Assembly Election Results 2023: త్రిపురలో బీజేపీ.. నాగాలాండ్ లో ఎన్‭డీపీపీ-బీజేపీ గెలుపు.. మేఘాలయలో హంగ్..Live Updates

నాగాలాండ్, త్రిపురలో బీజేపీ దూసుకుపోయింది. మేఘాలయలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన 31 సీట్లు సాధించే దిశగా ఏ పార్టీ వెళ్లలేదు.

Assembly Election Results 2023: త్రిపురలో బీజేపీ.. నాగాలాండ్ లో ఎన్‭డీపీపీ-బీజేపీ గెలుపు.. మేఘాలయలో హంగ్..Live Updates

poll results

Assembly Election Results 2023: నాగాలాండ్, త్రిపురలో బీజేపీ దూసుకుపోయింది. మేఘాలయలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన 31 సీట్లు సాధించే దిశగా ఏ పార్టీ వెళ్లలేదు. ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల్లో ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. వాటికి సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ ఇవాళ ముగిసింది.

LIVE NEWS & UPDATES

  • 02 Mar 2023 08:10 PM (IST)

    మహిళా ముఖ్యమంత్రి సమయం ఆసన్నమైంది.. నాగాలాండ్ మొదటి మహిళా ఎమ్మెల్యే

    నాగాలాండ్ రాష్ట్రంలో 60 ఏళ్ల చరిత్రను తిరగరాస్తూ మొదటి మహిళా ఎమ్మెల్యేగా గెలుపొందిన హెకాని జకాలు.. ఇక మహిళా ముఖ్యమంత్రి అవ్వాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. దశాబ్దాల కల నెరవేరిందని, అయితే రాష్ట్రానికి మహిళా ముఖ్యమంత్రి అవ్వాల్సింది అలాగే మిగిలి ఉందని అన్నారు. ‘‘నేను మహిళల కోసం పోరాడబోతున్నాను. నా నియోజకవర్గం చాలా నిర్లక్ష్యానికి గురైంది. దానిని ఉత్తమ నియోజకవర్గంగా మార్చాలనుకుంటున్నాను. నాగా రాజకీయ సమస్యకు పరిష్కారం కనుగొనడమే నాకున్న అత్యంత ప్రాధాన్యత’’ అని ఆమె అన్నారు. దీమాపూర్-3 అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నేషనలిస్ట్ డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ తరపున ఆమె గెలుపొందారు. నాగాలాండ్ అసెంబ్లీకి 13 ఎన్నికలు జరిగినప్పటికీ ఒక్కసారంటే ఒక్కసారి కూడా ఒక మహిళా అసెంబ్లీకి ఎన్నికవ్వలేదు. అయితే తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హెకాని సహా మరో మహిళ విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో నలుగురు మహిళలు పోటీ చేశారు.

  • 02 Mar 2023 07:31 PM (IST)

    మేఘాలయ ముఖ్యమంత్రి విజయం వెనుక అమిత్ షా!

    తన వెనకాల కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉన్నారని మేఘాలయ ముఖ్యమంత్రి కొర్నాల్డ్ సంగ్మా అన్నారు. మేఘాలయ రాష్ట్రంలో తాను మరోసారి అధికారంలోకి రావడానికి అమిత్ షా సాయం చేశారని అన్నారు. ఆయన నేతృత్వంలోని నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‭పీపీ) దాదాపుగా సీట్లు సాధించింది. 60 స్థానాలకు గాను 31 అవసరం ఉండగా ఎన్‭పీపీకి 26 సీట్లు వచ్చాయి. దీంతో మరోమారు ముఖ్యమంత్రిగా తన సీటును పదిలపర్చుకున్నారు సంగ్మా. అయితే ఒక అసెంబ్లీ స్థానంలో కొన్ని కారణాల వల్ల్ పోలింగ్ రద్దు చేశారు. దానికి మరికొద్ది రోజుల్లో ఎన్నిక జరగనుంది.

