Sai Pallavi : సాయి పల్లవిపై ట్రోల్స్.. తీవ్రంగా ఖండించిన తెలంగాణ గవర్నర్ తమిళిసై

తాజాగా తెలంగాణ గవర్నర్‌ తమిళిసై కూడా సాయిపల్లవిపై వచ్చిన వార్తలని తీవ్రంగా ఖండించారు. తమిళ ఛానల్‌కు ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. '' హీరోయిన్ సాయిపల్లవి గురించి......

Sai Pallavi : సాయి పల్లవిపై ట్రోల్స్.. తీవ్రంగా ఖండించిన తెలంగాణ గవర్నర్ తమిళిసై

Sai Pallavi

Sai Pallavi :  ఇటీవల నాని, సాయి పల్లవి హీరో హీరోయిన్స్ గా వచ్చిన ‘శ్యామ్‌ సింగరాయ్‌’ మంచి విజయం సాధించింది. ఓటీటీలో కూడా రికార్డులు సృష్టిస్తుంది. అయితే సాయి పల్లవి సినిమాల్లో మేకప్ వాడదని, న్యాచురల్ గానే ఉండటానికి ప్రయత్నిస్తుందని అందరికి తెలిసిందే. ఈ సినిమాలో కూడా దేవదాసి పాత్రలో చాలా సాదాసీదాగా నటించి అందర్నీ మెప్పించింది. తమిళనాడులోని ఓ పత్రికలో ఈ సినిమా గురించి ప్రస్తావిస్తూ దేవదాసి పాత్రలో నటించిన సాయిపల్లవి అందంగా లేదు అంటూ ఓ వార్త ప్రచురితమైంది. దీనికి వ్యతిరేకంగా చాలా మంది నిరసన వ్యక్తం చేశారు. తాజాగా తెలంగాణ గవర్నర్‌ తమిళిసై కూడా సాయిపల్లవిపై వచ్చిన వార్తలని తీవ్రంగా ఖండించారు.

తమిళ ఛానల్‌కు ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ” హీరోయిన్ సాయిపల్లవి గురించి బాడీ షేమింగ్‌ చేయడం నన్ను ఎంతగానో బాధించింది. ఇది చాలా తప్పు. గతంలో నా రూపాన్ని కూడా చూసి బాడీ షేమింగ్‌ చేసి ట్రోల్ చేశారు. అలా చేస్తున్నారని తీవ్రంగా బాధపడ్డాను. కానీ నా ప్రతిభతో, శ్రమతో ఆ మాటలను ఎదుర్కొన్నాను. అలాంటి కామెంట్స్‌ బారిన పడకుండా ఉండటానికి మనమేమీ మహాత్ములం కాదు. నాపై చేసిన కామెంట్స్‌ను నేను పట్టించుకోలేదు. కానీ ఆ ట్రోలింగ్‌ వల్ల అవతలి వాళ్ళు కచ్చితంగా బాధపడతారు.”

”పొట్టిగా, నల్లగా, నాలాంటి జుట్టుతో పుట్టడం మన తప్పేమీ కాదు. వీటన్నింటిలోనూ అందం ఉంది. కాకి పిల్ల కాకికి ముద్దు అనే సామెత ఊరికే రాలేదు. కాకి తన పిల్లను నల్లగా ఉందని వదిలిపెట్టదు. మహిళలు బాడీ షేమింగ్‌కు గురవుతారు కానీ పురుషులకు మాత్రం అలాంటి మాటలు ఎదురవవు. 50 ఏళ్ల వయసులో ఉన్న పురుషులను కూడా యువకులుగా చూస్తారు కానీ స్త్రీలను మాత్రం అలా చూడలేరు. స్త్రీల ఎదుగుదలకు ఇలాంటివన్నీ చూపించి మహిళలను బాధపెడుతూ వారి ఎదుగుదలను తగ్గించడానికి ప్రయత్నిస్తుంది ఈ సమాజం.” అని తమిళిసై తీవ్రంగా స్పందించారు.

సాయి పల్లవిపై తమిళ ఛానల్ తో మాట్లాడిన ఆ టీవీ క్లిప్స్ ని జతచేసి మహిళలని బాడీ షేమింగ్ చేయొద్దని, మహిళలు అలాంటివి అస్సలు పట్టించుకోవద్దని, చాలా కాన్ఫిడెంట్ గా ఉండాలని, మీ ట్యాలెంట్ తో మీ శ్రమతో పైకి ఎదగాలని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఇలాంటి వాటిని తీవ్రంగా ఖండించినందుకు గవర్నర్ తమిళిసైని అందరూ అభినందిస్తున్నారు.