Bhoiguda Accident : బుగ్గిపాలైన 11 మంది కార్మికులు.. 12 వేల జీతం కోసం రాష్ట్రం కాని రాష్ట్రం వచ్చి…

రాత్రి 2 గంటల సమయం.. ఆదమరిచి నిద్రించే టైమ్‌ అది.. ఇంతలో ఎలా మొదలయ్యాయో తెలీదు.. వారి ప్రాణాలను కబలించడానికే వచ్చినట్టు వారిని చుట్టుముట్టాయి ఆ మంటలు...

Bhoiguda Accident : బుగ్గిపాలైన 11 మంది కార్మికులు.. 12 వేల జీతం కోసం రాష్ట్రం కాని రాష్ట్రం వచ్చి…

Hyderabad Fire Accident

Updated On : March 23, 2022 / 2:38 PM IST

The Bhoiguda Accident : వాళ్లది బతుకుపోరాటం.. పొట్టచేతపట్టుకుని బతుకుదెరువు కోసం రాష్ట్రం గాని రాష్ట్రం వచ్చారు. కూలినాలి చేసుకుంటే తప్ప రోజు గడవని పరిస్థితి. రోజంతా కష్టపడితే గాని కడుపు నిండని దుస్థితి.. అలాంటి వాళ్ల జీవితాలు పూర్తిగా బుగ్గిపాలైపోయాయి.. 12 వేల జీతం కోసం రాష్ట్రం కాని రాష్ట్రం వచ్చి… ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 11 మంది కార్మికులు అగ్నికి ఆహుతైపోయాయి. సికింద్రాబాద్ బోయిగూడ అగ్నిప్రమాదానికి కారణాలు ఏమైనా…? బాధ్యులెవరైనా.. నాశనమైన జీవితాలు మాత్రం కార్మికులవే. రోజంతా స్క్రాప్‌ గోడౌన్‌లో పనిచేయడం.. అలిసిపోయి రాత్రి కూడా ఆ గోడౌన్ పైనే ఉన్న రూమ్‌లో నిద్రపోవడం.. ఇదీ కార్మికుల దినచర్య.

Read More : Hyd Fire Accident: బోయిగూడ ఘటనపై సీఎస్ సోమేశ్ కుమార్ రియాక్షన్

రాత్రి కూడా బీహార్ కార్మికులంతా పనులు పూర్తి చేసుకుని గౌడోన్ పైన ఉన్న రూమ్‌లోకి చేరుకున్నారు. ఈ గోడౌన్‌లో ప్రతి రోజూ 16 మంది కార్మికులు పనిచేస్తారు. అయితే వారిలో 8 మంది కార్మికులు గోడౌన్ పైనే ఉన్న చిన్న రూమ్‌లో నివాసముంటారు. తిండీ తిప్పలు కూడా అక్కడే. ఆ చిన్న రూమ్‌లోనే వంట చేసుకుని అక్కడే నిద్రిస్తారు. అయితే ఈ 8 మంది కార్మికులతో పాటు రాత్రి మరో ముగ్గురు కూడా అదే రూమ్‌లో నిద్రించారు. వీళ్లు పక్కనే ఉన్న మరో గోడౌన్‌లో పనిచేస్తున్నారు. అయితే షాద్వాన్ లో పనిచేస్తున్న వారిలో తమ బంధువులు ఉండటంతో ఆ ముగ్గురు కూడా వచ్చి రాత్రి ప్రమాదం జరిగిన గోడౌన్ పైన ఉన్న రూమ్‌లోనే నిద్రించారు.

Read More : Hyd fire Accident: బోయిగూడ ప్రమాదంపై హైదరాబాద్ కలెక్టర్ రియాక్షన్

రాత్రి 2 గంటల సమయం.. ఆదమరిచి నిద్రించే టైమ్‌ అది.. ఇంతలో ఎలా మొదలయ్యాయో తెలీదు.. వారి ప్రాణాలను కబలించడానికే వచ్చినట్టు వారిని చుట్టుముట్టాయి ఆ మంటలు.. ముంచుకొచ్చిన ప్రమాదాన్ని పసిగట్టడంలో వారు చేసిన కాస్త ఆలస్యం.. వారి ప్రాణలను దహించి వేసింది. దీనికి తోడు గోడౌన్‌లో పేలిన సిలిండర్ అగ్నికి ఆజ్యం పోసింది. అప్పటికే ఎగిసిపడుతున్న మంటలకు ఈ పేలుడు మరింత ఆజ్యం పోసింది.. మంటలు మరింత చెలరేగేలా చేసింది. దీంతో వారికి మంటలకు బలవ్వడం తప్ప.. మరో అవకాశమే లేకపోయింది. చుట్టూ ఎగిసిపడుతున్న మంటలు.. దట్టంగా అలుముకున్న పొగలు.. ఊపిరి తీసుకోవడానికి లేదు.. బయటికి పారిపోవడానికి అంతకన్నా లేదు.. ఎందుకంటే చుట్టూ మంటలే.. బయటికి వెళ్లేందుకు ఉన్న ఏకైక మెట్ల మార్గంలో కూడా మంటలు ఎగిసిపడుతున్నాయి.. ఇక ఉన్నది ఒకే ఒక్క రూమ్‌.. అందులోకే పరుగులు పెట్టారు.. ఏం చేసినా ఆగ్నికి ఆహుతికావడం తప్పదనుకున్నారో లేక కనీసం ఒక్కరినైనా బతికించాలనుకున్నారేరో.. ఒకరిపై ఒకరు మొత్తం 11 మంది పడిపోయారు. కానీ ఆ మంటలు ఒక్కరిపై కూడా దయచూపలేదు.. ఆఖరి వ్యక్తిపై కూడా తమ ప్రతాపం చూపిస్తూ… అందరిని దహించి వేశాయి. మరో వ్యక్తి ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాటం చేస్తున్నాడు.