  • 02 Mar 2023 07:26 PM (IST)

    అభివృద్ధికి స్థిరత్వానికి పట్టం.. త్రిపుర విజయంపై మోదీ

    త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించిడంపై ప్రధానమంత్రం నరేంద్రమోదీ హర్షం వ్యక్తం చేశారు. ప్రజలు అభివృద్ధికి స్థిరత్వానికి పట్టం కట్టారంటూ ఆయన వ్యాఖ్యానించారు. త్రిపుర బీజేపీ కార్యకర్తలను చూసి తాను ఎంతగానో గర్వపడుతున్నానని, మూలాల నుంచి పని చేశారంటూ పొగడ్తలు కురిపించారు. ఇక నాగాలాండ్ రాష్ట్రంలో ఎన్‭డీపీపీ-బీజేపీ కూటమి విజయం సాధించడంపై సైతం మోదీ ప్రశంసలు కురిపించారు. తమ కూటమికి మరోసారి కల్పించినందుకు ఆయన కృతజ్ణతలు తెలిపారు.

  • 02 Mar 2023 05:34 PM (IST)

    మూడు రాష్ట్రాల అంతిమ ఫలితాలు ఇవే..

    త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తుది ఫలితాలను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. త్రిపురలో భారతీయ జనతా పార్టీ 32 స్థానాలను గెలుచుకుని అధికారాన్ని నిలబెట్టుకుంది. నాగాలాండ్‭లో ఎన్‭డీపీపీ-బీజేపీ కూటమి 37 స్థానాలు గెలుచుకుని (25+12) అధికారాన్ని నిలబెట్టుకుంది. ఇక మేఘాలయలో అధికార నేషనల్ పీపుల్స్ పార్టీ 25 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ ఆ రాష్ట్రంలో హంగ్ ఏర్పడింది.

    త్రిపుర ఫలితాలు
    బీజేపీ - 32
    త్రిపా మోతా - 13
    సీపీఎం - 11
    కాంగ్రెస్ - 3
    ఏపీఎఫ్‭టీ - 1

    నాగాలాండ్ ఫలితాలు
    ఎన్‭డీపీపీ - 25
    బీజేపీ - 12
    ఎన్‫‭సీపీ -7
    ఎన్‭పీపీ - 5
    స్వతంత్రులు - 4
    ఎల్‭జేపీ (రాంవిలాస్) - 2
    ఆర్‭పీఐ (అథవాలె) - 2
    ఎన్‭పీఎఫ్ - 2
    జేడీయూ - 1

    మేఘాలయ ఫలితాలు
    ఎన్‭పీపీ - 25
    యూడీపీ - 11
    కాంగ్రెస్ - 5
    టీఎంసీ - 5
    వీపీపీ - 4
    బీజేపీ - 3
    హెచ్ఎస్‭పీడీపీ - 2
    పీడీఎఫ్ - 2
    స్వతంత్రులు - 2

  • 02 Mar 2023 05:32 PM (IST)

    నాగాలాండ్‭లో పెరిగిన స్వతంత్రులు.. అసెంబ్లీ ఎన్నికల్లో నలుగురి గెలుపు

    నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో నలుగురు స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. 60 అసెంబ్లీ స్థానాలున్న నాగాలాండ్ రాష్ట్రంలో గతంలో జరిగిన ఎన్నికల్లో 11 మంది అభ్యర్థులు పోటీ చేయగా కేవలం ఒకరే విజయం సాధించారు. అయితే ఈసారి ఎన్నికల్లో ఏకంగా నలుగురు అభ్యర్థులు విజయం సాధించారు. ఇక గత ఎన్నికల్లో 26 స్థానాలు గెలిచిన అతిపెద్ద పార్టీగా అవతరించిన నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్‭పీఎఫ్) ఈసారి కేవలం రెండు స్థానాలకే పరిమితం అయింది. అధికార పార్టీ ఎన్‭డీపీపీ గతంలో 18 స్థానాలు సాధించగా ఈసారి కాస్త పుంజుకుని 25 స్థానాల్ని కైవసం చేసుకుంది. బీజేపీలో మార్పు రాలేదు. ఇప్పుడు కూడా 12 స్థానాలు గెలుచుకుంది.

