UP Results : మోదీ-యోగీ మ్యాజిక్ రిపీట్..? యూపీలో బీజేపీ గెలిస్తే మరో చరిత్రే!

ఉత్తర్‌ప్రదేశ్‌లో కమలం పార్టీ మరో రికార్డ్ కొట్టే అవకాశముంది. యూపీలో వరుసగా రెండోసారి బీజేపీ అధికారం చేజిక్కించుకుంటే 35 ఏళ్ల తర్వాత ఆ ఘనత సాధించిన పార్టీగా నిలుస్తుంది.

UP Results : మోదీ-యోగీ మ్యాజిక్ రిపీట్..? యూపీలో బీజేపీ గెలిస్తే మరో చరిత్రే!

Modi Yogi

UP Results  – 5 States Election Result :  ఏ బిడ్డా.. ఇది నా అడ్డా.. ఇప్పుడు ఈ డైలాగే యూపీలో మారుమోగుతోంది. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో వార్ వన్‌సైడ్ అయినట్లు ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్‌లో తేలిపోయింది. మరికొన్ని గంటల్లో అది నిజంగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఉత్తర్ ప్రదేశ్‌పైనే అందరి కన్ను పడింది. ఎగ్జిట్ పోల్స్‌లో అనుకూల ఫలితాలు వచ్చిన పార్టీల అభ్యర్థులు ప్రశాంతంగా ఉంటే.. ప్రతికూల ఫలితాలు వచ్చిన పార్టీల్లో కంగారు మొదలైంది.

Read This : Election Results : యూపీలో బీపీ.. గెలుపెవరిది..?

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎవరు గెలుస్తారోనని అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో యోగి ప్రభుత్వానికేం ఢోకా లేదని తేలింది. యూపీలో మొత్తం 403 అసెంబ్లీ స్థానాలుండగా.. మ్యాజిక్ ఫిగర్ 202. దాదాపు ఐదారు సంస్థలు రిలీజ్ చేసిన ఎగ్జిట్ పోల్స్‌లో.. ప్రతి దాంట్లో బీజేపీకి స్పష్టమైన మెజార్టీ వస్తుందని వెల్లడైంది. దీంతో యూపీలో మళ్లీ బీజేపీ సర్కార్‌ వస్తుందని ఊహాగానాలు అందుకున్నాయి. మరి ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమవుతాయా ? బీజేపీ మళ్లీ అధికారం చేపడుతుందా? లేదంటే కమల దళానికి సమాజ్‌వాదీ పార్టీ షాకిస్తుందా? అనేది మరికొన్ని గంటల్లోనే తేలనుంది.

ఉత్తర్ ప్రదేశ్‌లోని 403 స్థానాలకు ఏడు దశల్లో పోలింగ్ నిర్వహించారు. బీజేపీ ప్రచారం చేసిన మోదీ – యోగీ డబుల్ ఇంజిన్ ప్రచారం బాగా పని చేసినట్లుగానే కనిపిస్తోంది. ధీమాగా కనిపించిన ఎస్పీ ప్రతిపక్ష పాత్రకు పరిమితం అవుతుందని సర్వేలు చెబుతున్నాయి.

Read This : Election Results : ఎగ్జిట్ పోల్ అంచనాలు నిజమవుతాయా..?

– ఇండియాటుడే సర్వే ప్రకారం బీజేపీకి 288 నుంచి 326 సీట్లు వస్తాయి. ఎస్పీ 71 నుంచి 101 మధ్య ఆగిపోతుంది. బీఎస్పీకి 3 నుంచి 9, కాంగ్రెస్‌కు 1 నుంచి 3 సీట్లు వస్తాయి.

– ABP సీ ఓటర్‌ అయితే బీజేపీకి 228 నుంచి 244 సీట్ల వరకు రావొచ్చని అంచనా వేస్తోంది. ఇక ఎస్పీకి 132 నుంచి 148 సీట్లు వస్తాయి. బీఎస్పీకి 13 నుంచి 21, కాంగ్రెస్‌కు 4 నుంచి 8 స్థానాలు రావొచ్చు.

