TSPSC Group 1: తెలంగాణలో గ్రూప్ -1 పరీక్షలకు లైన్ క్లియర్

గ్రూప్ 1 పరీక్ష  11 సంవత్సరాల తర్వాత జరుగుతోందని కోర్టుకు పిటిషనర్లు తెలిపారు.

TSPSC Group 1: తెలంగాణలో గ్రూప్ -1 పరీక్షలకు లైన్ క్లియర్

TSPSC Group 1

TSPSC Group 1 – High Court: గ్రూప్ -1 పరీక్షలకు లైన్ క్లియర్ అయింది. హైకోర్టులో దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టేసింది తెలంగాణ  హైకోర్టు (Telangana High Court). పేపర్ లీకేజీ దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదించారు. ఏ కమిషన్ లో పేపర్ లీక్ అయిందో అదే కమిషన్ ఇప్పుడు గ్రూప్ 1 నిర్వహిస్తుందని తెలిపారు. ఈ పరీక్షలను థర్డ్ పార్టీ ఏజెన్సీ లేదా యూపీఎస్సీ (Union Public Service Commission) తో నిర్వహించాలని కోరారు.

గ్రూప్ 1 పరీక్ష  11 సంవత్సరాల తర్వాత జరుగుతోందని అన్నారు. పారదర్శకత లేకుంటే అభ్యర్థులు నష్టపోతారని చెప్పారు. మిగతా పేపర్లు లీక్ అయ్యాయని, ఆ పరీక్షలను ఇంకా నిర్వహించలేదని తెలిపారు. ఉన్నపళంగా గ్రూప్ 1 ను నిర్వహిస్తున్నారని గుర్తు చేశారు. విచారణ పూర్తి కాకుండా గ్రూప్ 1 పరీక్ష నిర్వహించకూడదని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు చెప్పారు.

అయితే, నిందితులను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు కదా? అని హైకోర్టు అడిగింది. దర్యాప్తు తీరుపై కోర్టులు నిర్ణయం తీసుకుంటాయని పేర్కొంది. పేపర్ లీక్ లో అరెస్ట్ అయిన వారు ఇంకా సర్వీస్ కమిషన్ లో కొనసాగుతున్నారా అని ప్రశ్నించింది. ఏజీ తన వాదనలు వినిపిస్తూ కమిషన్ లోని ఇద్దరు నిందితుల్ని అరెస్ట్ చేశామని తెలిపారు.

ఇప్పటి వరకు 50 మందిని అరెస్ట్ చేశామని అన్నారు. దర్యాప్తు తో పిటిషనర్లకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. పరీక్ష రాసేందుకు అభ్యర్థులు ఎంతగానో ఎదురు చూస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం ముగ్గురిని నియమించి కేస్ మానిటర్ చేస్తుందని అన్నారు. 3.8 లక్షల మంది గ్రూప్ 1 కోసం అప్లై చేసుకున్నారని తెలిపారు. 1.59 లక్షల మంది అభ్యర్థులు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నారని వివరించారు. 995 సెంటర్లలో పరీక్ష నిర్వహిస్తామని అన్నారు.

రానున్న 6 నెలలో కమిషన్ నుంచి 26 పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. పేపర్ లీక్ వ్యవహారం బయటికి రాగానే కమిషన్ పరీక్ష రద్దు చేసిందని అన్నారు. పరీక్షకు వారం ముందు ఇలాంటి పిటిషన్ లు వేయడం సరికాదని అన్నారు. దీంతో అన్ని పిటిషన్లను కొట్టేసింది తెలంగాణ హైకోర్టు. జూన్ 11న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష జరగాల్సి ఉంది.

TSPSC Group-1 : జూన్ 11న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష