హైదరాబాద్‌లో కేటీఆర్‌ పర్యటన షెడ్యూల్, అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం

హైదరాబాద్‌లో కేటీఆర్‌ పర్యటన షెడ్యూల్, అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం

ktr tour schedule in hyderabad : తెలంగాణ మున్సిపల్‌, ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ 2021, జనవరి 09వ తేదీ శనివారం భాగ్యనగరంలో పర్యటించనున్నారు. జీహెచ్‌ఎంసీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టనున్నారు. ముషీరాబాద్‌ నియోజకవర్గంలో తొలుత కేటీఆర్‌ పర్యటిస్తారు. పేదల కోసం ప్రభుత్వం 11 కోట్ల వ్యయంతో నిర్మించిన డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను లబ్దిదారులకు అందజేయనున్నారు. మొత్తం 126 మందికి డబుల్‌ ఇళ్లను అందజేస్తారు. అడిక్‌మెట్‌లో ప్రభుత్వం మల్టీపర్సస్‌ కాంప్లెక్స్‌ను నిర్మించింది. దీన్ని కూడా కేటీఆర్‌ ప్రారంభిస్తారు. నారాయణగూడలో 4 కోట్ల వ్యవయంతో నిర్మించనున్న మోడల్‌ మార్కెట్‌ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేస్తారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు కేటీఆర్‌… ఎల్‌బీనగర్‌ నియోజకవర్గంలో పర్యటిస్తారు. ఎల్‌బీనగర్‌ సర్కిల్‌లో జలమండలి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన జంట రిజర్వాయర్లను ఆయన ప్రారంభిస్తారు. 9కోట్ల 42 లక్షల వ్యయంతో… వాసవీనగర్‌, కొత్తపేటలో ఒక్కొక్క రిజర్వాయర్‌ను 2.5 మిలియన్‌ లీటర్ల సామర్థ్యంలో జల మండలి నిర్మించింది. దాదాపు 88వేల గృహాలకు వీటి ద్వారా నీటిని సరఫరా చేసే అవకాశముంది. వనస్థలిపురం జింకల పార్కు సమీపంలో ప్రభుత్వం కొత్తగా శాటిలైట్‌ బస్‌ టెర్మినల్‌ నిర్మించాలని నిర్ణయించింది. దీనికి మంత్రి శంకుస్థాపన చేయనున్నారు. కేటీఆర్‌ పర్యటన కోసం జీహెచ్‌ఎంసీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

ఇక ఈనెల 11న కేటీఆర్‌ మరో కీలక పథకాన్ని హైదరాబాద్‌లో ప్రారంభించనున్నారు. బల్దియా పరిధిలో ఉచిత నీటి సరఫరా పథకం అమలు చేయనున్నారు. యూసుఫ్‌గూడ నుంచి ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల సమయంలో ఇంటింటికీ 20వేల లీటర్ల వరకు నీటిని ఉచితంగా సరఫరాచేస్తామని సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారు. ఈ హామీ అమలుకు కేసీఆర్‌ ఆదేశించడంతో… సోమవారం కేటీఆర్‌ ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఉచిత మంచినీరు పథకానికి సంబంధించిన విధి విధానాలు ఇప్పటికే ప్రభుత్వం ఖరారుచేసింది. ఇన్నాళ్లు నీటి బిల్లులు చెల్లిస్తున్న నగర ప్రజలకు ఈ పథకంలో కొంత ఊరట లభించనుంది.