TPCC Chief Revanth Reddy : రేవంత్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ సీనియర్ల ఢిల్లీ పయనం ?

తెలంగాణలో కాంగ్రెస్ మార్క్ రాజ‌కీయం మ‌ళ్లీ మొద‌లైంది. కొన్ని రోజులుగా స్తబ్దుగా ఉంటున్న తెలంగాణ‌ కాంగ్రెస్ అంతర్గత రాజకీయాలు మ‌ళ్లీ ర‌చ్చ‌కెక్కాయి.

TPCC Chief Revanth Reddy : రేవంత్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ సీనియర్ల ఢిల్లీ పయనం ?

Cong Sr Leaders

TPCC Chief Revanth Reddy :  తెలంగాణలో కాంగ్రెస్ మార్క్ రాజ‌కీయం మ‌ళ్లీ మొద‌లైంది. కొన్ని రోజులుగా స్తబ్దుగా ఉంటున్న తెలంగాణ‌ కాంగ్రెస్ అంతర్గత రాజకీయాలు మ‌ళ్లీ ర‌చ్చ‌కెక్కాయి. పార్టీలోని సీనియ‌ర్లు సోమవారం ప్ర‌త్యేకంగా భేటీ అయ్యారు. పార్టీలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌న్నింటిపై కూలంక‌షంగా చ‌ర్చించిన నేత‌లు … త్వ‌ర‌లో ఢిల్లీ వెళ్లాల‌ని డిసైడ‌య్యారు.

తెలంగాణ కాంగ్రెస్ సీనియ‌ర్ల‌కు మ‌ళ్లీ కోపం వ‌చ్చింది. పార్టీలో త‌మ‌కు ప్రాధాన్యం ద‌క్క‌డం లేద‌ని.. సీనియ‌ర్ల‌నే గౌర‌వం లేకుండా కొత్త నాయ‌క‌త్వం ప్ర‌వ‌ర్తిస్తోంద‌ని సీనియ‌ర్లు గుర్రుగా ఉన్నారు. త‌మ‌తో చ‌ర్చించ‌కుండానే కొత్త కార్య‌క్ర‌మాల ప్ర‌క‌ట‌న‌.. సీనియ‌ర్ల ప‌ట్ల అవ‌మాన‌క‌రంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని మండిప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో సీనియ‌ర్ నేత మ‌ర్రి శ‌శిధ‌ర్‌రెడ్డి నివాసంలో సోమవారం ప్ర‌త్యేకంగా భేటీ అయ్యారు. వీహెచ్‌, పొన్నాల ల‌క్ష్మ‌య్య‌, జ‌గ్గారెడ్డి, శ్రీధ‌ర్‌బాబు, గీతారెడ్డి, నిరంజ‌న్‌, కోదండ‌రెడ్డి త‌దిత‌రులు ఈ స‌మావేశానికి హాజరయ్యారు.

దాదాపు మూడు గంట‌ల పాటు చ‌ర్చించిన సీనియ‌ర్లు రాష్ట్ర పార్టీలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌పైనే ఎక్కువగా చర్చ చేశారు. ముఖ్యంగా పీసీసీ చీఫ్ రేవంత్ త‌న ఒంటెద్దు పోక‌డ‌ల‌తో వ‌న్‌మెన్ షో చేస్తున్నార‌ని సీనియ‌ర్లు మండిప‌డ్డారు. ప‌రిస్థితి ఇలాగే కొన‌సాగితే.. పార్టీ పూర్తిగా ఒక్క‌రి చేతుల్లో బందీ అవుతుంద‌నే అంశం చ‌ర్చ‌కు వ‌చ్చింది. అలాగే సీనియ‌ర్ల‌ను కావాల‌నే ప‌క్క‌న పెట్టే విధంగా అవ‌మాన‌క‌రంగా.. కొత్త పీసీసీ ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని సీనియ‌ర్ నేత‌లు అభిప్రాయ‌ప‌డ్డారు.

వీహెచ్‌… త‌న‌కు మంచిర్యాల‌లో జ‌రిగిన అవ‌మానం ఉద్దేశపూర్వ‌కంగానే జ‌రిగింద‌ని పేర్కొన్న‌ట్లు స‌మాచారం. అలాగే పొన్నాల ల‌క్ష్మ‌య్య‌.. త‌న నియోజ‌క‌వ‌ర్గంలో జంగా రాఘ‌వ‌రెడ్డి పెత్త‌నం ఎక్కువైంద‌ని.. త‌న‌కు స‌మాచారం లేకుండా కార్య‌క్ర‌మాలు జ‌రిగిపోతున్నాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. పార్టీ స‌భ్య‌త్వాల విష‌యంలో సీనియ‌ర్ల‌ను అవ‌మాన ప‌రిచేలా పీసీసీ కామెంట్స్ చేశార‌ని మ‌ర్రి శ‌శిధ‌ర్‌రెడ్డి కామెంట్స్ చేసిన‌ట్లు స‌మాచారం. అలాగే ఎమ్మెల్యేలు జ‌గ్గారెడ్డి, శ్రీధ‌ర్‌బాబు సైతం సీనియ‌ర్ల‌కు మ‌ద్ద‌తు తెలిపారు.

రాష్ట్ర పార్టీలో పీసీసీ చీఫ్ రేవంత్ ఏక‌ప‌క్షంగా వ్య‌వ‌హ‌రిస్తుండటంతో గుత్తాధిప‌త్యం పెరిగిపోతోందని సీనియ‌ర్లు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అలాగే తాజాగా కొల్లాపూర్ స‌భ‌లో రాష్ట్ర వ్యాప్తంగా పాద‌యాత్ర చేయాల‌నే డిమాండ్‌ను వ్య‌క్తం చేస్తూ.. తీర్మానాలు వ్య‌క్తం చేస్తూ కొత్త సాంప్ర‌దాయానికి తెర‌లేపార‌ని.. త్వ‌ర‌లో ఈ డిమాండ్‌పై అధిష్టానంపై ఒత్తిడి తీసుకొచ్చే అవ‌కాశం ఉంద‌ని సీనియ‌ర్ల భేటీలో చ‌ర్చ‌కు వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. ఇలాంటి పోక‌డ‌ల‌ను నిలువ‌రించేందుకు త్వ‌ర‌లో ఢిల్లీ వెళ్లి… అధిష్టానంతో భేటీ కావాల‌ని సీనియ‌ర్లు నిర్ణ‌యించారు.
Also Read : Mahabubabad : మహబూబాబాద్‌లో క్షుద్రపూజల కలకలం
సో.. మొత్తంగా కాంగ్రెస్ సీనియ‌ర్లంతా ఒక్క‌తాటిపైకి వ‌స్తున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ దూకుడును ఎట్టి ప‌రిస్థితిలో నిలువ‌రించాల‌ని నిర్ణ‌యించారు. అందుకోసం త్వ‌ర‌లో ఢిల్లీ వెళ్లి ముక్కుతాడు వేయాల‌ని చూస్తున్నారు. సీనియ‌ర్ల ఆలోచ‌న‌లు ఏ మేర‌కు ఫ‌లిస్తాయ‌నేది వేచి చూడాలి.