  • 02 Mar 2023 04:55 PM (IST)

    51 సార్లు ఈశాన్య ప్రాంతానికి వెళ్లిన ప్రధాని మోదీ

    ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈశాన్య ప్రాంతానికి 51 సార్లు వెళ్లారని నాగాలాండ్ భారతీయ జనతా పార్టీ అధికార ప్రతనిధి నలిన్ కోహ్లీ అన్నారు. గతంలో ఏ ప్రధానమంత్రి ఇన్నిసార్లు ఈశాన్య ప్రాంతానికి రాలేదని ఆయన అన్నారు. తాజాగా విడుదలైన ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి సానుకూలంగా వచ్చిన ఫలితాలపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇది బీజేపీ, ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ప్రజల మీదున్న నమ్మకమని ఆయన అన్నారు. ఈశాన్యంలో మౌలిక సదుపాయాలను మోదీ కల్పించారని, అభివృద్ధి వైపుకు నడిపించారని కోహ్లీ అన్నారు.

  • 02 Mar 2023 04:51 PM (IST)

    నాగాలాండ్ సీఎం నీఫియు రియో విజయం

    నాగాలాండ్ ముఖ్యమంత్రి నీఫియు రియో విజయం సాధించారు. నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (ఎన్‭డీపీపీ) తరపున అంగామి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన ఆయన కాంగ్రెస్ అభ్యర్థి సెయివిలీ సచుపై 15,824 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. కాగా, నాగాలాండ్‭లో ఇప్పటి వరకు కొనసాగిన పార్టీయే మళ్లీ అధికారం చేపట్టనున్నట్లు స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. బీజేపీతో కలిసి పోటీ చేసిన ఎన్‭డీపీపీ.. మరోసారి అధికార పగ్గాలు చేపట్టనుంది.

  • 02 Mar 2023 04:44 PM (IST)

    త్రిపుర విజయంపై ప్రసంగించనున్న ప్రధాని మోదీ

    ఈశాన్యంలోని మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మెచ్చుకోతగ్గ ఫలితాలు సాధించింది. ఇక త్రిపుర అసెంబ్లీని వరుసగా రెండోసారి కైవలం చేసుకుని కాషాయ కంచుకోటగా మార్చుకుంది. కాగా, ఈ విజయంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రసంగించనున్నట్లు బీజేపీ వర్గాల నుంచి సమాచారం. ఇక నాగాలాండ్‌లో తన మిత్రపక్షమైన నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీతో కలిసి అధికారాన్ని నిలుపుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. అంతే కాకుండా మేఘాలయలో కూడా గతం కంటే ఒక స్థానం ఎక్కువగా సాధించింది. ఈ ఫలితాలపై ఈరోజే బిజెపి కార్యకర్తలు, మద్దతుదారులను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తారని తెలుస్తోంది.

  • 02 Mar 2023 04:28 PM (IST)

    గత ఎన్నికలో సీట్లు.. ఈ ఎన్నికలో ఓట్లు కూడా కోల్పోయిన కమ్యూనిస్ట్ పార్టీ

    రెండు దశాబ్దాలకు పైగా త్రిపురను ఏకచత్రాధిపత్యంగా పాలించిన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా-మార్క్సిస్ట్ (సీపీఎం) గత కొంత కాలంగా ప్రజాధారణ బాగా కోల్పోయింది. 2018లో అధికారం కోల్పోయిన సీపీఎం.. ఆ ఎన్నికల్లో 16 సీట్లే గెలిచినప్పటికీ 42.22 శాతం ఓట్లు సాధించింది. అయితే ఈసారి ఎన్నికల్లో సీట్లతో పాటు ఓట్లు కూడా కోల్పోయింది. తాజాగా విడుదలవుతున్న ఫలితాల్లో లెఫ్ట్ పార్టీకి దక్కిన ఓట్లు కేవలం 24.5 శాతమే. ఇక ఈ ఎన్నికల్లో సింగిట్ డిజిట్‭ను అతి కష్టం మీద ఆ పార్టీ దాటింది. కాంగ్రెస్‭తో పొత్తుతో పోటీ చేసినప్పటికీ 11 స్థానాలకు మించి ప్రభావం చూపించలేకపోయింది.

  • 02 Mar 2023 04:20 PM (IST)

    5 కీలక రాష్ట్రాల్లో ఫలితాలు ఇవీ..

    మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఐదు రాష్ట్రాల్లోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఆ ఫలితాలు కూడా ఈరోజే విడుదల అవుతున్నాయి. మహారాష్ట్రాలోని పూణె జిల్లాలోని కాస్బా పేత్, చించ్‭వాడ్, జార్ఖండ్ రాష్ట్రంలోని రాంఘర్, తమిళనాడు రాష్ట్రంలోని ఈరోడ్-ఈస్ట్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని సాగర్దిగి, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని లుమ్లా అసెంబ్లీ నియోజకవర్గాల ఫలితాలు వెల్లడి అవుతున్నాయి. కాగా, ఇందులో ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో స్పష్టమైన ఫలితాలు వెల్లడి అయ్యాయి.

    కాస్బా పేత్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ సిట్టింగ్ స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. హస్తం పార్టీ అభ్యర్థి దంగేకర్ రవీంద్ర హేమ్రాజ్ విజయం సాధించారు. తమిళనాడులోని ఈరోడ్-తూర్పు అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి ఈవీకేఎస్ ఎలంగోవన్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని సాగర్దిగి అసెంబ్లీ నియోజకవర్గంలో బైరోన్ బిశ్వాస్ విజయం వైపుగా దూసుకెళ్తున్నారు. లుమ్లాలో బీజేపీ అభ్యర్థి సెరింగ్ లాము విజయం సాధించారు. రంఘర్ నియోజకవర్గంలో బీజేపీ మిత్ర పక్షమైన ఆల్ జార్ఖండ్ స్టూడెంట్ యూనియన్ పార్టీ అభ్యర్థి సునిత చౌదరి విజయం సాధించారు.

  • 02 Mar 2023 04:12 PM (IST)

    3 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు.. రాహుల్ భారత్ జోడో యాత్రపై సెటైర్లు

    మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ సింగిల్ డిజిట్ కూడా దాటలేదు. వాస్తవానికి పొత్తులతో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీకి ఆశించిన స్థానాలు కూడా రాలేదు. దీంతో రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రపై కాంగ్రెస్ వ్యతిరేకులు సెటైర్లు గుప్పిస్తున్నారు. రాహుల్ చేసిన యాత్ర వల్ల కాంగ్రెస్ పార్టీకి వచ్చిన లాభం ఏమీ లేదని, హస్తం పార్టీని ప్రజలు తిరస్కరించారంటూ విమర్శిస్తున్నారు. ఇక దశాబ్ద కాలంగా కాంగ్రెస్ పార్టీ మూటగట్టుకుంటున్న ఓటములపై సైతం తమదైన శైలిలో సెటైర్లు వేస్తున్నారు.

  • 02 Mar 2023 03:56 PM (IST)

    ఎన్నికల ఫలితాలు పూర్తిగా రాకముందే.. తండ్రి సమాధి వద్దకు వెళ్లిన మేఘాలయ సీఎం

    మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార నేషనలిస్ట్ పీపుల్స్ పార్టీ ముందంజలో ఉంది. వాస్తవానికి ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన పూర్తి మెజారిటీ ఆ పార్టీకి రాకపోయినప్పటికీ రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించనున్నట్లు మాత్రం ఫలితాలు వెల్లడిస్తున్నాయి. అయితే పూర్తి ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది. ఇదిలా ఉండగానే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కొర్నాడ్ సంగ్మా తన తండ్రి పీఏ సంగ్మా సమాధి వద్దకు వెళ్లి నివాళులు అర్పించారు. సీఎం సంగ్మా వెంట ఆయన తల్లి సొరదిని కె సంగ్మా, సోదరుడు జేమ్స్ సంగ్మా, సోదరి అగాథా కె సంగ్మా ఉన్నారు.

