Power Cuts : పండగపూట అంధకారంలోకి భారతదేశం ?

దేశ వ్యాప్తంగా దసరా పండగ జరుపుకుంటున్న వేళ కరెంట్ కోతలు ఆందోళన కలిగిస్తున్నాయి. దేశంలోని ధర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు నిల్వలు తగ్గిపోయాయి.

Power Cuts : పండగపూట అంధకారంలోకి భారతదేశం ?

Coal Crisis

Power Cuts  : దేశ వ్యాప్తంగా దసరా పండగ జరుపుకుంటున్న వేళ కరెంట్ కోతలు ఆందోళన కలిగిస్తున్నాయి. దేశంలోని ధర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు నిల్వలు తగ్గిపోయాయి. బొగ్గు సంక్షోభం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అన్ని థర్మల్‌ విద్యుత్తు కేంద్రాల్లో బొగ్గు నిల్వలు నిండుకొన్నాయి. దేశంలో ఉన్న 135 థర్మల్‌ విద్యుత్తు కేంద్రాల్లో నాలుగు రోజులకు సరిపడ బొగ్గు నిల్వలు కూడా లేవు. దీంతో విద్యుదుత్పత్తిని తగ్గించక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఉత్పత్తి  తగ్గితే పండుగ వేళ ప్రజలు విద్యుత్ కోతలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. దేశం అంధకారంలోకి వెళ్లే అవకాశం ఉంది.

ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే కోతలు ప్రారంభం అయ్యాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌.. ప్రధాన మంత్రి మోదీకి లేఖ రాశారు. బొగ్గు కొరతను అధిగమించడానికి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇతర అవసరాలకు వినియోగిస్తున్న బొగ్గును విద్యుదుత్పత్తి ప్లాంట్లకు తరలించాలని  ప్రధానికి రాసిన లేఖలో కేజ్రీవాల్  విజ్ఞప్తి చేశారు. మరోవైపు, ఏపీకి 20 బొగ్గు ర్యాకులను కేటాయించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి కేంద్రాన్ని కోరారు. కాగా…..బొగ్గు కొరతను అధిగమించలేక పోతే విద్యుదుత్పత్తి నిలిపివేయక తప్పదని ధర్మల్  కేంద్రాలు కేంద్రాన్ని హెచ్చరిస్తున్నాయి.

Also Read : Dasara Festivities : శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తున్న కనకదుర్గమ్మవారు

దేశంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్ ఎక్కువ శాతం థర్మల్ విద్యుత్ కేంద్రాలద్వారానే అవుతోంది.అవి బొగ్గుమీదే ఆధారపడి ఉన్నాయి. దేశంలో 135 థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలు ఉన్నా యి. వీటి ఉత్పత్తి సామర్థ్యం రోజుకు 165 గిగావాట్లు. దేశానికి అవసరమైన 70శాతం విద్యుత్‌ వీటి నుంచే వస్తున్నది. ఈ కేంద్రాలకు రోజుకు సగటున 18 లక్షల టన్నుల బొగ్గు అవసరం. ప్రస్తుతం అన్ని కేంద్రాల్లో కలిపి 72 లక్షల టన్నులు మాత్రమే ఉందని లెక్కలు చెపుతున్నాయి. కనీసం ఒక్క ప్లాంటులో కూడా వారానికి సరిపడా బొగ్గు లేదు. సగం ప్లాంట్లలో కేవలం రెండు రోజులకు సరిపడా బొగ్గు మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 17 ప్లాంట్లలో అసలు బొగ్గు నిల్వలే లేవు. వాటిలో విద్యుదుత్పత్తి ఆగిపోయింది.

ఢిల్లీ డిస్కమ్‌లకు విద్యుత్‌ సరఫరా చేసే పవర్‌ ప్లాంట్లలో కేవలం రెండు రోజులకు సరిపడా బొగ్గు మాత్రమే ఉంది. ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, విద్యుత్‌ వినియోగాన్ని తగ్గించాలని ఢిల్లీ ప్రభుత్వం ప్రజలను కోరడం గమనార్హం. పంజాబ్‌, ఒడిశాలో కూడా బొగ్గు సంక్షోభం తీవ్రంగా మారింది. పంజాబ్‌లో కేవలం 5 రోజులకు సరిపోయే నిల్వలే ఉన్నాయి.

దేశంలో బొగ్గు సంక్షోభానికి ప్రధాన కారణం వర్షాలు, అంతర్జాతీయంగా బొగ్గు ధర పెరగడమేనని అధికారులు చెప్తున్నారు. దేశంలో నైరుతి రుతుపవనాల కారణంగా పలు రాష్ర్టాల్లో భారీ వర్షాలు కురిసి బొగ్గు గనుల్లోకి వరద నీరు చేరింది. దీంతో ఉత్పత్తికి ఆటంకం కలిగింది. మరోవైపు అంతర్జాతీయంగా బొగ్గుకు భారీ డిమాండ్‌ ఉంది. ధరలు పెరిగాయి. దీంతో బొగ్గును విదేశాల నుంచి దిగుమతి చేసుకోలేని పరిస్థితి ఏర్పడిందని కేంద్ర ప్రభుత్వాధికారులు చెప్తున్నారు.