Russia Ukraine War : నాడు జర్మనీ కోసం హిట్లర్… నేడు రష్యా కోసం పుతిన్

దేశాలు వేరు. పాలకులు వేరు. కానీ.. వారి వ్యవహారశైలి ఒక్కటే. వాళ్లిద్దరూ.. నియంత్రణ లేని నియంతలే. అప్పుడు జర్మన్ల కోసం హిట్లర్ యుద్ధం మొదలుపెడితే.. ఇప్పుడు రష్యన్ల కోసం.. రష్యా కోసం.

Russia Ukraine War : నాడు జర్మనీ కోసం హిట్లర్… నేడు రష్యా కోసం పుతిన్

Putlar

Russia Ukraine war  : అడాల్ఫ్ హిట్లర్.. జర్మనీ నియంతే అయినా.. రెండో ప్రపంచ యుద్ధానికి కారకుడు. యుద్ధంతో.. ప్రపంచాన్నే ప్రమాదంలోకి నెట్టిన వాడు. ఇది.. 20వ శతాబ్దం నాటి మేటర్. ఇప్పుడు.. వ్లాదిమిర్ పుతిన్. రష్యా అధ్యక్షుడే అయినా.. యుక్రెయిన్‌పై యుద్ధమై దండెత్తిన నాయకుడు. ఇప్పుడు జరుగుతున్న యుద్ధానికి.. జర్మన్ డిక్టేర్ అయిన హిట్లర్‌కి సంబంధమేంటి? పుతిన్‌ని.. ఎందుకు హిట్లర్‌తో పోలుస్తున్నారు? వ్లాదిమిర్ పుతిన్.. అడాల్ఫ్ హిట్లర్‌గా మారారా? హిట్లర్ నడిచిన దారిలోనే.. పుతిన్ వెళ్తున్నారా? ప్రపంచం.. పుతిన్‌ని హిట్లర్‌తో ఎందుకు పోలుస్తోంది?

జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ గురించి.. ఈ ప్రపంచానికి మళ్లీ ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జాత్యహంకార చట్టం తెచ్చి.. 60 లక్షల మంది యూదులను ఊచకోత కోసి.. అతను సృష్టించిన మారణహోమం, అరాచకం.. ఈ ప్రపంచం ఎన్నటికీ మరిచిపోదు. నియంతగా అతని చర్యలు గుర్తు చేసుకుంటే చాలు.. హిట్లర్ అంటే ఏంటో తెలిసిపోతుంది. నియంత అనే పదానికి.. నిజరూపమే అడాల్ఫ్ హిట్లర్.

ఇప్పుడు.. యుద్ధంగా మారి యుక్రెయిన్‌పై దండెత్తుతున్న రష్యా అధ్యక్షుడు పుతిన్ గురించి కూడా.. కొత్తగా ఇంట్రడక్షన్‌లు అవసరం లేదు. రష్యా-యుక్రెయిన్ యుద్ధంలో.. పుతిన్, జెలెన్‌స్కీ పేర్లతో పాటు జర్మనీ డిక్టేటర్ హిట్లర్ పేరు కూడా వినిపించడమే ఇప్పుడు చర్చనీయాంశమైంది. యుద్ధం మొదలయ్యాక.. ప్రపంచవ్యాప్తంగా ఒక పేరు మార్మోగుతుంది. అదే.. పుట్లర్. కన్ఫ్యూజ్ అవ్వొద్దు. మీరు విన్నది కరెక్టే. పుట్లరే. పుతిన్‌ని, హిట్లర్‌ని మిక్స్ చేస్తే వచ్చిందే పుట్లర్. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ని.. హిట్లర్‌తో పోల్చేందుకు.. ఈ ప్రపంచం పెట్టిన పేరిది.

