోనూ విభేదాలు లేవని కిషన్ రెడ్డి చెప్పారు. తాను మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని కలిస్తే తప్పేంటని అన్నారు.

Kishan Reddy
Kishan Reddy – Vijayashanti: తెలంగాణ(Telangana)లో కురుస్తున్న భారీ వర్షాలకు పలు జిల్లాల్లో అనేక ప్రాంతాలు నీట మునిగాయి. వరద ప్రాంతాలను పరిశీలించాలని కేంద్ర మంత్రి, బీజేపీ (BJP) తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి నిర్ణయించారు. ఇవాళ ఆయన వరంగల్‌కు వెళ్లారు. ఆదివారం వరంగల్, హనుమ కొండ, భూపాలపల్లి, ఖమ్మం జిల్లాల్లో పర్యటించనున్నారు.
ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ బీజేపీలో నెలకొన్న పరిస్థితులపై స్పందించారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌తో తనకు పడదు అనేది పాత ముచ్చటని చెప్పారు. రాజాసింగ్ సస్పెన్షన్ విషయం బీజేపీ జాతీయ నాయకత్వం పరిధిలో ఉందని అన్నారు.
తనకు బీజేపీలో ఎవరితోనూ విభేదాలు లేవని కిషన్ రెడ్డి చెప్పారు. తాను మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిను కలిస్తే తప్పేంటని అన్నారు. విజయశాంతి చేస్తున్న ట్వీట్లను తాను చూడలేదని చెప్పారు. బీజేపీ ఉన్న అంతర్గత సమస్యలపై అంతర్గతంగానే చర్చించుకుంటామని తెలిపారు.
అసెంబ్లీలో బీజేపీ ఫ్లోర్ లీడర్ ను నియమిస్తాం
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీజేపీ కార్యాలయాల్లో వరద బాధితులకు భోజనాలు ఏర్పాటు చేయాలని తమ పార్టీ నేతలను కిషన్ రెడ్డి ఆదేశించారు. మృతుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం రూ.4 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేస్తోందని తెలిపారు. బాధితులను ఆదుకునేందుకు రెండు ఆర్మీ హెలికాప్టర్లు తెలంగాణలో తిరుగుతున్నాయని అన్నారు.
అవసరం అయితే ఇంకొన్ని హెలికాప్టర్లను పంపుతామని తెలిపారు. ఇప్పటి వరకు పది ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వచ్చాయని అన్నారు. అసెంబ్లీలో బీజేపీ ఫ్లోర్ లీడర్ ను నియమిస్తామని కిషన్ రెడ్డి చెప్పారు. అసెంబ్లీ ప్రాధాన్యాన్ని తగ్గేలా సీఎం కేసీఆర్ ప్రయత్నాలు చేశారని అన్నారు.