  • 02 Mar 2023 03:50 PM (IST)

    మూడు పార్టీలు తిరిగి.. ముప్పై ఏళ్లుగా గెలుస్తూ..

    కమ్యూనిస్ట్ పార్టీకి బలమైన రాష్ట్రంగా ఉన్న త్రిపుర ఇప్పుడు కాషాయ పార్టీకి కంచుకోటగా మారింది. దశాబ్ద కాలంలో రాష్ట్రంలో అనేక మార్పులు జరిగాయి. అలాగే నాయకులు కూడా మారారు. రాష్ట్రంలో చాలా మంది బలమైన నేతలు ఉన్నారు. ఎన్నో ఎత్తుపల్లాల నడుమ రాజకీయ చదరంగంలో తమ ప్రావిణ్యాన్ని చూపుతున్నారు. అందులో ఒకరు సుదిప్ రాయ్ బర్మాన్(56). మాజీ ముఖ్యమంత్రి సమిర్ రాయ్ రంజన్ బర్మాన్ కుమారుడైన ఆయన.. గత ఆరు అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా విజయాలు సాధించారు. కాంగ్రెస్ పార్టీతో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఆయన తదనంతర కాలంలో కమ్యూనిస్ట్ పార్టీ, తాజాగా భారతీయ జనతా పార్టీలో చేరినప్పటికీ ఎన్నికల్లో మాత్రం తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూనే వస్తున్నారు. తాజా ఎన్నికల ఫలితాల్లో సైతం ఆయన విజయం సాధించారు.

  • 02 Mar 2023 03:38 PM (IST)

    మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ హవా.. ఉప ఎన్నికల్లో పట్టు నిలుపుకున్న హస్తం పార్టీ

    మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఐదు రాష్ట్రాల్లోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగాయి. కాగా, మూడు రాష్ట్రాల్లోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగిస్తోంది. ఇందులో ఇప్పటికే ఒక స్థానంలో పూర్తి ఫలితాలు వచ్చి హస్తం పార్టీ అభ్యర్థి దంగేకర్ రవీంద్ర హేమ్రాజ్ విజయం సాధించారు. మరో రెండు స్థానాల్లో కూడా కాంగ్రెస్ విజయం దిశగా దూసుకుపోతోంది. మహారాష్ట్రాలోని పూణె జిల్లాలోని కాస్బా పేత్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ సిట్టింగ్ స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. తమిళనాడులోని ఈరోడ్-తూర్పు అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి ఈవీకేఎస్ ఎలంగోవన్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని సాగర్దిగి అసెంబ్లీ నియోజకవర్గంలో బైరోన్ బిశ్వాస్ విజయం వైపుగా దూసుకెళ్తున్నారు.

  • 02 Mar 2023 03:29 PM (IST)

    కాషాయ కోటలో కాంగ్రెస్ విజయం

    భారతీయ జనతా పార్టీకి కీలక స్థానంలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. పూణె జిల్లాలోని కాస్బా పేత్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో సిట్టింగ్ స్థానాన్ని బీజేపీ కోల్పోయింది. కమల పార్టీ అభ్యర్థి హేమంత్ రాసానేపై 12,000 మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దంగేకర్ రవీంద్ర హేమ్రాజ్ విజయం సాధించారు. ఎన్నికల సంఘం పూర్తి ఫలితాలు వెల్లడించక ముందే కాంగ్రెస్ నేత నానా పటోలే విజయం ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ శ్రేణుల్లో సందడి మొదలైంది. ఇక చించ్‭వాడ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి అశ్విని లక్ష్మణ్ జగపత్ ముందంలో ఉన్నారు. ఫలితాల్ని బట్టి చూస్తే లక్ష్మణ్ విజయం దాదాపు ఖరారు అయినట్టే కనిపిస్తోంది.

