దుర్గామాత దయ వల్లే బతికి బయటపడ్డా…బెంగాల్ లో కాన్వాయ్ ఎటాక్ ఘటనపై నడ్డా

  • Published By: venkaiahnaidu ,Published On : December 10, 2020 / 05:26 PM IST
దుర్గామాత దయ వల్లే బతికి బయటపడ్డా…బెంగాల్ లో కాన్వాయ్ ఎటాక్ ఘటనపై నడ్డా

BJP Chief JP Nadda On Attack In Bengalమమత సర్కార్ పై భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. బెంగాల్లో చ‌ట్ట‌వ్య‌తిరేక కార్య‌క‌లాపాల‌కు, అస‌హ‌నానికి త్వ‌ర‌లోనే తెర‌ప‌డ‌నుందని, తృణముల్ ప్రభుత్వ ఆట‌విక రాజ్యం ఇంకా ఎంతో కాలం కొనసాగ‌ద‌ని మండిప‌డ్డారు.



త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న వెస్ట్ బెంగాల్ లో ఇప్పటికే ఎన్నికల వేడి తారాస్థాయిలో రాజుకుంది. ఎలాగైనా సరే రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టేందుకు బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. అటు అధికారాన్నికాపాడుకునేందుకు తృణమూల్ కాంగ్రెస్‌ (టీఎంసీ) శతవిధాలా ప్రయత్నిస్తోంది. మ‌రో ఆరు నెల‌ల్లో ప‌శ్చిమ‌బెంగాల్లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగ‌నుండ‌టంతో ప్ర‌చార ఏర్పాట్లపై చ‌ర్చించ‌డం కోసం రెండు రోజుల పర్యటన కోసం వెస్ట్ బెంగాల్ వెళ్లిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకి నిర‌స‌న సెగ త‌గిలింది. నడ్డా కాన్వాయ్ పై గురువారం రాళ్ల దాడి జరిగింది.



గురువారం రాజధాని కోల్ కతాకి దగ్గర్లోని డైమండ్ హార్బర్ నియోజ‌క‌వ‌ర్గంలో ఏర్పాటు చేసిన స‌భ‌కు వెళ్తుండ‌గా.. రోడ్డును బ్లాక్ చేసిన ఆందోళ‌న‌కారులు న‌డ్డా కాన్వాయ్‌పై దాడికి పాల్ప‌డ్డారు. నడ్డా కాన్వాయ్ పై ఇటుకలు,రాళ్ల దాడి జరిగింది. నడ్డాతోపాటు ప‌శ్చిమ‌బెంగాల్ బీజేపీ వ్య‌వ‌హారాల ఇన్‌చార్జి కైలాష్ విజ‌య‌వ‌ర్గీయ‌, స్థానిక బీజేపీ నేత ముకుల్ రాయ్ వాహ‌నాల‌పై కూడా ఆందోళ‌న‌కారులు దాడి చేశారు. అదేవిధంగా కాన్వాయ్ వెంట బైకుల‌పై వెళ్తున్న బీజేపీ కార్య‌క‌ర్త‌ల‌పై కూడా ఆందోళ‌నకారులు రాళ్లు విసిరారు. దారి వెంట బీజేపీ నాయ‌కులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల‌ను చించేశారు. బీజేపీకి వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు.



ఈ ఘటనలో న‌డ్డా కాన్వాయ్‌లోని అన్ని వాహ‌నాల‌ అద్దాలు ప‌గిలిపోయాయి. ఈ దాడిలో విజ‌య‌వ‌ర్గీయతోపాటు ప‌లువురు కార్య‌క‌ర్త‌ల‌కు కూడా గాయాల‌య్యాయి. కాగా,రాళ్ల దాడికి పాల్పడింది తృణముల్ కాంగ్రెస్ కార్యకర్తలేనని బీజేపీ నాయకులు ఆరోపించారు. డైమండ్ హార్బ‌ర్.. ప‌శ్చిమ‌బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తాబెన‌ర్జి మేన‌ల్లుడు అభిషేక్ బెన‌ర్జి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజ‌క‌వ‌ర్గం కావ‌డంతో ఆయ‌నే ఈ దాడి చేయించాడ‌ని బీజేపీ నేత‌లు ఆరోపిస్తున్నారు.



