బాలాకోట్ దాడుల గురించి అర్నబ్ గోస్వామికి ముందే తెలుసు!

బాలాకోట్ దాడుల గురించి అర్నబ్ గోస్వామికి ముందే తెలుసు!

WhatsApp chat        2019 ఫిబ్రవరి-14న జమ్ముకాశ్మీర్‌లోని పుల్వామాలో 40 మంది సిఆర్‌పిఎఫ్‌ సిబ్బందిని పాక్‌కు చెందిన జైషే మహ్మద్‌ ఉగ్రవాద సంస్థ పొట్టన బెట్టుకున్న విషయం తెలిసిందే. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్‌ లోని బాలాకోట్‌ లోని ఉగ్రస్థారాలపై 2019 ఫిబ్రవరి 26 తెల్లవారుజామున భారత్ వాయుసేన మెరుపుదాడి జరిపింది. అయితే అత్యంత గోప్యంగా ఈ దాడులు జరిగాయని కేంద్రం చెబుతుండగా… ఈ మెరుపుదాడుల గురించి రిపబ్లిక్ టీవీ చైర్మన్ అర్నబ్‌ గోస్వామికి ముందే తెలుసంట.

ఫిబ్రవరి 23న బ్రాడ్‌కాస్ట్‌ ఆడియన్స్‌ రీసెర్చ్‌ కౌన్సిల్‌ (బార్క్) మాజీ సీఈఓ పార్దో దాస్‌గుప్తాతో అర్నబ్ గోస్వామి జరిపిన వాట్సప్‌ చాట్‌ లో ఈ విషయమే వెల్లడైంది. సాదాసీదా స్ట్రైక్‌ కన్నా పెద్ద మెరుపు దాడి జరగుతుందన్నదీ దాని సారాంశం. ఈ సంభాషణ జరిగిన మూడు రోజుల తర్వాత.. భారత సైన్యం పాక్‌లోని ఉగ్రవాదులకు నిలయంగా ఉన్న బాలాకోట్‌పై మెరుపుదాడులు జరిపింది. టీఆర్పీ స్కాంలో అరెస్టైన అర్నబ్‌ పై దాఖలు చేసిన 3,400 పేజీల చార్జీషీట్‌ లో ముంబయి పోలీసులు ఈ విషయాన్ని కూడా పొందుపరిచారు.

అర్నబ్- పార్దో దాస్‌గుప్తా మధ్య జరిగిన చాట్‌ లో…. మరికొన్ని రోజుల్లో పెద్ద విషయం జరగబోతోందని అర్నబ్‌ చెప్పగా…గ్యాంగ్‌ స్టర్‌ దావూద్‌ గురించి గుప్తా అడగ్గా.. అది కాదని, పాకిస్తాన్‌లో ఇంకెదో జరుగుతుందని అర్నాబ్‌ హింటిచ్చారు. మంచిదని, ఇది ఓ పెద్దమనిషికి అవసరమని గుప్తా అన్నారు. దాడులా అని గుప్తా అడగ్గా…సాధారణ దాడుల కంటే పెద్దది అంటూ అర్నబ్‌ సమాధానమిచ్చారు. మరో చాట్‌ లో తన తరుపున ప్రభుత్వానికి మీరే చెప్పాలంటూ అర్నబ్‌ ను గుప్తా ఓ సాయం కోరగా..చేసి పెడతానని చెప్పారు.

అదేవిధంగా ప్రధాన మంత్రి కార్యాలయంలో మీడియా అడ్వైజర్‌గా ఉద్యోగమిప్పించాలంటూ గుప్తా గోస్వామిని కోరిన సంభాషణలు కూడా ఉన్నాయి. అనేక సందర్భాల్లో పిఎంఒ, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖతో అర్నబ్‌ సన్నిహితంగా ఉన్నట్లు తెలుస్తున్నాయి. ఈ చాట్‌కు సంబంధించిన ఫోటోలు బహిర్గతం కాగా… వీటిని సామాజిక కార్యకర్త, సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ ట్విట్టర్‌లో షేర్‌ చేశారు.