ఏలూరులో అంతుపట్టని వ్యాధి… బాధితుల్లో ఎవరికీ ప్రాణాపాయం లేదన్న మంత్రి ఆళ్లనాని

  • Published By: bheemraj ,Published On : December 6, 2020 / 01:12 PM IST
ఏలూరులో అంతుపట్టని వ్యాధి… బాధితుల్లో ఎవరికీ ప్రాణాపాయం లేదన్న మంత్రి ఆళ్లనాని

minister All anani visit mysterious illness Victims : ఏలూరులో అంతుపట్టని వ్యాధితో ప్రభుత్వ ఆస్పత్రిలో చేరిన వారిని మంత్రి ఆళ్లనాని పరామర్శించారు. అనంతరం తాజా పరిస్థితిపై అధికారులతో మంత్రి సమీక్షించారు. ఆస్పత్రిలో చేరిన వారికి అందుతున్న చికిత్స, కోలుకుంటున్న విధానం అడిగి తెలుసుకున్నారు. పరిస్థితి అదుపులోనే ఉందని అధికారులు మంత్రికి తెలిపారు. అటు కేసులు పెరిగిపోవడంపై వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధితులకు ఫిట్స్, నురగ, స్పృహ తప్పడం లాంటి లక్షణాలున్నాయని తెలిపారు.



ఏలూరులో ఇప్పటిదాకా 227 కేసులు వచ్చాయన్నారు. బాధితుల్లో 70 మంది డిశ్చార్జ్ అయ్యారని చెప్పారు. బాధితుల్లో చిన్నారులు 46 మంది, మహిళలు 76 మంది ఉన్నారని తెలిపారు. ఐదుగురికి ఫిట్స్ ఎక్కువగా రావడంతో విజయవాడ తరలించామని పేర్కొన్నారు.

ఇప్పటికే రాష్ట్ర స్థాయి వైద్యులు, నిపుణులు ఏలూరుకు వచ్చారని చెప్పారు. బాధితులకు మెరుగైన వైద్య అందించాలని సీఎం ఆదేశించారని తెలిపారు. ఏలూరులో ట్రీట్ మెంట్ తీసుకుంటున్న వారంతా రికవరీ అవుతున్నారని తెలిపారు. ఇతర ఆరోగ్య సమస్యలున్న వారే ఇబ్బంది పడుతున్నారని వివరించారు.



బాధితులు తాగిన నీటిలో ఎలాంటి కాలుష్యం లేదని తేలిందని మంత్రి చెప్పారు. ఏలూరు, విజయవాడ ల్యాబ్ లలో నీటిని పరీక్షించామని తెలిపారు. మరికొన్ని రిపోర్టులు వచ్చాకే అసలు కారణమేంటో తెలుస్తుందన్నారు. ఈ పరిస్థితికి వైరస్ కారణమా అనే కోణంలోనూ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సాయంత్రంలోగా ఫలితాలు వస్తాయని తెలిపారు. బాధితుల్లో ఎవరికీ ప్రాణాపాయం లేదని స్పష్టం చేశారు.



అంతుచిక్కని వ్యాధితో ఏలూరు ప్రభుత్వాసుపత్రికి వస్తున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. చిన్నా, పెద్దా, ఆడా, మగా అన్న తేడా లేకుండా…. అందరూ రోగం బారిన పడుతున్నారు. చిన్నారులు, మధ్యవయసు వాళ్లు, వృద్ధులు..ఇలా ఆస్పత్రిలో చేరిన వారి సంఖ్యలో అన్ని వయసుల వారూ ఉన్నారు. ఇప్పటిదాకా 180 మంది ఆస్పత్రిలో చేరారు. వారిలో కొంతమంది పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో… మెరుగైన చికిత్స కోసం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.