Revanth reddy: అప్పుడు మీరెక్కడున్నారు? కవిత, కేటీఆర్ ట్వీట్‌లకు కౌంటర్ ఇచ్చిన రేవంత్‌రెడ్డి..

తెలంగాణలో ఏఐసీసీ నేత, ఎంపీ రాహుల్ గాంధీ పర్యటిస్తున్న వేళ టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ట్విటర్ వార్ కొనసాగుతుంది. అప్పుడు మీరెక్కడున్నారు అని కవిత ట్విటర్‌లో రాహల్ గాంధీని ప్రశ్నిస్తే.. మరి మీరు అప్పుడు ఎక్కడున్నారంటూ..

Revanth reddy: అప్పుడు మీరెక్కడున్నారు? కవిత, కేటీఆర్ ట్వీట్‌లకు కౌంటర్ ఇచ్చిన రేవంత్‌రెడ్డి..

Revanth Reddy

Revanth reddy: తెలంగాణలో ఏఐసీసీ నేత, ఎంపీ రాహుల్ గాంధీ పర్యటిస్తున్న వేళ టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ట్విటర్ వార్ కొనసాగుతుంది. అప్పుడు మీరెక్కడున్నారు అని కవిత ట్విటర్‌లో రాహల్ గాంధీని ప్రశ్నిస్తే.. మరి మీరు అప్పుడు ఎక్కడున్నారంటూ కాంగ్రెస్ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. రాహుల్ తెలంగాణలో రెండు రోజులు పర్యటించనున్నారు. ఈ రోజు సాయంత్రం ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ తలపెట్టిన రైతు సంఘర్షణ బహిరంగ సభలో రాహల్ గాంధీ పాల్గొంటారు. రేపు పలు కార్యక్రమాల్లో పాల్గొని సాయంత్రానికి తిరుగు పయణమవుతారు. రాహుల్ గాంధీ తెలంగాణకు వస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత ట్వీటర్ వేదికగా ప్రశ్నలు గుప్పించారు. మీరు కానీ, మీ పార్టీ కానీ ఎన్ని సార్లు పార్లమెంట్‌లో తెలంగాణ అంశాలను, హక్కులను ప్రస్తావిచారో చెప్పాలని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర హక్కుల కోసం టీఆర్‌ఎస్ పార్టీ పోరాడుతుంటే మీరు ఎక్కడ ఉన్నారంటూ ప్రశ్నించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు విద్యా సంస్థలు ఇవ్వకుండా మొండి చేయి చూపిస్తున్నప్పుడు మీరు ఎక్కడున్నారు అంటూ కవిత ప్రశ్నించారు.

రాహుల్ పర్యటనపై మంత్రి కేటీఆర్ కూడా ట్వీట్ చేశారు. రాష్ట్రంలో పర్యటనకు వస్తున్న రాహుల్ గాంధీకి స్వాగతం పలుకుతున్నామని అన్నారు. రైతులకు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై స్టడీ చేయాలని కేటీఆర్ రాహుల్ సూచించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ పథకాలు అమలు చేయాలని కేటీఆర్ ట్విటర్ వేదికగా రాహుల్‌కు సూచించారు.

కవిత, కేటీఆర్ ట్వీట్లకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కవిత ట్వీట్‌కు స్పందించిన రేవంత్.. రాహుల్ గాంధీని ప్రశ్నించే ముందు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి.. మోదీ రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చినప్పుడు మీరు ఎక్కడున్నారు? మీ తండ్రి మోడీ ముందు మోకరిల్లి తెలంగాణ నుంచి ఇకపై బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని లేఖ ఇచ్చి రైతులకు ఉరితాళ్లు బిగించినప్పుడు మీరు ఎక్కడున్నారు? వరి వేస్తే ఉరే అని మీ తండ్రి ప్రవచనాలు చెప్పి ఆయన ఫాంహౌస్‌లో 150 ఎకరాల్లో వరి పంట సాగు చేసినప్పుడు మీరెక్కడ ఉన్నారు? ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో మిర్చి రైతులు పిట్టల్లా రాలిపోతుంటే మీరు ఎక్కడ ఉన్నారో ముందు సమాధానం చెప్పాలంటూ రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించారు.

మంత్రి కేటీఆర్ ట్వీట్‌కు స్పందించిన రేవంత్ రెడ్డి.. మీ పాలన పై ఏం అధ్యయనం చేయాలో చెప్పాలి అంటూ కేటీఆర్ ను ప్రశ్నించారు. రుణమాఫీ హామీ ఎలా ఎగగొట్టాలి? ఎరువుల ఫ్రీ హామీని ఎలా అటకెక్కించాలి? మోడీ ముందు మోకరిల్లి తెలంగాణ రైతులకు ఉరితాళ్లు ఎలా బిగించాలి? వరి, మిర్చి పత్తి రైతులు ఎలా చస్తున్నారు? ఇవే కదా నిజాలు. ఆ నిజాలు మరింత గట్టిగా చెప్పడానికే రాహుల్ వస్తున్నారంటూ కేటీఆర్ ట్వీట్‌కు రేవంత్ కౌంటర్ ఇచ్చారు.