  • 02 Mar 2023 02:40 PM (IST)

    ఈశాన్య రాష్ట్రాల్లో పట్టు నిలుపుకొన్న బీజేపీ

    ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, నాగాలాండ్‌లలో బీజేపీ మరోసారి అధికారం దిశగా దూసుకెళ్తోంది. మేఘాలయలో అధికారం దక్కకున్నా మూడు లేదా నాలుగు సీట్లు సాధించే అవకాశం ఉంది. గతంతో పోలిస్తే ఇక్కడ మెరుగైన ఫలితమే. త్రిపుర, నాగాలాండ్‌లలో అధికారం చేపట్టాలంటే 31 సీట్లు అవసరం. త్రిపురలో ఇప్పటికే బీజేపీ 20 సీట్లు గెలిచింది. మరో 14 సీట్లలో ఆధిక్యంలో ఉంది. నాగాలాండ్‌లో బీజేపీ+ఎన్‌డీపీపీ కూటమి 19 సీట్లు గెలుచుకోగా, మరో 17 సీట్లలో ముందంజలో ఉంది. మేఘాలయలో ఎన్‌పీపీ 8 సీట్లు గెలుచుకోగా, 17 సీట్లలో లీడ్‌లో ఉంది.

  • 02 Mar 2023 01:49 PM (IST)

    తిప్రా మోతా డిమాండ్లు అంగీకరిస్తాం.. బీజేపీ ప్రకటన

    త్రిపురలో బీజేపీ మెజారిటీ దిశగా దూసుకెళ్తున్నప్పటికీ, మరో పార్టీ తిప్రా మోతా విషయంలో సానుకూలంగానే ఉంటోంది. ఆ పార్టీ మద్దతు కోసం ఓపెన్ ఆఫర్ ప్రకటించింది. గ్రేటర్ తిప్రాల్యాండ్ మినహా ఆ పార్టీ అడిగే మిగతా అన్ని డిమాండ్లను నెరవేరుస్తామని ప్రకటించింది. ఈ అసెంబ్లీ ఫలితాల్లో బీజేపీ 32 స్థానాల్లో ముందంజలో ఉంది. మెజారిటీకి 31 సీట్లు అవసరం. అయినప్పటికీ ముందు జాగ్రత్తగా తిప్రా మోతా పార్టీని ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది.

  • 02 Mar 2023 01:37 PM (IST)

    హెకాని జఖాలు.. తొలిసారిగా నాగాలాండ్ అసెంబ్లీకి ఎన్నికైన మహిళా ఎమ్మెల్యే

    నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో హెకాని జఖాలు అనే మహిళా అభ్యర్థి చరిత్ర సృష్టించింది. రాష్ట్రంలో అసెంబ్లీలో అడుగుపెట్టనున్న తొలి మహిళా ఎమ్మెల్యేగా నిలవనుంది. దిమాపూర్ నియోజకవర్గం నుంచి హెకాని విజయం సాధించింది. ఇప్పటివరకు నాగాలాండ్ అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యే లేకపోవడం గమనార్హం

  • 02 Mar 2023 01:03 PM (IST)

    నాగాలాండ్‌లో ఏడు స్థానాల్లో బీజేపీ విజయం

    నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటివరకు ఏడు స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. మరో 33 స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉంది. రెండు స్థానాల్ని ఇతరులు గెలుచుకున్నారు. ఎన్‌పీఎఫ్ 3 స్థానాల్లో, ఎన్‌సీపీ 4 స్థానాల్లో, ఇతరులు 11 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవడం కష్టమే.

  • 02 Mar 2023 12:52 PM (IST)

    త్రిపుర, నాగాలాండ్‌లో మెజారిటీ దిశగా బీజేపీ.. మేఘాలయలో ఎన్‌పీపీ హవా

    త్రిపుర, నాగాలాండ్ అసెంబ్లీ ఫలితాల్లో బీజేపీ మెజారిటీకి మించిన సీట్లు సాధించే దిశగా దూసుకెళ్తోంది. త్రిపుర, నాగాలాండ్‌లో 31 సీట్లు సాధించాల్సి ఉంది. అయితే, రెండు రాష్ట్రాల్లో బీజేపీ మెజారిటీకంటే ఎక్కువ సీట్లలోనే ఆధిక్యంలో కొనసాగుతోంది. మేఘాలయలో ఎన్‌పీపీ మెజారిటీకి దగ్గరగా ఉంది. అధికారం చేపట్టాలంటే 30 సీట్లు రావాల్సి ఉండగా, ఎన్‌పీపీ 25 సీట్లలో లీడింగ్‌లో ఉంది. బీజేపీ 5 స్థానాల్లో, ఇతర పార్టీలు 24 స్థానాలు ముందున్నాయి.

  • 02 Mar 2023 12:09 PM (IST)

    త్రిపుర సీఎం మాణిక్ సాహా విజయం

    త్రిపుర అసెంబ్లీ ఫలితాల్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ అభ్యర్థి మాణిక్ సాహా విజయం సాధించారు. బోర్డోవాలి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మాణిక్ సాహా తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి ఆశిష్ కుమార్ సాహాపై విజయం సాధించారు. వైద్య వృత్తి నుంచి రాజకీయ నేతగా మారిన సాహా 2022లో త్రిపుర సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టారు.

  • 02 Mar 2023 11:19 AM (IST)

    త్రిపురలో చక్రం తిప్పబోయేది ‘తిప్రా’యేనా?

    త్రిపుర అసెంబ్లీ ఫలితాల్లో బీజేపీ ఆధిపత్యం కొనసాగుతోంది. బీజేపీ స్పష్టమైన మెజారిటీ సాధించే అవకాశాలు కనిపించడం లేదు. 60 అసెంబ్లీ స్థానాలకుగానే, 31 అసెంబ్లీ స్థానాలు గెలిస్తేనే అధికారం దక్కుతుంది. అయితే, బీజేపీ 29 సీట్లలోనే లీడింగ్‌లో ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీకి అధికారం దక్కాలంటే తిప్రా మోతా పార్టీ సాయం అవసరం. బీజేపీకి మెజారిటీ రాకుంటే తిప్రా పార్టీయే చక్రం తిప్పే అవకాశం ఉంది. అవసరమైతే కమ్యూనిస్టులతో కూడా తిప్రా కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఛాన్స్ ఉంది.

  • 02 Mar 2023 10:33 AM (IST)

    అసెంబ్లీ ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ

    త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. మూడు రాష్ట్రాలు కలిపి 179 అసెంబ్లీ స్థానాలుంటే, మొత్తంగా 10 స్థానాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో లేదు. దీంతో ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ సింగిల్ డిజిట్ దాటడమే కష్టంగా కనిపిస్తోంది.

  • 02 Mar 2023 09:57 AM (IST)

    మేఘాలయలో హంగ్ తప్పదా?

    మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ పూర్తి మెజారిటీ దిశగా దూసుకెళ్లడం లేదు. 59 స్థానాలున్న అసెంబ్లీలో అధికారం దక్కాలంటే 30 స్థానాలు కావాలి. అయితే, ఎన్పీపీ ముందంజలో ఉన్నప్పటికీ 20 స్థానాల్లో మాత్రమే లీడ్‌లో కొనసాగుతుంది. టీఎమ్‌సీ 10 స్థానాల్లో, బీజేపీ 10 స్థానాల్లో లీడింగ్‌లో ఉండగా, ఇతరులు 19 స్థానాల్లో ముందంజలో కొనసాగుతున్నారు. దీంతో మేఘాలయలో హంగ్ తప్పేలా లేదు.

  • 02 Mar 2023 09:11 AM (IST)

    మేఘాలయలో ఎన్పీపీ హవా.. త్రిపుర, నాగాలాండ్‌లో దూసుకెళ్తున్న బీజేపీ

    మేఘాలయలో ఎన్పీపీ అధిక స్థానాల్లో దూసుకుపోతుంది. నాగాలాండ్‌లో బీజేపీ దాదాపు 50 స్థానాల్లో ఆధిక్యం కొనసాగిస్తుండగా, త్రిపురలో 40 స్థానాల్లో ముందంజలో ఉంది. మేఘాలయలో ఎన్పీపీ 28 స్థానాల్లో ముందంజలో ఉంది.

