Mallika Sagar: WPL వేలంలో అందరి దృష్టి మల్లికా సాగర్ పైనే.. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. దినేష్ కార్తీక్ ఏం ట్వీట్ చేశాడంటే..

Mallika Sagar: భారత క్రికెట్ చరిత్రలో తొలిసారిగా నిర్వహించిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) వేలంలో ప్లేయర్స్ తో సమానంగా వేలం నిర్వాహకురాలు మల్లికా సాగర్ కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.

Mallika Sagar: WPL వేలంలో అందరి దృష్టి మల్లికా సాగర్ పైనే.. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. దినేష్ కార్తీక్ ఏం ట్వీట్ చేశాడంటే..

భారత క్రికెట్ చరిత్రలో తొలిసారిగా నిర్వహించిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) వేలం సోమవారం ముంబైలో విజయవంతంగా ముగిసింది. 5 ఫ్రాంచైజీలు 59.5 కోట్ల రూపాయలు వెచ్చించి 87 మంది క్రీడాకారిణులను ఈ వేలంలో దక్కించుకున్నాయి. భారత స్టార్ క్రీడాకారిణి స్మృతి మంధానను రూ. 3.40 కోట్లకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సొంతం చేసుకుంది. పలువురు క్రీడాకారిణులు ఊహించిన దాని కంటే అత్యధిక ధర సాధించి అందరినీ ఆకర్షించారు. ప్లేయర్స్ తో సమానంగా వేలం నిర్వాహకురాలు మల్లికా సాగర్ కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.

మల్లికా సాగర్.. WPL వేలం నిర్వహించిన తీరును ప్రశంసిస్తూ వెటరన్ ఇండియన్ వికెట్ కీపర్ బ్యాటర్ దినేష్ కార్తీక్ ట్వీట్ చేశాడు. “మల్లికా సాగర్ అద్భుతమైన వేలం నిర్వాహకురాలు. ఆమె చాలా నమ్మకంగా, స్పష్టంగా, ధైర్యంగా వ్యవహరించారు. WPLలో సరైన ఎంపిక. వెల్ డన్ BCCI” అని కార్తీక్ తన ట్విటర్ పేజీలో పేర్కొన్నాడు.


ముంబైకి చెందిన మల్లికా సాగర్.. ప్రస్తుతం ఆర్ట్ ఇండియా కన్సల్టెంట్స్ సంస్థలో పనిచేస్తున్నారు. ఆధునిక, సమకాలిన భారత కళలను సంబంధించిన వాటిని సేకరించడం ఆమె వృత్తి. హ్యూ ఎడ్మీడ్స్, రిచర్డ్ మాడ్లీ, చారు శర్మ గతంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వేలం నిర్వహించారు. ప్రతిష్టాత్మక ఐపీఎల్ వంటి T20 లీగ్‌ లో మొదటి మహిళా వేలం నిర్వాహకురాలిగా మల్లికా సాగర్ గుర్తింపు పొందారు.

మల్లికా సాగర్ గతంలోనూ వేలం నిర్వాహకురాలిగా వ్యహరించారు. 2021లో ప్రో కబడ్డీ లీగ్‌ వేలంలోనూ ఆమె పాల్గొన్నారు. లండన్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ ఆన్ లైన్ వేలం సంస్థ క్రిస్టీలో 2001లో ఆమె ఉద్యోగ జీవితం ప్రారంభమైంది. భారతీయ సంతతికి చెందిన మొదటి మహిళా వేలం నిర్వాహకురాలిగా ఆమె గుర్తింపు పొందారు. తాజాగా WPL వేలంలోనూ తనదైన పనితీరుతో అందరినీ ఆకట్టుకున్నారు.

Also Read: WPL 2023లో ఆరుగురు తెలుగు అమ్మాయిలు.. ఏ జట్టుకు.. ఎంత ధరను పొందారంటే?

తన కుటుంబంలోని మూడో తరం క్రికెట్ ప్రేమికురాలైన మల్లికా సాగర్… T20 లీగ్‌ వేలం గురించి తెలుసుకునేందుకు గతంలో జరిగిన వేలం వీడియోలను చూశారట. అందుకే WPL వేలంలో ఆమె అద్భుతంగా పనిచేయగలిగారని మల్లిక గురించి తెలిసిన వారు అంటున్నారు. WPL వేలం నిర్వాహకురాలిగా తనకు అవకాశం దక్కడం గౌరవంగా భావిస్తున్నానని మల్లికా సాగర్ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. ‘భారతీయ మహిళలు అంతర్జాతీయ వేదికపై ఎట్టకేలకు తమ సత్తా చాటుకుంటున్నారు. అత్యున్నత స్థాయిలో ఆడగల సామర్థ్యం వారిలో ఉంద’ని ఆమె వ్యాఖ్యానించారు.