NS Left Canal Car Case : నల్గొండ కారు కేసు-మానసిక స్ధితి సరిగా లేదు..!

పండిత పుత్ర.. పరమ శుంఠ అంటారు పెద్దలు. ఇప్పుడు వీరి విషయంలో నిజమేననిపిస్తోంది. తల్లితండ్రుల మీద కోపంతో తండ్రి కష్టార్జితాన్ని కాల్వ పాలు చేశారు పుత్రరత్నాలు.

NS Left Canal Car Case : నల్గొండ కారు కేసు-మానసిక స్ధితి సరిగా లేదు..!

nalgona car case

NS Left Canal Car Case :  పండిత పుత్ర.. పరమ శుంఠ అంటారు పెద్దలు. ఇప్పుడు వీరి విషయంలో నిజమేననిపిస్తోంది. తల్లితండ్రుల మీద కోపంతో తండ్రి కష్టార్జితాన్ని కాల్వ పాలు చేశారు పుత్రరత్నాలు. తండ్రి రిటైరైన తర్వాత వచ్చిన డబ్బుతో ఇంట్లో నుంచి వెళ్లిపోయిన అక్కాతమ్ముళ్లు.. వారి మీద కోపంతో లక్షల విలువ చేసే కొత్త కారును కాల్వలోకి తోసి.. కొత్త డ్రామాకు తెర లేపారు. తమ కారును ఎవరో ఎత్తుకెళ్లారని పోలీసులను బురిడీ కొట్టించబోయి అడ్డంగా బుక్కయ్యారు.

ఆయనో రిటైర్డ్ హెడ్‌మాస్టర్. తన సర్వీస్‌లో వేల మంది విద్యార్థులకు చదువు చెప్పి తీర్చిదిద్దిన ఆయన.. ఆయన సొంత బిడ్డలను మాత్రం ఉన్నత పౌరులుగా మలచలేకపోయారు. కొందరి చెప్పుడు మాటలతో చెడిపోయిన పిల్లలను దారికి తెచ్చుకోలేకపోయారు. నల్లగొండ జిల్లా వేములపల్లి వద్ద సాగర్‌ ఎడమ కాల్వలో కారు కొట్టుకొచ్చిన కేసును పోలీసులు ఛేదించారు. కారు అదుపుతప్పి కాల్వలో పడిందా..? కారును తోసేసి ఆత్మహత్యకు పాల్పడ్డారా..? అనే అనుమానాలకు పోలీసులు తెరదించారు. అక్కాతమ్ముడి పిచ్చి ప్రవర్తనే దీనికి కారణమని తేల్చారు.

తాము దేవుళ్లమని ఆ అక్కా తమ్ముడు వాదిస్తారట. తల్లిదండ్రులు వారికి చెప్పీ చెప్పీ విసుగొచ్చింది. దీంతో ఇంటి నుంచి వెళ్లిపోయారు అక్కాతమ్ముడు. తండ్రి రామాంజనేయులు రిటైర్డ్ హెడ్ మాస్టర్‌. నాలుగు నెలల క్రితమే రిటైర్ అయ్యారు. కొంతకాలంగా పిల్లలు తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్నారు. రిటైర్మెంట్ తర్వాత వచ్చిన డబ్బులో తండ్రి 20 లక్షలు పిల్లలకు ఇచ్చారు. వారి మెయింటెనెన్స్‌కి నెలనెలా డబ్బు పంపుతున్నారు. కుటుంబ కలహాలో.. ఇంకేవైనా కారణాలో తెలియవు కానీ.. తల్లిదండ్రులంటే పిల్లలకు పడదు. అందుకే వారు దూరంగా ఉంటున్నారు. తండ్రి ఇచ్చిన డబ్బుతోనే హైదరాబాద్‌లో కొత్త కారు కొన్నారు. దాన్నే తీసుకొచ్చి కాల్వలోకి తోశారు.
Also  Read : Paddy Politics : వరి ధాన్యం వార్-ఢిల్లీ వెళ్లనున్న సీఎం కేసీఆర్

కాల్వలో కారు కొట్టుకు రావడం గమనించి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సాగర్‌ కాల్వను బంద్ చేయించారు. కారును బయటకు తీశారు. అప్పటికే వార్త వైరల్ కావడంతో నిందితులిద్దరూ తమ కారును ఎవరో దొంగిలించారని పోలీసులకు కంప్లైంట్ చేశారు. పోలీసులకు అనుమానం వచ్చి గట్టిగా మందలించడంతో అసలు విషయం బయటకు వచ్చింది.

అప్పటికే ఎవరో ఇద్దరు కారును తోసేశారని స్థానికులు చెప్పడం.. కంప్లైంట్ కూడా ఇద్దరే ఇవ్వడం పోలీసుల అనుమానాలు బలపడి.. తమదైన శైలిలో విచారించడంతో.. అక్కాతమ్ముడు అడ్డంగా బుక్కయ్యారు. అటు.. పిల్లల మానసిక పరిస్థితి బాలేదన్నారు తండ్రి రామాంజనేయులు. కొంతమంది కారణంగానే వాళ్లు చెడిపోయారని చెప్పారు. అటు, కేసును తప్పుదోవ పట్టించిన అక్కాతమ్ముడిపై పోలీసులు చర్యలకు సిద్ధమయ్యారు. వారి మానసిక స్థితి బాలేదని చెప్పడంతో.. వైద్య పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు.