Medico Preethi : పూర్తిగా చెడిపోయిన కిడ్నీలు, అత్యంత విషమంగా ప్రీతి పరిస్థితి

వరంగల్ మెడికల్ కాలేజీ పీజీ విద్యార్థిని ప్రీతి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో స్పెషలిస్ట్ డాక్టర్లు, మల్టీ డిసిప్లినరీ టీమ్ పర్యవేక్షణలో ప్రీతికి చికిత్స కొనసాగుతోంది. ప్రస్తుతం ఎక్మో, వెంటిలేటర్ పై ట్రీట్ మెంట్ జరుగుతోంది. మరోవైపు ప్రీతి కిడ్నీలు పూర్తిగా చెడిపోవడంతో డయాలసిస్ కొనసాగుతోంది.

Medico Preethi : పూర్తిగా చెడిపోయిన కిడ్నీలు, అత్యంత విషమంగా ప్రీతి పరిస్థితి

Medico Preethi : సీనియర్ వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నం చేసిన వరంగల్ మెడికల్ కాలేజీ పీజీ విద్యార్థిని ప్రీతి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో స్పెషలిస్ట్ డాక్టర్లు, మల్టీ డిసిప్లినరీ టీమ్ పర్యవేక్షణలో ప్రీతికి చికిత్స కొనసాగుతోంది. ప్రస్తుతం ఎక్మో, వెంటిలేటర్ పై ట్రీట్ మెంట్ జరుగుతోంది. మరోవైపు ప్రీతి కిడ్నీలు పూర్తిగా చెడిపోవడంతో డయాలసిస్ కొనసాగుతోంది.

మెడికల్ నిబంధనల ప్రకారం ఎవరైనా పేషెంట్ కు ఎక్మోపై వైద్యం అందిస్తే కనీసం 72 గంటల వరకు ట్రీట్ మెంట్ అందించాల్సి ఉంటుంది. అప్పటికీ బాడీ రెస్పాండ్ అవ్వకపోతే పేరెంట్స్ ను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి డిక్లరేషన్ ఇచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రీతి బీపీ కూడా మెయింటేన్ అవ్వటం లేదని వైద్యులు హెల్త్ బులెటిన్ కూడా విడుదల చేశారు. గత 48 గంటలుగా ప్రీతికి ఎక్మోపై వైద్య చికిత్సలు అందిస్తున్నారు డాక్టర్లు.

Also Read..Medico Preethi Case : మెడికో ప్రీతి కేసులో పురోగతి.. 100 పేజీలతో నివేదిక సమర్పించిన కమిటీ

వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ (కేఎంసీ) లో సీనియర్ వేధింపులు తట్టుకోలేక పీజీ విద్యార్థిని, డాక్టర్ ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమెకు నిమ్స్ ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య బృందం చికిత్స అందిస్తోంది. ప్రీతి ఆరోగ్యం ఇప్పటికీ విషమంగానే ఉందని డాక్టర్లు వెల్లడించారు. నిమ్స్ డాక్టర్లు ప్రీతి ఆరోగ్య పరిస్థితిపై తాజా హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ప్రీతికి అత్యాధునిక వైద్యం అందిస్తున్నామని, ఆమెను బతికించేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నామని తెలిపారు.

‘ప్రస్తుతం ప్రీతికి ఎక్మో, వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నాం. ప్రీతి ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. మా ప్రత్యేక వైద్య బృందం ఆమెను బతికించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది’ అని నిమ్స్ డాక్టర్లు బులెటిన్ లో తెలిపారు. కేఎంసీలో పీజీ సెకండియర్ చదువుతున్న డాక్టర్ ఎంఏ సైఫ్ వేధింపుల వల్లే డాక్టర్ ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసిందని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు.

ప్రీతి కుటుంబ సభ్యుల ఆరోపణలు, మెడికల్ కాలేజీ, ఎంజీఎం ఆసుపత్రి వర్గాలు చెబుతున్న వివరాలు భిన్నంగా ఉండడంతో సెల్ ఫోన్, వాట్సాప్ గ్రూపులలో చాటింగ్ లను పరిశీలించినట్లు తెలిపారు. వాట్సాప్ హిస్టరీ పరిశీలించాక వేధింపులకు కొన్ని ఆధారాలు లభించినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్ సైఫ్ ను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు.

Also Read..Medico Preeti Case: ర్యాగింగ్ కాదు, ఆ కారణం వల్లే ఆత్మహత్యాయత్నం.. వైద్య విద్యార్థి ప్రీతి కేసుపై వరంగల్ సీపీ కీలక విషయాలు

వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో అనస్థీషియా పీజీ ఫస్టియర్ విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నం సంచలనం రేపింది. ఈ కేసులో విచారణ వేగవంతమైంది. ఈ ఘటనపై ప్రాథమిక విచారణ నివేదికను ప్రభుత్వానికి అందించారు ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్.

అసలేం జరిగింది?
జనగామ జిల్లా కొడకండ్ల మండలం మొండ్రాయి గ్రామానికి చెందిన ప్రీతి.. కాకతీయ మెడికల్ కాలేజీ(కేఎంసీ)లో పీజీ (అనస్థీషియా) ఫస్టియర్ చదువుతోంది. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో శిక్షణలో ఉన్న ప్రీతిని సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపులకు గురిచేశాడని ఆరోపణలు ఉన్నాయి. తీవ్ర మనస్థాపానికి గురైన ప్రీతి మత్తు ఇంజెక్షన్ తీసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని కుటుంబసభ్యులు తెలిపారు.

ఎమర్జెన్సీ ఆపరేషన్‌ థియేటర్‌ లో విధులు నిర్వహిస్తుండగా ప్రీతి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. స్పృహ లేని స్థితిలో ఉన్న ఆమెను వెంటనే అక్కడి నుంచి ఎమర్జెన్సీ వార్డులోకి తరలించి, అత్యవసర వైద్యం అందించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం నిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రీతి తీసుకున్న ఇంజెక్షన్లు ఆమె అవయవాలపై తీవ్ర ప్రభావం చూపించాయని, వెంటిలేటర్‌పై వైద్య చికిత్స అందిస్తున్నామని, ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. అనస్థీషియా విభాగంలో పనిచేస్తున్న ప్రీతి అనస్థీషియా ఇంజెక్షన్లు తీసుకున్నట్టు ప్రాథమికంగా తెలుస్తోంది. ప్రీతిని వేధించిన సైఫ్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. సైఫ్ స్వస్థలం హనుమకొండ జిల్లా కాజీపేట.