స్టోక్స్‌, కోహ్లీ మధ్య గొడవ

స్టోక్స్‌, కోహ్లీ మధ్య గొడవ

భారత్, ఇంగ్లాండ్ మధ్య సిరీస్‌లో నాల్గవదైన చివరి టెస్ట్ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని మొతెరా స్టేడియంలో జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన తరువాత కెప్టెన్ జో రూట్ మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకోగా.. భారత్ బౌలింగ్ చేస్తుంది. ఈ క్రమంలోనే అక్షర్‌ పటేల్‌ వేసిన 5వ ఓవర్‌ రెండో బంతికి ఓపెనర్‌ సిబ్లీ వికెట్ల ముందు దొరికిపోగా.. అక్షర్‌ వేసిన రెండో ఓవర్‌లో 9 పరుగులు చేసిన జాక్‌ క్రాలే భారీ షాట్‌కు యత్నించి సిరాజ్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుట్ అయ్యాడు.

టీమిండియా బౌలర్‌ మహ్మద్‌ సిరాజ్‌ ఇంగ్లండ్‌ను దెబ్బతీయగా.. తాను వేసిన ఇన్నింగ్స్‌ 12వ ఓవర్‌ తొలి బంతికే రూట్‌ను పెవిలియన్ పంపించాడు. దీంతో ఇంగ్లండ్‌ 30 పరుగుల వద్ద మూడో వికెట్‌ నష్టపోగా క్రీజులోకి వచ్చిన బెన్ స్టోక్స్.. కాసేపటికి మైదానంలో కెప్టెన్ కోహ్లీతో గొడవకు దిగాడు. ఈ సమయంలో ఇద్దరి మధ్య చర్చ చాలాసేపు కొనసాగింది. అంపైర్ కలుగజేసుకోవడంతో గొడవ తగ్గిపోయింది.

ఇంగ్లండ్ కెప్టెన్ రూట్ ఔటైన తర్వాత బ్యాటింగ్‌కు దిగిన స్టోక్స్‌కు మహ్మద్ సిరాజ్ ఓ బౌన్సర్‌తో సవాలు విసిరాడు. ఆ తర్వాత సిరాజ్‌ను స్టోక్స్ ఏదో అన్నాడు. దీంతో రంగంలోకి దిగిన కోహ్లి.. కాసేపు స్టోక్స్‌తో వాదించాడు. ఇద్దరి మధ్యా మాటామాటా పెరగడంతో అంపైర్ కలుగజేసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాతి ఓవర్లోనూ సిరాజ్‌, స్టోక్స్ మధ్య కాస్త మాటల యుద్ధం నడిచింది.

మరోవైపు లంచ్ బ్రేక్ సమయానికి ఇంగ్లాండ్ మూడు వికెట్లు కోల్పోయి 74పరుగులు చెయ్యగా.. స్టోక్స్, బెయిర్ స్టో క్రీజులో ఉన్నారు.