PM Modi Security : మోదీ కాన్వాయ్ భద్రతా వైఫల్యం..సుప్రీం విచారణ..తీర్పుపై ఉత్కంఠ

ప్రధాని భద్రతా లోపాలపై దర్యాప్తు చేపట్టాలని కోరుతూ సీనియర్‌ న్యాయవాది మనిందర్‌ సింగ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ అంశంపై విచారణ జరుపుతామన్నారు సీజేఐ ఎన్వీ రమణ...

PM Modi Security : మోదీ కాన్వాయ్ భద్రతా వైఫల్యం..సుప్రీం విచారణ..తీర్పుపై ఉత్కంఠ

Supreme Court To Hear Petition On Pm Narendra Modi Security Breach In Punjab

Updated On : January 7, 2022 / 9:12 AM IST

PM Modi Security Supreme Court : పంజాబ్‌లో ప్రధాని మోదీ కాన్వాయ్‌ నిలిచిపోవడం దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది.. ఇప్పటికే పొలిటికల్‌ వార్‌గా మారిన ఈ టాపిక్‌.. సుప్రీంకోర్టుకు చేరింది. ప్రధాని భద్రతా లోపాలపై దర్యాప్తు చేపట్టాలని కోరుతూ సీనియర్‌ న్యాయవాది మనిందర్‌ సింగ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ అంశంపై విచారణ జరుపుతామన్నారు సీజేఐ ఎన్వీ రమణ. పంజాబ్ ప్రభుత్వం, కేంద్రం దీనిపై వివరాలు సమర్పించాలని ఆదేశించారు. 2022, జనవరి 07వ తేదీ శుక్రవారం ఈ అంశంపై విచారణ జరపనుంది అత్యున్నత న్యాయస్థానం. దీంతో సుప్రీంకోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుందన్నదానిపై ఉత్కంఠ నెలకొంది.

Read More : Kothagudem : అజ్ఞాతంలో వనమా రాఘవేంద్ర…ఆచూకీ కోసం 8 బృందాలు

అటు కాన్వాయ్‌ ఘటనపై ప్రధాని మోదీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలిశారు. పంజాబ్‌లో ఎదురైన పరిస్థితులను వివరించారు. అంతకు ముందు.. ప్రధాని సెక్యూరిటీ లోపాలపై రాష్ట్రపతి ఆందోళన వ్యక్తంచేశారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సైతం ఈ ఘటనపై స్పందించారు. ప్రధాని పర్యటనలో ఇలా జరగడం దురదృష్టకరమన్నారు. మరోవైపు ప్రధాని మోదీ భద్రతా ఏర్పాట్లలో జరిగిన తీవ్ర లోపాలపై త్రిసభ్య కమిటీ దర్యాప్తు చేస్తుందని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. వీవీఐపీ తీవ్ర భద్రతా ప్రమాదానికి గురికావడానికి దారితీసిన లోపాలను పరిశీలించే ఈ కమిటీకి క్యాబినెట్ సెక్రటరీ సుధీర్ కుమార్ సక్సేనా నేతృత్వం వహిస్తారని ప్రకటించింది. ఇంటెలిజెన్స్ బ్యూరో జాయింట్ డైరెక్టర్ బల్బీర్ సింగ్, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఐజీ సురేశ్‌ మరో ఇద్దరు సభ్యులని పేర్కొంది. నివేదికను వీలైనంత త్వరగా సమర్పించాలని కమిటీకి సూచించినట్లు వెల్లడించింది. ఇటు పంజాబ్‌ కూడా ఇప్పటికే ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటుచేసింది.

Read More : Corona Medicine: విరివిగా మార్కెట్లో అందుబాటులో కరోనా మెడిసిన్ “మోల్నుపిరవిర్”

మరోవైపు కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రధాని పర్యటనలో భద్రత లోపంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సీఎం చన్నీకి ఫోన్‌ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇటు చన్నీతో పాటు ఇతర కాంగ్రెస్‌ నేతలు బీజేపీపై విమర్శలు గుప్పిస్తున్నారు. నిరసన తెలపడం ప్రజాస్వామ్య హక్కన్నారు సీఎం చరణ్‌జిత్‌ సింగ్‌. గురువారం ఆయనను కొందరు నిరసనకారులు అడ్డుకోగా వారితో మాట్లాడారు. వారి సమస్యలను పరిష్కరిస్తానని భేటీ అవుదామని పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ కాన్వాయ్‌కు ఒక కిలోమీటర్‌ దూరంలో నిరసనకారులు ఉన్నారని తెలిపారు సీఎం చన్నీ. వారితో ఆయన ప్రాణాలకు ఎలాంటి ముప్పు జరగలేదని మరోసారి స్పష్టం చేశారు.