Subrahmanya Sashti 2021 : పెళ్లి కాని వారు, సంతానం లేని వారు సుబ్రహ్మణ్య షష్టి పూజ చేస్తే ఫలితం ఉంటుంది

ప్రతి ఏటా మార్గశిర శుక్లపక్ష షష్టినాడు శ్రీ సుబ్రహ్మణ్య షష్టి పర్వదినాన్ని జరుపుకోవడం హిందువులు ఆచారం.

Subrahmanya Sashti 2021 : పెళ్లి కాని వారు, సంతానం లేని వారు సుబ్రహ్మణ్య షష్టి పూజ చేస్తే ఫలితం ఉంటుంది

Subrahmanya Sashti 2021 :  ప్రతి ఏటా మార్గశిర శుక్లపక్ష షష్టినాడు శ్రీ సుబ్రహ్మణ్య షష్టి పర్వదినాన్ని జరుపుకోవడం హిందువులు ఆచారం. కృత్తిక నక్షత్రాన జన్మించినందువల్ల, కార్తికేయుడని, రెల్లుపొదలలో పుట్టినందువల్ల శరవణభవుడని, ఆరుముఖాలుండటం వల్ల షణ్ముఖుడని… ఇంకా స్కందుడని, సేనాని అని, సుబ్రహ్మణ్యేశ్వరుడనే నామాలతో కూడా స్వామి ప్రసిద్ధుడు.

దీనినే సుబ్బరాయషష్ఠి అని, స్కందషష్ఠి అని కూడా అంటారు. సుబ్రహ్మణ్యేశ్వరుడు జన్మించిన రోజును ఈ పండుగగా జరుపుకుంటారు. ముఖ్యముగా తమిళనాడు లోను, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాలు, కుమారస్వామి వార్ల దేవాలయాలు కల ప్రతి చోటా ఈ రోజు విశేష పూజలు జరుపుతారు. ఆలయ సమీపంలో తిరునాళ్ళు వినోద కార్యక్రమాలు జరుపుతారు. ఈ ఏడాది సుబ్రహ్మణ్య షష్టి  డిసెంబర్ 9 గురువారం నాడు జరుపుకుంటున్నారు.

శ్రీవల్లి, దేవసేన ఆయన భార్యలు. సుబ్రహ్మణ్యేశ్వరుని వాహనం నెమలి. ఆరుముఖాలతో, ఎనిమిది భుజాలతో, అపారమైన ఆయుధాలతో దర్శనమిచ్చే కార్తికేయుడు మార్గశిర శుద్ధషష్ఠినాడు మాత్రం సర్పరూపంలో దర్శనమిస్తాడు. ఆ రోజు ఆయనను సర్పరూపునిగా కొలవడం, షోడశోపచారాలతో పూజించి పుట్టలో పాలు పోయడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం.
Also Read : Tiruchanur Brahmotsavam 2021 : శ్రీ‌వారి ఆల‌యం నుండి శ్రీ పద్మావతి అమ్మవారికి సారె
తారకాసుర సంహార నేపథ్యం ఈ కుమారస్వామి జననానికి సంబంధించిదే. మహా బలిష్టుడైన తారకాసురుడిని కుమారస్వామి జయించగలిగాడు కనుక జయాన్ని కోరి ముందుకు నడిచేవారు ఈ స్వామిని పూజించుకోవటం, తలచు కోవటం కన్పిస్తుంది.

జాతకంలో కాలసర్పదోషం ఉన్న వారు,కుజ,రాహు,కేతు దశలు నడుస్తున్నవారు, కుజ దోషం ఉన్నవారు,సంతానంలేని వారు,వివాహం కానివారు,దాంపత్య జీవితంలో ఇబ్బందులు  ఉన్నవారు ఉపవాస వ్రతాన్ని పాటిస్తూ షోడశోపచారములతో అర్చించడం వల్ల సత్ఫలితాలు పొందుతారని జ్యోతిష్య పండితులు చెపుతుంటారు.

సంతాన భాగ్యానికి నోచుకోని స్త్రీ, పురుషులు ఈ రోజున సర్పపూజలు చేసి,సంతానం కోసం, శత్రు విజయాల కోసం స్వామిని మార్గశిర శుద్ధ షష్ఠినాడు ప్రత్యేకంగా పూజిస్తుంటారు. సర్ప పూజలు ,తాంత్రిక పూజలు చేసే వారు సుబ్రహ్మణ్య షష్ఠి నాడు పూజలు చేస్తే అపారమైన శక్తి సామార్ద్యాలు కలిగి ఉంటారు.  సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ఉదయాన్నే స్నానం చేసి, ఏ ఆహారమూ తీసుకోకుండా తడి బట్టలతో సుబ్రహ్మ ణ్యస్వామి ఆలయానికి వెళ్ళి పువ్వులు, పండ్లు, పడగల రూపాలలాంటివి అక్కడ సమర్పిస్తారు.

బ్రహ్మచారియైన బ్రాహ్మణుడిని ఇంటికి పిలిచి సుబ్రహ్మణ్యస్వామి స్వరూపంగా భావించి భోజనం పెట్టి పంచెల జతను తాంబూలంతో ఉంచి ఇవ్వడం ఉత్తమం.  తనను భక్తితో కొలిచిన వారికి నాయకత్వ సిద్ధి, విజయప్రాప్తి, వ్యాధినివారణ, సంతానలాభం, భూప్రాప్తి శీఘ్రంగా సిద్ధింపజేస్తాడు సుబ్రహ్మణ్య స్వామి.  “శరవణభవ” అనే ఆరు అక్షరాల నామమంత్రాన్ని పఠించడం, జపించడం కూడా మంచి ఫలితాలను ప్రసాదిస్తుంది.

తమిళనాడు ప్రాంతంలో భక్తులు ఈ రోజున స్వామి వారికి కావడి మొక్కును తీర్చుకోవటం కనిపిస్తుంది. షష్ఠినాడు కుమారస్వామి ఆలయానికి కావడి మోసుకుని పోవటమే దీనిలోని  ప్రధానాంశం. ఈ కావడిలో ఉండే కుండలను పంచదారతోనూ, పాలతోనూ నింపుతారు. కావడి పంచదారతోనూ, పాలతోనూ అనేది మొక్కును బట్టి ఉంటుంది.

స్కంద షష్టి నాడు శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి కళ్యాణం నిర్వహిస్తారు. అవివాహితులు ఈ కళ్యాణం వీక్షిస్తే ఆటంకాలు తొలగి వివాహాలు జరుగుతాయి.. అంతేకాదు సత్సంతానం కలుగుతుందని పెద్దలు చెబుతున్నారు.