TS EAMCET: జులై 14 నుంచి తెలంగాణ ఎంసెట్

తెలంగాణ ఎంసెట్ జులై 14, 15 తేదీల్లో అగ్రికల్చర్ 18, 19, 20 తేదీల్లో ఇంజినీరింగ్ విభాగం పరీక్షలు నిర్వహిస్తారు. ఇలా అయిదు రోజుల పాటు జరగనున్నట్లు అధికారులు తెలిపారు.

TS EAMCET: జులై 14 నుంచి తెలంగాణ ఎంసెట్

Ts Eamcet Exam

TS EAMCET: తెలంగాణ ఎంసెట్ జులై 14, 15 తేదీల్లో అగ్రికల్చర్ 18, 19, 20 తేదీల్లో ఇంజినీరింగ్ విభాగం పరీక్షలు నిర్వహిస్తారు. ఇలా అయిదు రోజుల పాటు జరగనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రవేశ పరీక్షలపై ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య లింబాద్రి, ఇతర అధికారులతో విద్యా శాఖమంత్రి సబితా ఇంద్రా రెడ్డి మంగళవారం చర్చలు జరిపి ఎంసెట్, ఈసెట్ తేదీలను ప్రకటించారు.

ఎంసెట్‌ను ఇరు రాష్ట్రాల్లో 105 కేంద్రాల్లో జరుపుతామని స్పష్టం చేశారు. పాలిటెక్నిక్ విద్యార్థులు లేటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్/బీఫార్మసీ రెండో ఏడాదిలో చేరేందుకు ఈసెట్‌ను జులై 13న జరపాలని నిర్ణయించినట్లు తెలిపారు.

వారంలో నోటిఫికేషన్లు
ఎంసెట్, ఈసెట్ రిజిస్ట్రేషన్, ఫీజు ఇతర వివరాలతో వారం రోజుల్లో నోటిఫికేషన్లు ఇస్తామని అధికారులు తెలిపారు. బ్యాచిలర్ ఆఫ్ ఒకేషనల్ ( బీవోక్) విద్యార్థులూ ఈసెట్ ద్వారా బీటెక్ రెండో ఏడాదిలో ప్రవేశానికి అర్హులేనని ఇటీవల ఏఐసీటీఐ తెలియజేసింది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది.

Read Also: తెలంగాణ ఎంసెట్ సిలబస్ తగ్గింపు!

బీఎస్సీ నర్సింగ్ సీట్లను కూడా ఎంసెట్ అగ్రికల్చర్ విభాగం పరీక్ష ర్యాంకుల ఆధారంగా భర్తీ చేయాలని కాళోజీ యూనివర్సిటీ ప్రతిపాదిస్తోంది. తాజాగా వీసీ కరుణాకర్ రెడ్డి విద్యామండలి ఛైర్మన్ లింబాద్రితో చర్చించి వీటన్నింటినీ పరిశీలించి వారం రోజుల్లో నోటిఫికేషన్లు జారీ చేయనున్నారు. లాసెట్, ఎడ్‌సెట్ తదితర పరీక్షల తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని ఛైర్మన్ లింబాద్రి తెలిపారు.

తెలంగాణ ఎంసెట్ కోసం రెండు రాష్ట్రాల నుంచి కనీసం రెండున్నర లక్షల మంది దరఖాస్తు చేస్తున్నారు. గతేడాది ఎంసెట్ ఇంజినీరింగ్ కు లక్షా 64వేల 962 మంది, అగ్రికల్చర్ – ఫార్మసీలకు 86వేల 644మంది నుంచి దరఖాస్తులు అందాయి. ఈ సారి ఇంటర్ మొదటి సంవత్సరంలో తప్పిన విద్యార్థులందరినీ కనీస మార్కులతో ప్రభుత్వం పాస్ చేయడంతో భారీ సంఖ్యలోనే పోటీపడతారని అధికారులు అంచనా వేస్తున్నారు.

70శాతం సిలబస్ ఆధారంగానే ఇంటర్ ప్రథమ, ద్వితీయ పరీక్షలు జరిగాయి. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకొని ఎంసెట్ క్వశ్చన్ పేపర్ రూపొందిస్తారు. ఈసెట్‌కు ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 25వేల మంది పోటీపడనున్నారు.