BJP MLAS : సస్పెన్షన్‌పై హైకోర్టులో పిటిషన్ వేసిన బీజేపీ ఎమ్మెల్యేలు

తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలు(BJP MLAS) హైకోర్టుని ఆశ్రయించారు. సస్పెన్షన్ ఉత్తర్వులను కొట్టివేయాలని హైకోర్టును కోరారు. అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేలా..

BJP MLAS : సస్పెన్షన్‌పై హైకోర్టులో పిటిషన్ వేసిన బీజేపీ ఎమ్మెల్యేలు

Bjp Mlas

BJP MLAS : తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలు హైకోర్టుని ఆశ్రయించారు. తమపై సస్పెన్షన్ ను సవాల్ చేస్తూ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, రాజాసింగ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాజ్యాంగం, అసెంబ్లీ నిబంధనలకు విరుద్ధంగా తమను సస్పెండ్ చేశారని వారు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సస్పెన్షన్ ఉత్తర్వులను కొట్టివేయాలని హైకోర్టును కోరారు. అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టుని కోరారు. సస్పెన్షన్ తీర్మానం, వీడియో రికార్డులు సమర్పించేలా అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించాలని బీజేపీ ఎమ్మెల్యేలు(BJP MLAS) హైకోర్టుని కోరారు.

తెలంగాణ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలు ప్రారంభ‌మైన తొలి రోజైన సోమ‌వారం.. నిమిషాల వ్య‌వ‌ధిలోనే బీజేపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేల‌ను ఈ బ‌డ్జెట్ సమావేశాల నుంచి స‌స్పెండ్ చేస్తూ స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ హాట్ టాపిక్ గా మారింది. రాజకీయాలను వేడెక్కించింది. దీనిపై బీజేపీ ఎమ్మెల్యేలు ఫైర్ అయ్యారు. స‌భ మొద‌లైన రెండు నిమిషాల‌కే త‌మ‌ను ఎలా సస్పెండ్ చేస్తారంటూ బీజేపీ ఎమ్మెల్యేల‌తో పాటు ఆ పార్టీ కీల‌క నేత‌లు టీఆర్ఎస్ ప్రభుత్వంపై విరుచుకుప‌డుతున్నారు.

ఈ వ్య‌వ‌హారం ఇప్పుడు తెలంగాణ హైకోర్టుకు చేరింది. ఈ మేర‌కు త‌మ సస్పెన్ష‌న్‌పై తెలంగాణ హైకోర్టులో పిటిష‌న్ వేశామ‌ని బీజేపీ నేత‌, దుబ్బాక ఎమ్మెల్యే ర‌ఘునంద‌న్ రావు తెలిపారు. త‌మ‌ను ఏ కార‌ణంగా స‌భ నుంచి స‌స్పెండ్ చేశారో చెప్పాలంటూ తాజాగా అసెంబ్లీ కార్య‌ద‌ర్శిని బీజేపీ ఎమ్మెల్యేలు వివ‌ర‌ణ కోరారు.

Minister Harish Rao : తెలంగాణ అసెంబ్లీ.. బడ్జెట్ సెషన్ మొత్తం బీజేపీ సభ్యుల సస్పెండ్

నాలుగు రోజుల్లోగా వివ‌ర‌ణ ఇస్తాన‌ని అసెంబ్లీ కార్య‌ద‌ర్శి చెప్పిన‌ట్లుగా ర‌ఘునంద‌న్ రావు తెలిపారు. ఏమైనా ఈ వ్య‌వ‌హారాన్ని తాము అంత ఈజీగా వదిలేది లేదన్నారు. పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజయ్ తో క‌లిసి రాష్ట్రప‌తి రామ్ నాథ్ కోవింద్‌ను క‌ల‌వ‌నున్నామ‌ని ర‌ఘునంద‌న్ తెలిపారు.

”శాసనసభలో స్పీకర్ తీరు కీలుబొమ్మ మాదిరి ఉంది. ఏ సెక్షన్ కింద బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారో ప్రజలకు స్పీకర్ చెప్పాలి. సభలో గవర్నర్‌ను అవమానిస్తూ.. బల్లలు ఎక్కిన హరీష్ రావుతో నీతులు చెప్పించుకునే స్థితిలో బీజేపీ లేదు. బడ్జెట్ స్పీచ్‌లో రాజకీయ విమర్శలు చేసిన మంత్రిగా హరీష్ రావు చరిత్రలో నిలిచిపోతారు” అని రఘునందన్ రావు ధ్వజమెత్తారు.

బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ పై బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. అసెంబ్లీ నుంచి ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం సరికాదన్నారు. వారిపై విధించిన సస్పెన్షన్ ను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. సభ ప్రారంభమైన కాసేపటికే సస్పెండ్ చేయడం చూస్తుంటే ముందస్తు ప్రణాళికలో భాగంగానే సస్పెండ్ చేశారని బండి సంజయ్ ఆరోపించారు.

కాగా, తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన తొలి రోజే బీజేపీ సభ్యులపై సస్పెన్షన్ వేటు పడిన సంగతి తెలిసిందే. ఈ సమావేశాలు ముగిసేవరకు వారిపై సస్పెన్షన్ వేటు పడింది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే శాసనసభలో మంత్రి హరీష్ రావు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. హరీష్ రావు బడ్జెట్ ప్రసంగం కొనసాగిస్తుండగా బీజేపీ సభ్యులు వ్యతిరేక నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే హరీష్ రావు తన ప్రసంగానికి స్వల్ప విరామం ఇచ్చారు.

Women’s Day: సీఎం కేసీఆర్ కు మహిళలంటే గౌరవం లేదు – బండి సంజయ్

బీజేపీ సభ్యులు రఘునందన్ రావు, రాజాసింగ్, ఈటల రాజేందర్‌లను ఈ సెషన్ ముగిసేవరకు శాసనసభ నుంచి సస్పెండ్‌ చేయాలంటూ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీర్మానాన్ని ప్రతిపాదించగా.. ఇందుకు స్పీకర్ పోచారం ఆమోదం తెలిపారు. మొత్తం ముగ్గురు బీజేపీ సభ్యులను ఈ సెషన్ మొత్తం సస్పెండ్ చేశారు.