Ram Gopal Varma: కొందరికి రాముడు.. మరికొందరికి రావణుడు!

సినిమాలతో సాహసం.. వివాదాలతో సావాసం చేస్తూ.. కొటేషన్లతో తన ఆలోచనలను కొట్టేచ్చేలా చూపించే ఏకైక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.....

Ram Gopal Varma: కొందరికి రాముడు.. మరికొందరికి రావణుడు!

Ram Gopal Varma Birthday Special

Ram Gopal Varma: సినిమాలతో సాహసం.. వివాదాలతో సావాసం చేస్తూ.. కొటేషన్లతో తన ఆలోచనలను కొట్టేచ్చేలా చూపించే ఏకైక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. అప్పటివరకు నెమ్మదిగా సాగుతున్న తెలుగు సినిమా రంగానికి ఒక్కసారిగా వేగం అంటే ఏమిటో చూపించిన కల్ట్ క్లాసిక్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. ‘శివ’ అనే సినిమాను తెరకెక్కించి, ఒక సినిమాను ఇలా కూడా తీస్తారా అని అందరితో అనిపించుకోవడమే కాకుండా.. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించాడు ఈ డైరెక్టర్. తెలుగు సినిమాలో రొటీన్ కథలకు పూర్తి భిన్నంగా పాత్ బ్రేకింగ్ సినిమాలను తెరకెక్కించిన ఘనత వర్మ సొంతం. అయితే సినిమాలతో ఎంత మంచి తెచ్చుకున్నాడో, వివాదాలతో అంతకంటే ఎక్కువ చెడునే మూటగట్టుకున్నాడు ఈ డైరెక్టర్. అయినా కూడా వర్మ సినిమా వస్తుందంటే కొంతమంది ఆయన సినిమాలకోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అదే వర్మ మ్యాజిక్ అని చెప్పాలి.

RGV : చాలా చిన్నది అంటూ.. రాడిసన్ పబ్ ఘటనపై ఆర్జీవీ కామెంట్స్

శివ సినిమాతో మాస్ అనే పదాన్ని కేవలం టాలీవుడ్‌లోనే కాకుండా బాలీవుడ్‌కు కూడా పరిచయం చేశాడు వర్మ. ఇక ఆ సినిమా ఇచ్చిన సక్సెస్‌తో వర్మ వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుసగా విభిన్న జోనర్ల చిత్రాలను తెరకెక్కిస్తూ తన ప్రతిభను చాటుకున్నాడు ఈ డైరెక్టర్. బాలీవుడ్‌లోనూ వర్మకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. సత్య, రంగీలా, సర్కార్ వంటి సినిమాలు ఆయన్ను బాలీవుడ్‌లో టాప్ డైరెక్టర్‌గా చేశాయి. వర్మతో ఒక్క సినిమానైనా చేయాలని అప్పట్లో ప్రతిఒక్కరూ అనుకున్నారు. ఇక వర్మ దగ్గర శిష్యరికం చేసిన వారిలో చాలా మంది ప్రస్తుతం టాప్ పొజిషన్‌లో ఉన్నారు. వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన వారు దర్శకుడు పూరీ జగన్నాధ్, డైరెక్టర్ తేజల గురించి. వారిద్దరు కూడా వర్మ దగ్గరే అసిస్టెంట్ డైరెక్టర్లుగా పనిచేసి, తమ ప్రతిభతో టాలీవుడ్‌లో ఫేమస్ అయ్యారు.

కానీ తనకు వచ్చిన సక్సెస్‌ను ఎక్కువకాలం నిలబెట్టుకోలేకపోయాడు ఈ డైరెక్టర్. అందరిలా కాకుండా తనకు ఏది అనిపిస్తే అది చెబుతూ.. తనకు నచ్చిందే చూపిస్తూ సినిమాలు తీస్తూ వచ్చాడు. దీంతో వరుస ఫెయిల్యూర్స్ అతడిని వెంటాడాయి. ఓ క్రమంలో రామ్ గోపాల్ వర్మ సినిమా అంటే.. బాబోయ్ అనే స్థాయికి ఆయన సినిమాలు చేరుకున్నాయి. కానీ వర్మలోని ట్యాలెంట్ మళ్లీ అతడిని ఇండస్ట్రీలో నిలదొక్కుకునేలా చేసింది. జనాల దృష్టిని తనవైపు తిప్పుకునేందుకు బయోపిక్ చిత్రాలను తెరకెక్కించడం మొదలుపెట్టాడు వర్మ. ఈ క్రమంలోనే ‘రక్త చరిత్ర’ సినిమాతో మరోసారి తన సత్తా చాటుకున్నాడు వర్మ. బయోపిక్ చిత్రాల్లో వివాదాస్పద అంశాన్ని.. తనకు నచ్చిన విధంగా చూపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. నచ్చితే చూడండి.. లేదంటే లేదు అనే ధోరణిలో వర్మ వరసబెట్టి బయోపిక్ చిత్రాలను తెరకెక్కిస్తూ వచ్చాడు.

RGV : వివాదంలో ఆర్జీవీ ‘డేంజెరస్’ మూవీ.. సుప్రీంకోర్టుని అవమానిస్తున్నారన్న వర్మ

ఇటీవల కాలంలో ఓటీటీల్లో వర్మ ఎక్కువగా సినిమాలు రిలీజ్ చేస్తున్నాడు. తనకు నచ్చిన సినిమా చేస్తానంటూ కథతో సంబంధం లేకుండా, తనకు నచ్చిన అంశాన్ని చూపిస్తూ సినిమాలను తీస్తున్నాడు. తాజాగా ఆయన డైరెక్ట్ చేసిన ‘డేంజరస్’ అనే సినిమా రిలీజ్‌కు రెడీగా ఉంది. ఇద్దరు అమ్మాయిల మధ్య ప్రేమ అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా వస్తుండటంతో పలువురు ఈ సినిమాపై విమర్శలు చేస్తున్నారు. అయితే ఇలాంటివేవీ పట్టించుకోని వర్మ, తన సినిమాలోని అమ్మాయిలతో ప్రమోషన్స్‌లో పాల్గొంటూ బిజీగా ఉన్నాడు.

ఏప్రిల్ 7తో 60 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న వర్మ, ఆలోచనలో మాత్రం నిత్యయవ్వనుడిలా ముందుకు సాగుతున్నాడు. వైవిధ్యం, తెగింపు, తనకు నచ్చిందే చెప్పే – చూపించే నైజం.. ఇవన్నీ రామ్ గోపాల్ వర్మ సొంతం. అందుకే ఇండస్ట్రీలో చాలా మంది బతికితే వర్మలా బతకాలని కోరుకుంటారు. అలాంటి వ్యక్తిత్వం, ఫాలోయింగ్ ఉన్న వర్మకు బర్త్ డే విషెస్ చెబుదామా!