Ponguleti Srinivasa Reddy: శీనన్న ఒక్కడు కాదు.. బెదిరిస్తే వడ్డీతో సహా చెల్లిస్తాం

Ponguleti Srinivasa Reddy: తన వెంట ఉన్నవారిని రెవెన్యూ అధికారులు, పోలీసులు బెదిరిస్తున్నారని.. దానికి ప్రతిఫలం వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు.

Ponguleti Srinivasa Reddy: శీనన్న ఒక్కడు కాదు.. బెదిరిస్తే వడ్డీతో సహా చెల్లిస్తాం

Ponguleti Srinivasa Reddy:  హడావుడిగా ఏదో పార్టీలో చేరే ఉద్దేశం తనకు లేదని ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో సోమవారం తన మద్దతుదారులతో ఆయన ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. తనను నమ్ముకున్న ప్రజలు, మేధావుల అభిప్రాయం మేరకే పార్టీ మారతానని చెప్పారు. తన మద్దతుదారుల అభీష్టం మేరకే తన నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు. తన వెంట ఉన్నవారిని రెవెన్యూ అధికారులు, పోలీసులు బెదిరిస్తున్నారని.. దానికి ప్రతిఫలం వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు. అధికారం ఎవరి అబ్బ సొత్తు కాదని అన్నారు.

పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని సవాల్
వైరా నియోజకవర్గానికి చెందిన తన అనుచరులను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడంపై శ్రీనివాసరెడ్డి స్పందించారు. దమ్ముంటే తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని సవాల్ విసిరారు. తనకు పార్టీ సభ్యత్వం ఉందా అని బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నిస్తున్నారని.. సభ్యత్వం లేకుంటే మొన్నటివరకు జిల్లా, రాష్ట్ర పార్టీ కార్యక్రమాలకు తనను ఎలా ఆహ్వానించారని నిలదీశారు. తన ఫొటోలతో బీఆర్ఎస్ నాయకులు ఫ్లెక్సీలు కూడా వేశారని గుర్తు చేశారు. కాకుల్లా, గద్దలా శీనన్నను కాల్చుకుని తినాలనికుంటే.. శీనన్న ఒక్కడు కాదు సమయం వచ్చినప్పుడు ప్రజలు తప్పకుండా బుద్ధి చెబుతారని వార్నింగ్ ఇచ్చారు.

అశ్వారావుపేటలో ఒక్కరికైనా ఇల్లు ఇచ్చారా?
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వస్తే మన బతుకులు బాగుపడతాయని అనుకున్నామని.. తొమ్మిదేళ్లుగా రాష్ట్రం ఏమేరకు అభివృద్ధి చెందిందో మనమంతా చూశామన్నారు. అశ్వారావుపేటలో ఒక్కరికైనా ఇల్లు ఇచ్చారా అని ప్రశ్నించారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వకపోవడంతో గిరిజనులు, గిరిజనేతరుల గోస పడుతున్నారని ఆవేదన చెందారు. ప్రతి గ్రామ పంచాయతీలోనూ లక్షలాది రూపాయల బిల్లులు పెండింగ్‌ లో పెట్టడంతో సర్పంచ్ లు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సామాన్యులను కష్టాలకు గురిచేస్తూ బడా కాంట్రాక్టర్లకు దోచిపెడుతున్నారని పొంగులేటి ఘాటుగా విమర్శించారు.

Also Read: TRS MLAs Trap Case: పార్టీలు మారిన ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరిపైనా సీబీఐ విచారణ జరిపించాలి