‘వందే భారత్‌’ విమానాలకు మహిళా కెప్టెన్లు

  • Published By: srihari ,Published On : May 10, 2020 / 05:47 AM IST
‘వందే భారత్‌’ విమానాలకు మహిళా కెప్టెన్లు

కోరోనా వైరస్ వ్యాప్తితో భారత్ సహా ప్రపంచ దేశాలు లాక్‌డౌన్ విధించాయి. లాక్ డౌన్ కారణంగా చాలామంది విదేశాల్లో చిక్కుకున్నారు. అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేయడంతో స్వదేశానికి రాలేకపోయారు. కరోనా వ్యాప్తితో విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను తిరిగి వారి స్వదేశానికి తీసుకొచ్చేందుకు ‘వందే భారత్’ మిషన్ కొనసాగుతోంది. మలేషియా, ఒమన్ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను తీసుకురావడానికి శనివారం రెండు ఎయిర్‌ఇండియా విమానాలు బయల్దేరాయి. 

ఈ రెండు విమానాలకు మహిళా కెప్టెన్లు సారథ్యం వహిస్తున్నారు. తిరుచిరాపల్లి-కౌలాలంపూర్‌ విమానానికి కెప్టెన్‌ కవితా రాజ్‌కుమార్‌ నేతృత్వం వహిస్తోంది. కొచ్చి-మస్కట్‌ విమానానికి కెప్టెన్‌ బిందూ సెబాస్టియన్‌ సారథ్యం వహిస్తున్నారు. మరోవైపు అబుదాబి, దుబాయ్‌ నుంచి భారత్‌కు తీసుకొచ్చిన 363 మందిలో ఇద్దరికి కరోనా ఉన్నట్లు తేలిందని కేరళ సీఎం పినరయి విజయన్‌ తెలిపారు.

స్వదేశానికి వచ్చేందుకు భారతీయులు ఆశగా ఎదురుచూస్తుండి పోయారు. ఎట్టకేలకు స్వదేశానికి ప్రత్యేక విమానంలో చేరుకున్నారు. కువైట్‌లో చిక్కుకున్న 163 మంది భారతీయులు హైదరాబాద్‌కు చేరుకున్నారు. విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి చేర్చేందుకు చేపట్టిన వందే భారత్ మిషన్ తొలి విమానం తెలంగాణకు చేరుకుంది.