– జన్‌కీ బాత్‌ అయితే బీజేపీ 222 నుంచి 260 స్థానాల్లో గెలుస్తుందని చెబుతోంది. ఎస్పీ 135నుంచి 165 స్థానాలతో సరిపెట్టుకుంటుంది. బీఎస్పీకి 4 నుంచి 9, కాంగ్రెస్‌కు 1 నుంచి 3 సీట్లు మాత్రమే వస్తాయి.

– రిపబ్లిక్‌- పీమార్క్ సర్వే ప్రకారం బీజేపీ 240చోట్ల విజయం సాధిస్తుంది. సమాజ్‌వాదీ పార్టీ 140 చోట్ల నెగ్గుతుంది. ఇక బీఎస్పీ 17, కాంగ్రెస్ 4 స్థానాలు గెలుచుకుంటాయి.

– ఇక టైమ్స్‌నౌ ప్రకారం బీజేపీ 225 స్థానాలు గెలుచుకుంటుంది. ఎస్పీకి 151, బీఎస్పీకి 14 సీట్లు రావొచ్చు. కాంగ్రెస్‌కి 9 సీట్లు రావొచ్చంటోంది.
దాదాపు అన్ని సర్వేలు దేశంలోనే అతి పెద్దదైన యూపీలో గెలుపు బీజేపీదే అని తేల్చడం ఆ పార్టీకి ఊరటనిచ్చింది.

2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూసుకుంటే.. అప్పుడు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయలేకపోయాయి. ఎస్పీ, కాంగ్రెస్ కూటమి, బీఎస్పీ మధ్యే త్రికోణ పోటీ ఉంటుందని చాలా మంది ఊహించారు. తుది ఫలితాల్లో మాత్రం మొత్తం 403 స్థానాలకు గానూ బీజేపీ 312 చోట్ల విజయం సాధించి అధికారాన్ని అలవోకగా లాగేసుకుంది. ప్రధాన ప్రతిపక్షమైన సమాజ్‌వాదీ పార్టీ 47 స్థానాలతో సరిపెట్టుకుంది. ఇక బీఎస్పీ 19 చోట్ల, కాంగ్రెస్ 7 చోట్ల పాగా వేయగా.. ఇతరులు 18 స్థానాల్లో గెలుపొందారు. గత ఎన్నికల్లో బీజేపీ 39.67 శాతం ఓట్లు సాధించగా.. బీఎస్పీ 22.23 శాతం, ఎస్పీ 21.82 శాతం ఓట్లు రాబట్టాయి. హస్తం పార్టీ ఓట్ షేరింగ్ మాత్రం 6.28 శాతం ఉంది.

యూపీలో అధికార బీజేపీ వరుసగా రెండోసారి అధికారం నిలబెట్టుకోవాలనే వ్యూహంతో ముందుకు వెళ్లగా.. ప్రధాన ప్రతిపక్షం ఎస్పీ ఐదేళ్ల తర్వాత తిరిగి పీఠాన్ని దక్కించుకోవాలనే కృతనిశ్చయంతో బరిలో నిలిచింది. అటు బీఎస్పీ సైతం దళిత ఓటు బ్యాంకుపై భారీ ఆశలు పెట్టుకుంది. ఇక, యూపీలో ప్రభావం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ.. తన ఉనికి కోసం ప్రయత్నించింది.

ఉత్తర్‌ప్రదేశ్‌లో కమలం పార్టీ మరో రికార్డ్ కొట్టే అవకాశముంది. యూపీలో వరుసగా రెండోసారి బీజేపీ అధికారం చేజిక్కించుకుంటే 35 ఏళ్ల తర్వాత ఆ ఘనత సాధించిన పార్టీగా నిలుస్తుంది. 1985 తర్వాత వరుసగా రెండోసారి ఏ పార్టీ అక్కడ అధికారంలోకి రాలేదు. ఈ సంప్రదాయాన్ని బీజేపీ తిరగరాస్తుందా? లేదా? అనేది ఇవాళ తేలిపోనుంది.