MLA Garbage : కమిషనర్‌ ఇంటి ముందు చెత్త వేసిన ఎమ్మెల్యే..ఎందుకో తెలుసా?

తాను ఆదేశాలు ఇస్తున్నా మున్సిపల్‌ అధికారులు పట్టించుకోకపోవడంతో ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఓ ట్రాక్టర్‌ చెత్త తీసుకుని వెళ్లి మున్సిపల్‌ కమిషనర్‌ ఇంటి ముందు వేశాడు.

MLA Garbage : కమిషనర్‌ ఇంటి ముందు చెత్త వేసిన ఎమ్మెల్యే..ఎందుకో తెలుసా?

Mla Throwing Garbage

MLA garbage : ఆయన ఓ నియోజకవర్గానికి ఎమ్మెల్యే. తాను నివసించే పట్టణం పరిశుభ్రంగా ఉండేవిధంగా చూసుకునే బాధ్యత ఆయనకు ఉంది. అయితే తాను ఆదేశాలు ఇస్తున్నా మున్సిపల్‌ అధికారులు పట్టించుకోకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశాడు. పట్టణంలో ఎక్కడ చూసినా చెత్త ఉండటంతో ఆయనకు మండింది. దీంతో వెంటనే ఓ ట్రాక్టర్‌ చెత్త తీసుకుని వెళ్లి మున్సిపల్‌ కమిషనర్‌ ఇంటి ముందు వేశాడు. ఈ సంఘటన స్థానికంగా హాట్‌ టాపిక్‌గా మారింది.

కర్ణాటకలోని బెళగావి పట్టణంలో పరిసరాలు అపరిశుభ్రంగా మారాయి. ఎక్కడ చూసినా చెత్తాచెదారంతో వీధులు దర్శనమిస్తున్నాయి. వీటిని చూసిన బెళగావి జిల్లా దక్షిణ బెళగావి ఎమ్మెల్యే అభయ్‌ పాటిల్‌ ఎమ్మెల్యేకు తీవ్ర ఆగ్రహం వచ్చింది. బెళగావి పట్టణ మున్సిపల్‌ (బీసీసీ) అధికారులకు బుద్ధి చెప్పేందుకు ఓ ట్రాక్టర్‌ తీసుకుని అందులో చెత్త వేసుకుని ఆయనే స్వయంగా నడుపుతూ విశ్వేశ్వరనగరలోని మున్సిపల్‌ కమిషనర్‌ కేహెచ్‌ జగదీశ్‌ ఇంటికి వెళ్లాడు. చెత్తనంతా కమిషనర్ ఇంటిముందు కుమ్మరించాడు.

వాస్తవ పరిస్థితులు ఏమిటో కమిషనర్‌కు చెప్పేందుకే తాను ఈ నిరసన చేపట్టినట్లు ఎమ్మెల్యే అభయ్‌ పాటిల్‌ తెలిపారు. ఇదే పరిస్థితి కొనసాగితే డిప్యూటీ కమిషనర్‌ ఇంటి ముందు కూడా ఇలాగే చేస్తానని హెచ్చరించాడు. ఇప్పటికైనా అధికారులు మారుతారో లేదో చూడాలి మరి.