20వ శతాబ్దంలో.. జర్మనీలో యూదులను ఊచకోత కోసిన అడాల్ఫ్ హిట్లర్.. రెండో ప్రపంచ యుద్ధాన్ని రగిలించారు. ఆ వార్.. వరల్డ్ హిస్టరీనే మార్చేసింది. ఇప్పుడీ.. 21వ శతాబ్దంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా తన ఆధిపత్య ధోరణితో.. మరోసారి ప్రపంచాన్ని ప్రమాదంలోకి నెడుతున్నారన్న వాదనే వినిపిస్తోంది. ప్రపంచ దేశాలన్నీ పుతిన్‌ని.. హిట్లర్‌తో పోలుస్తున్నాయ్. సోషల్ మీడియాలో దీనిపై పెద్ద చర్చే నడుస్తోంది. పుతిన్ రూపం వెనుక దాగున్నది.. హిట్లరేనని చెప్పే ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయ్.

వ్లాదిమిర్ పుతిన్‌ని.. హిట్లర్‌తో పోలుస్తూ ప్రపంచవ్యాప్తంగా నిరసనలు కూడా వెల్లువెత్తుతున్నాయ్. అడాల్ఫ్ పుతిన్ అని కొందరు.. హిట్లర్ ప్లస్ పుతిన్ ఈక్వల్స్ టూ.. పుట్లర్ అని రకరకాల పేర్లతో.. రష్యా ప్రెసిడెంట్‌పై ఫైర్ అవుతున్నారు. యుక్రెయిన్‌పై.. దండయాత్రను ఆపాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇక.. పుతిన్‌ను చూసి హిట్లర్ నవ్వుతున్న కార్టూన్ కూడా గ్లోబ్ వైడ్‌ వైరలైంది. దీనిని.. క్రియేట్ చేసింది ఎవరో కాదు.. యుక్రెయిన్ ప్రభుత్వమే. యుక్రెయిన్‌ అఫిషియల్‌ ట్విట్టర్‌ అకౌంట్‌ నుంచే ఈ కార్టూన్‌ షేర్‌ అయింది.

ఐక్యరాజ్యసమితిలోనూ.. యుక్రెయిన్ రాయబారి కూడా పుతిన్‌ను హిట్లర్‌తో పోలుస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పుతిన్ ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే..  అందుకోసం న్యూక్లియర్ బాంబులను ఉపయోగించాల్సిన అవసరం లేదన్నారు. 1945 మేలో.. జర్మనీలో ఏం జరిగిందో గుర్తు చేసుకుంటే చాలని.. సెటైర్లు వేశారు.

ఇక.. ప్రపంచంలోని చాలా చోట్ల.. రష్యాకు వ్యతిరేక ఆందోళనలు కొనసాగుతుండగా.. అందులో చాలా బ్యానర్లు, పోస్టర్లలో పుతిన్‌ని హిట్లర్‌ను పోల్చుతూ ఉన్న ఫోటోలే కనిపిస్తున్నాయ్. రష్యాలోనూ.. ఇద్దరినీ పోలిస్తూ.. ఇద్దరి ముఖాలను మార్ఫింగ్ చేస్తూ.. పుట్లర్, పుట్లర్ అంటూ నినాదాలు చేస్తున్నారు.

హిట్లర్ పుతిన్ మధ్య ఉన్న పోలికలు ఏమిటి
దేశాలు వేరు. పాలకులు వేరు. కానీ.. వారి వ్యవహారశైలి ఒక్కటే. వాళ్లిద్దరూ.. నియంత్రణ లేని నియంతలే. అప్పుడు జర్మన్ల కోసం హిట్లర్ యుద్ధం మొదలుపెడితే.. ఇప్పుడు రష్యన్ల కోసం.. రష్యా కోసం.. పుతిన్ దండెత్తుతున్నాడు. నిజానికి.. పుతిన్, హిట్లర్ మధ్య ఉన్న పోలికలేంటి? వాళ్లిద్దరి చర్యలు ఏం సూచిస్తున్నాయ్?

