Telangana Rains : ఈ ఏడాది సమృధ్ధిగా వర్షాలు-వ్యవసాయానికి అనుకూలం
తెలంగాణలో ఈ ఏడాది వర్షాలు సమృధ్దిగా కురుస్తాయని హైదారాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న చెప్పారు. వానలు కావల్సినంత కురవటంతో రాష్ట్రంలో వ్యవసాయానికి అనుకూల వాతావరణం ఉన్నదని చెప్పారు.

IMD Hyderabad
Telangana Rains : తెలంగాణలో ఈ ఏడాది వర్షాలు సమృధ్దిగా కురుస్తాయని హైదారాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న చెప్పారు. వానలు కావల్సినంత కురవటంతో రాష్ట్రంలో వ్యవసాయానికి అనుకూల వాతావరణం ఉన్నదని చెప్పారు. నైరుతి రుతుపవనాలు జూన్ 5కి కర్ణాటక మధ్య భాగంలోకి పవేశిస్తాయని అక్కడి గాలి వేగాన్ని బట్టి జూన్ 8-10 వ తేదీల మధ్య తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్లు ఆమె తెలిపారు.
అండమాన్ లో నైరుతి రుతుపవనాలు బల పడ్డాయని…. అండమాన్ నికోబార్ దీవుల్లో భారీ వర్షాలు కురుస్తాయని, గాలి నైరుతి దిశలో వీస్తున్నదని నాగరత్న చెప్పారు. సముద్రంలో గాలులు ముందుగా వచ్చాయని, దీనికి వాతావరణంలో మార్పులు కూడా ఒక కారణమని ఆమె వివరించారు. దీంతో సాధారణంగా ఈనెల 22 న రావాల్సిన నైరుతి రుతుపవనాలు వారం రోజులు ముందుగా వచ్చాయని అన్నారు. అండమాన్ సముద్రంలో బలపడిన గాలులు బంగాళాఖాతం అంతటా వ్యాపించాలని, ఇది ఆఫ్రికా కోస్ట్ వరకు బలపడాలని అన్నారు.
దీంతోపాటు హిందూ మహాసముద్రం, ఆరేబియా మహా సముద్రంలో కూడా బలపడి, 30 నాటికల్ మైల్స్ వరకు చేరితే కేరళ తీరాన్ని రుతుపవనాలు తాకుతాయని వివరించారు. సోమాలియా జెట్లో కూడా గాలులు చాలా బలంగా ఉన్నాయని తెలిపారు. ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులను విశ్లేషిస్తే.. ఈ నెల 27 వరకు సాధారణ ప్రక్రియకు నాలుగు రోజులు ముందుగా కేరళలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని పేర్కొన్నారు.
ప్రస్తుత వాతావరణ స్థితిని బట్టి కేరళకు మంచి వర్షాలు వస్తాయని అంచనా వేశారు. కేరళకు రుతుపవనాలు వచ్చిన తర్వాత భూమి మీద వాతావరణం అనుకూలిస్తే జూన్ 8-10 మధ్య తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని నాగరత్న చెప్పారు. వాతావరణం ఇలాగే కొనసాగితే రాష్ట్రంలో ఈ ఏడాది మంచి వర్షాలు కురుస్తాయని ఆమె పేర్కోన్నారు.
వాతావరణం వివరాలను రైతులకు సకాలంలో అందించేందుకు ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్లకు నివేదిక ఇస్తున్నామని ఆమె చెప్పారు. దీంతో జిల్లా కలెక్టర్లు స్వఛ్ఛంద సంస్ధల సహాకారంతో ఎప్పటి కప్పుడు రైతులకు ఫోన్ ద్వారా సమాచారం అందిస్తున్నారని అన్నారు. మేనెలలో అడపా దడపా కురిసే వర్షాలకు రైతులు దుక్కులు దున్నుకోవచ్చని ఆమె సూచించారు.