Aryan Khan : ఆర్యన్ ఖాన్ కు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు లేవ్..బాంబే హైకోర్టు

క్రూయిజ్ షిప్ డ్రగ్ కేసులో బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ మంజూరు చేస్తూ అక్టోబర్-28న బాంబే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును ఇవాళ(నవంబర్-20,2021)బాంబే

Aryan Khan :  ఆర్యన్ ఖాన్ కు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు లేవ్..బాంబే హైకోర్టు

Aryan (1)

Aryan Khan :  క్రూయిజ్ షిప్ డ్రగ్ కేసులో బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ మంజూరు చేస్తూ అక్టోబర్-28న బాంబే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును ఇవాళ(నవంబర్-20,2021)బాంబే హైకోర్టు విడుదల చేసింది. 14 పేజీల ఉత్తర్వులో…ఆర్యన్ ఖాన్‌తో పాటు మరో ఇద్దరు సహ నిందితులు అర్బాజ్ మర్చంట్ మరియు మున్మున్ ధమేచాపై నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్ (NDPS Act) కింద నేరానికి పాల్పడ్డారనడానికి సంబంధించి ఎలాంటి ప్రాథమిక సాక్ష్యం లేదని జస్టిస్ నితిన్ సాంబ్రే పేర్కొన్నారు.

వారి(ఆర్యన్ ఖాన్,అర్బాజ్ మర్చంట్, మున్మున్ ధమేచా) మధ్య జరిగిన వాట్సాప్ సంభాషణల్లో కూడా అభ్యంతరకరంగా ఏమీ కనిపించలేదని కోర్టు పేర్కొంది. నిందితులందరూ ఉమ్మడి ఉద్దేశ్యంతో చట్టవిరుద్ధమైన చర్యకు అంగీకరించారని ఈ కోర్టును ఒప్పించేందుకు ఎటువంటి సానుకూల ఆధారాలు రికార్డులో లేవు అని ఉత్తర్వుల్లో పేర్కొంది. నిందితులు క్రూయిజ్‌లో ప్రయాణించడమే.. నిందితులపై సెక్షన్ 29 నేరాన్ని ప్రయోగించడానికి కారణం కాకూడదని కోర్టు పేర్కొంది. దరఖాస్తుదారులపై కుట్ర కేసును రుజువు చేయడానికి సాక్ష్యాధారాల రూపంలో ప్రాథమిక అంశాలు ఉండాలనే వాస్తవాన్ని ఈ కోర్టు సున్నితంగా తెలుసుకోవాల్సిన అవసరముందని న్యాయమూర్తి ఆ తీర్పులో పేర్కొన్నారు.

అసలేంటీ కేసు
అక్టోబర్-2న ముంబైలో కోర్డేలియా క్రూయీజ్ ఎంప్రెస్ షిప్‌లో జరిగిన రేవ్ పార్టీలో భారీ ఎత్తున డ్రగ్స్ రాకెట్ బయటపడింది. ఈ రేవ్‌ పార్టీలో పెద్ద ఎత్తున డ్రగ్స్ చెలామణి అవుతుందని విశ్వసనీయ సమాచారం రావడంతో నార్కోటిక్స్ కంట్రోల్‌ బ్యూరో (NCB) అధికారులు అక్టోబర్-2 అర్ధరాత్రి దాడులు జరిపి అధిక మొత్తంలో కొకైన్‌ సహా ఇతర మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అందులోనే ఉన్న యువతీ యువకులను అదుపులోకి తీసుకున్నారు.

ఎన్సీబీ టీమ్ అదుపులోకి తీసుకున్న వారిలో బాలీవుడ్‌ హీరో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కూడా ఉన్నాడు. విచారణలో ఉన్న ఆర్యన్‌ ఖాన్‌కు త్వరగానే బెయిల్ లభిస్తుందని అంతా భావించారు. కానీ ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్‌ను పలుమార్లు కోర్టు కొట్టివేసింది.

అయితే ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ తీసుకున్నట్లు ఆధారాలు కనుగొనబడనప్పటికీ.. అతని వాట్సాప్ చాట్‌లు “అక్రమ మాదకద్రవ్యాల ఒప్పందాలు” మరియు విదేశీ డ్రగ్స్ వ్యాపార ముఠాతో సంబంధాలు కలిగి ఉన్నట్లు రుజువు చేసినట్లు NCB కోర్టులో పేర్కొంది. నిందితుల్లో ఒకరు ఆర్యన్ ఖాన్‌కు డ్రగ్స్ సరఫరా చేశాడని నిర్ధారించడానికి వాట్సాప్ చాట్‌లు సరిపోవని హైకోర్టు ఆ తర్వాత పేర్కొంది. ఎట్టకేలకు బాంబే హైకోర్టు ఆర్యన్‌ ఖాన్ కు అక్టోబర్-28న బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.

ALSO READ Floods : రాయల చెరువు తెగిపోతుందా ? ఖాళీ చేయాలని చాటింపులు