వ్లాదిమిర్ పుతిన్, అడాల్ఫ్ హిట్లర్ సిద్ధాంతాలు రెండూ విరుద్ధమే. నడిచిన దారులూ వేరే. కానీ.. వాళ్లిద్దరి వ్యవహార శైలి మాత్రం ఒకటే. వాళ్లద్దరిలోనూ.. నియంత లక్షణాలే ఉన్నాయ్. హిట్లర్‌ది రేసిజం.. తమ నాజీ జాతే ఎక్కువనే భావనలో మునిగిపోయారు. కానీ.. పుతిన్‌ది ఆధిపత్య ధోరణి. అందరికంటే తానే ఎక్కువని భావిస్తుంటారు. ఈ ఇద్దరిలో ఉన్న ఒకే రకమైన ఆలోచనలు.. ప్రపంచాన్ని ప్రమాదంలోకి నెట్టేసే పరిస్థితికి తెచ్చాయ్.

తమకు ఎదురొచ్చిన ప్రాంతాలను.. ఎదిరించిన దేశాలను.. అడ్డంగా ఆక్రమించుకోవడమే హిట్లర్, పుతిన్ ఆలోచన. ఇందుకు.. అప్పటి హిట్లరైనా.. ఇప్పటి పుతిన్ అయినా.. ఎంచుకున్న మార్గం ఒక్కటే. అదే.. మిలటరీ ఆపరేషన్. పేరుకు చేసేది మిలటరీ ఆపరేషనే అయినా.. అది పక్కాగా దండయాత్రే. ఇద్దరూ.. యుద్ధాన్ని సమర్థించి.. దండెత్తిన వాళ్లే.

1939లో.. హిట్లర్ స్లోవేకియాను ఆక్రమించేందుకు ప్రయత్నించారు. ఇందుకు.. అక్కడ జర్మన్ మాట్లాడే వారే ఎక్కువగా ఉన్నారని చెప్పారు. స్లోవేకియా ప్రభుత్వం.. అక్కడున్న జర్మన్లకు స్వేచ్ఛ లేకుండా చేస్తోందని ఆరోపిస్తూ.. వాళ్లకు విముక్తి కల్పిస్తామని.. హిట్లర్ ప్రతిజ్ఞ చేశారు. అప్పటి సీన్ కట్ చేస్తే.. మళ్లీ 83 ఏళ్ల తర్వాత.. అది యుక్రెయిన్‌లో.. రష్యా దండయాత్రగా రిపీటైంది.

తూర్పు యుక్రెయిన్‌లో రష్యన్‌ భాష మాట్లాడే వారు ఎక్కువగా ఉంటారు. వాళ్లను దశాబ్దాలుగా యుక్రెయిన్‌ అణిచివేస్తోందనే.. ఆరోపణలున్నాయ్. అందువల్ల.. రష్యా సరిహద్దులకు దగ్గర్లోని.. తూర్పు యుక్రెయిన్ ప్రాంతాలు వేర్పాటువాదుల అధీనంలోనే ఉన్నట్లుగా తెలుస్తోంది. వాళ్లకు రష్యా అన్ని విధాలుగా సాయం అందిస్తూ వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో.. నాటో కూటమికి యుక్రెయిన్ దగ్గరవడం సహించలేని పుతిన్.. ముందుగా యుక్రెయిన్ ఆర్మీపైకి.. రెబెల్స్‌ని ఎగదోశారు. శాంతి స్థాపనకే తమ బలగాలు యుక్రెయిన్‌లో ప్రవేశించాయని చెప్పారు. ఇదంతా.. ఆనాటి హిట్లర్ చర్యల్లాగే చేశారు. అందుకే.. ప్రపంచవ్యాప్తంగా పుతిన్‌ని.. హిట్లర్‌తో పోలుస్తూ నిరసనలు వ్యక్తమవుతున్నాయ్.