  • 02 Mar 2023 08:34 AM (IST)

    రెండు రాష్ట్రాల్లోనూ ఆధిక్యంలో బీజేపీ

    త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. త్రిపుర, నాగాలాండ్‌లలో 60 స్థానాలు, మేఘాలయలో 59 అసెంబ్లీ స్థానాలున్నాయి. వీటిలో త్రిపుర, నాగాలాండ్‌లలో అధికారంలోకి రావాలంటే 31 సీట్లు, మేఘాలయలో 30 స్థానాలు గెలవాల్సి ఉంటుంది. తాజాగా కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా, త్రిపుర, నాగాలాండ్‌లో బీజేపీ కూటమి ఆధిక్యంలో ఉంది. మేఘాలయలో ఎన్పీపీ ముందుంజలో ఉంది.

  • 02 Mar 2023 07:59 AM (IST)

    నాగాలాండ్‌లో బీజేపీ-ఎన్‌డీపీపీ కూటమి, ఎన్‌పీఎఫ్‌, కాంగ్రెస్‌ మధ్య పోటీ నెలకొంది.

  • 02 Mar 2023 07:59 AM (IST)

    మేఘాలయలో కాంగ్రెస్, బీజేపీ, నేషనల్ పీపుల్స్ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, యునైటెడ్ డెమోక్రటిక్ పార్టీ ప్రధాన పార్టీలు బరిలో ఉన్నాయి.

  • 02 Mar 2023 07:59 AM (IST)

    త్రిపురలో బీజేపీ - ఐపీఎఫ్‌టీ కలిసి పోటీ చేశాయి. కాగా కాంగ్రెస్, సీపీఐ(ఎం) తొలిసారి కలిసి పోటీ చేశాయి. దీంతో పాటు టీఎంపీ కూడా పోటీలో ఉంది.

  • 02 Mar 2023 07:58 AM (IST)

    మూడు రాష్ట్రాల్లో 60 అసెంబ్లీ స్థానాలు చొప్పున ఉన్నాయి. వీటిల్లో అధికారంలోకి వచ్చేందుకు కావాల్సిన సీట్లు 31.

  • 02 Mar 2023 07:52 AM (IST)

    మేఘాలయలో కౌంటింగ్ కేంద్రాలు ఎన్నంటే ..?

    మేఘాలయ రాష్ట్రంలో ఓట్ల లెక్కింపుకు సంబంధించి 13 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలో 12, సోహ్రో సబ్ డివిజన్ లో ఒకటి ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. మొత్తం 383 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. మొదటి 30 నిమిషాలు పోస్టల్ బ్యాలెట్లను లెక్కించనున్నారు.

  • 02 Mar 2023 07:48 AM (IST)

    త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఓట్లలెక్కింపు ప్రక్రియ ఉదయం 8గంటల నుంచి ప్రారంభమవుతుంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

  • 02 Mar 2023 07:45 AM (IST)

    దేశంలోని ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల్లో ఈరోజు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఉదయం 8గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. త్రిపురలో ఫిబ్రవరి 16న, నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాల్లో ఫిబ్రవరి 27న పోలింగ్ జరిగిన విషయం విధితమే. అయితే, మూడు రాష్ట్రాల్లో 60 చొప్పున అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వీటిల్లో నాగాలాండ్, మేఘాలయల్లో ఇప్పటికే ఒక్కో అసెంబ్లీ స్థానం ఏకగ్రీవం కాగా 59 అసెంబ్లీ స్థానాల చొప్పున పోలింగ్ జరిగింది. త్రిపురలో 88శాతం పోలింగ్ నమోదు కాగా.. మేఘాలయలో 76శాతం, నాగాలాండ్ రాష్ట్రంలో 84శాతం ఓట్లు పోలయ్యాయి.