అయితే, ఆ తర్వాత ఓ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన నడ్డా.. తాను మీటింగ్ రాగలిగానంటే దానికి అది దుర్గామాత దయ వల్లేనని అన్నారు. మమత సర్కార్ పై నడ్డా ఈ సందర్భంగా తీవ్ర విమర్శలు గుప్పించారు. తృణముల్ కాంగ్రెస్ హయాంలో బెంగాల్ నాశనమైపోతుందని నడ్డా విమర్శించారు. రాష్ట్రం గూండా రాజ్ రాజ్యమేలుతుందని,పరిపాలన పూర్తిగా కొలాప్స్ అయిందని విమర్శించారు. మమత ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని..గూండా రాజ్ ని ఓడించాల్సిన అవసరముందన్నారు.



ఇవాళ జరిగిన దాడిలో బీజేపీ నేతలు ముకుల్ రాయ్,కైలాష్ వర్గీయ గాయపడ్డారని నడ్డా తెలిపారు. ఇది ప్రజాస్వామానికి సిగ్గుచేటని నడ్డా అన్నారు. కాన్వాయ్ లోని ప్రతి ఒక్క కారుపైన దాడి జరిగిందని తెలిపారు. బుల్లెట్ ఫ్రూఫ్ కారులో ఉండటం వల్ల తాను సురక్షితంగా బయటపడగలిగానని నడ్డా అన్నారు. వెస్ట్ బెంగాల్ ని దుర్మార్గం,అసహనానికి ముగింపు పలకాలని అన్నారు. 2021లో బెంగాల్ లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తదని నడ్డా ధీమా వ్యక్తం చేశారు. బెంగాల్ కమల వికాసం ఖాయమని నడ్డా తెలిపారు.



మరోవైపు, ఇవాళ జరిగిన ఘటనపై బెంగాల్ మంత్రి సుబ్రతా ముఖర్జీ స్పందిస్తూ..ఈ ఘటన క్రియేట్ చేయబడినది అని,బెంగాల్ లో తమ రాజకీయ ఎజెండా కోసం శాంతికి భంగం కలిగించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. రెచ్చగొట్టుడు కార్యక్రమాలను జేపీ నడ్డా దగ్గరుండి నిర్వహిస్తున్నారని విమర్శించారు. ఇవాళ జరిగిన ఘటన అంతా ఫ్రీ ఫ్లాన్ అని సుబ్రతా ముఖర్జీ విమర్శించారు. కాన్వాయ్ పై దాడి ఘటనపై ప్రభుత్వం దర్యాప్తు చేసి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇదిలావుంటే, న‌డ్డాకు భ‌ద్ర‌తా క‌ల్పించ‌లేక‌పోవ‌డంపై వివ‌ర‌ణ ఇవ్వాల‌ని కేంద్ర ‌హోంశాఖ ప‌శ్చిమ‌బెంగాల్ ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది.

జేపీ నడ్డాపై జరిగిన దాడిని కేంద్ర మంత్రులు తీవ్రంగా ఖండించారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతల ఆధ్వర్యంలోనే దాడి జరిగిందని కేంద్ర మంత్రులు పియూష్‌ గోయల్‌, నరేంద్రసింగ్‌ తోమర్‌ ఆరోపించారు. టీఎంసీ నేతలు జేపీ నడ్డాను చంపాలని ప్రయత్నించారని, బుల్లెట్ ప్రూఫ్‌ కారు ఉంది కాబట్టే ఆయన బతికి బయట పడ్డారన్నారు.ఈ ఘటనపై దర్యాప్తు జరిపించి నిందితులను శిక్షించాలని డిమాండ్‌ చేశారు.